e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home టాప్ స్టోరీస్ పెట్టుబడులకు కేరాఫ్‌ హైదరాబాద్‌

పెట్టుబడులకు కేరాఫ్‌ హైదరాబాద్‌

పెట్టుబడులకు కేరాఫ్‌ హైదరాబాద్‌

ఐటీ, ఫార్మా హబ్‌గా మారిన హైదరాబాద్‌.. ‘రియల్‌’ పెట్టుబడులకూ కేరాఫ్‌గా మారింది. దేశంలోని పలు రాష్ర్టాలు, నగరాలకు చెందిన ఎంతో మందికి.. ‘భాగ్యనగరం’ బాసటగా నిలుస్తున్నది. వారికి ఉపాధితోపాటు ఆశ్రయాన్నీ కల్పిస్తున్నది. ఇతర మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నైల కంటే.. హైదరాబాద్‌ ఎంతో మెరుగనే భావన వారిలో కలుగుతున్నది. దీంతో తమ స్వస్థలాల్లోకంటే.. ఇక్కడ ‘పెట్టుబడి’ పెడితేనే బాగుంటుందనుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది.

మహారాష్ట్రకు చెందిన గణేశ్‌ ఐదేండ్ల క్రితం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. మొదట కొన్నాళ్లపాటు ఇక్కడే ఉద్యోగం చేసి, ఆ తర్వాత పుణె లేదా ముంబైకి మారుదామనుకున్నాడు. అందుకే, మొదట్లో అద్దె ఇంట్లోనే ఉంటూ వచ్చాడు. నగర వాతావరణం ఎంతో నచ్చడంతో, రెండేండ్ల క్రితం.. సొంతింటిని కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. విషయాన్ని తోటి ఉద్యోగులకు చెప్పగా.. ‘మంచి నిర్ణయం’ అని ఎంకరేజ్‌ చేశారు. ఒకవేళ స్వస్థలానికి వెళ్దామనుకుంటే.. ఇంటిని విక్రయించినా ఎంతో లాభదాయకంగా ఉంటుందని సూచించారు. దీంతో వెంటనే నగర శివారులో మూడేండ్ల క్రితం వ్యక్తిగత ఇంటిని కొనుగోలు చేశాడు. అప్పుడు రూ.50 లక్షల వరకూ పెట్టుబడి పెట్టాడు. ఇటీవలే స్వస్థలానికి వెళ్తూ ఇంటిని అమ్మకానికి పెట్టగా, ధర రూ.80 లక్షలు పలికింది.

.. ఇలా ఒక గణేశ్‌ మాత్రమే కాదు. ఉపాధికోసం నగరానికి వచ్చినవారిలో అనేకమంది ఇక్కడే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎక్కువగా సొంత ఇల్లు లేదా అపార్టుమెంట్లలో ఫ్లాట్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. దీనికి కారణం.. హైదరాబాద్‌ మహానగరం అన్ని విధాలుగా, అన్ని ప్రాంతాల వారికీ అత్యంత అనుకూలంగా ఉండటమేనని ‘రియల్‌ ఎస్టేట్‌’ నిపుణులు చెబుతున్నారు.

సుస్థిర ప్రభుత్వం.. మెరుగైన వసతులు..

గతంలో నగరాభివృద్ధిపై ఉమ్మడి ప్రభుత్వాలు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఫలితంగా ఇక్కడ ఉండటానికి, పెట్టుబడులు పెట్టడానికి అనుకూల వాతావరణం లేదనే భావన ఉండేది. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సుస్థిర పాలనను అందించడంతో అనుమానాలన్నీ పటాపంచలైనాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత స్వస్థలాలకు వెళ్లిన వారు కూడా, మళ్లీ తిరిగి వచ్చేలా పరిస్థితులు మారాయి. ఇందుకు తెలంగాణ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలే ప్రధాన కారణం. విద్యుత్‌, రోడ్లు, మంచినీరు వంటి మౌలిక వసతుల్లో ఎలాంటి లోటూ లేకుండా చేసి, నగరంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.

ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు నగరవాసులను ముప్పుతిప్పలు పెట్టేవి. తాగునీరు ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితులుండేవి. ఇక నగర రోడ్లు, ట్రాఫిక్‌ నరకాన్ని తలపించేవి. కానీ, స్వరాష్ట్రం సిద్ధించిన ఆరు నెలల్లోనే విద్యుత్‌ కోతలకు చెక్‌ పడింది. 24 గంటలూ నాణ్యమైన విద్యుత్‌ అందుతున్నది. మంజీరా, జంట జలాశయాలైన గండిపేట, హిమాయత్‌సాగర్‌ల నుంచే కాకుండా కృష్ణా, గోదావరి నదులనుంచీ మంచినీరు సరఫరా చేస్తున్నది. మరో 30 ఏండ్ల వరకూ ఎలాంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇక నగరం చుట్టూ ఉన్న ఔటర్‌ రింగు రోడ్డుకు తోడు కోర్‌ సిటీనుంచి శివార్లను అనుసంధానించేలా 33 రేడియల్‌ రోడ్లు నిర్మించడంతో ‘ట్రాఫిక్‌ సమస్య’ ఊసే లేకుండా పోయింది. ఐటీ కారిడార్‌తోపాటు పలు రద్దీ ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, ఎస్‌ఆర్‌డీపీ ఫ్లై ఓవర్లతో కోర్‌ సిటీలో రోడ్డు ప్రయాణం సాఫీగా సాగుతున్నది. మరో 137 లింకు రోడ్లతో రవాణాపరంగా నగరం అత్యంత అనుకూలంగా తయారైంది. దీంతోపాటు దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో మెట్రో రైలు ప్రాజెక్టును పూర్తి చేసింది. మూడు కారిడార్లలో 69 కి.మీ. మేర నిర్మితమైన ‘మెట్రో’తో నగరవాసులకు ఎంతో అనుకూలమైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. – బరిగెల శేఖర్‌

ఐటీతోపాటు రియల్‌

ఒకప్పుడు దేశంలో ‘ఐటీ రంగం’ అంటే ‘బెంగళూరు’ అనే భావనే కలిగేది. దాన్ని తెలంగాణ రాష్ట్రం క్రమంగా మార్చి వేసింది. బెంగళూరుకు ప్రధాన పోటీగా.. ఇంకా, అంతకు మించి అనేలా హైదరాబాద్‌ నగరం నిలిచింది. గత ఆరేండ్లలో భాగ్యనగరం నుంచి జరిగిన ఐటీ ఎగుమతులే ఇందుకు నిదర్శం. 2014-15 వార్షిక సంవత్సరంలో 58 లక్షల ఎగుమతులుంటే, 2019-20 వార్షిక సంవత్సరంలో 1.28 కోట్లకు చేరింది. ఈ గణాంకాలు హైదరాబాద్‌ ఐటీరంగం వృద్ధికి నిదర్శనంగా మారితే, అదే స్థాయిలో ‘రియల్‌ ఎస్టేట్‌’కూడా అభివృద్ధి చెందుతున్నది. దేశంలోని ఏ మెట్రో నగరంలోనూ లేనటువంటి వృద్ధిరేటు ఇక్కడ నమోదవుతున్నది. ‘కరోనా’తో ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలమై ఇప్పటికీ పూర్తి స్థాయిలో కోలుకోలేని స్థితిలో ఉన్నాయి. కానీ, హైదరాబాద్‌ మాత్రం ఐటీ రంగంతోపాటు రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనూ ఆకర్షణీయమైన, స్థిరమైన వృద్ధిరేటును నమోదు చేస్తూనే ఉన్నది. తాజాగా, రియల్‌ ఎస్టేట్‌ సేవల దిగ్గజం ‘నైట్‌ ఫ్రాంక్‌’ విడుదల చేసిన ‘గ్లోబల్‌ రెసిడెన్షియల్‌ సిటీస్‌ ఇండెక్స్‌-క్యూ4-2020’ నివేదిక ఈ విషయాన్నే స్పష్టం చేసింది. గతేడాది చివరి త్రైమాసికంలో ఇండ్ల ధరలు పెరిగిన పరిస్థితి ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే కనిపించిందని ఈ నివేదిక పేర్కొన్నది. అంతకు ముందు ఏడాది కాలంలో ఇదే కాలంతో పోల్చి చూస్తే హైదరాబాద్‌ ఇండ్ల ధరలు 0.20 శాతం పెరిగినట్లు వెల్లడించింది. అదే సమయంలో బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్‌ నగరాల్లో ధరలు తగ్గుముఖం పట్టినట్లు నైట్‌ ఫ్రాంక్‌ నివేదిక తేల్చింది.

ప్రోగ్రెసివ్‌ పాలసీలు

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పాలసీలు నగర ప్రగతికి పట్టం కడుతున్నాయి. ముఖ్యంగా ఫార్మా, ఐటీ, అగ్రికల్చర్‌ రంగాలు హైదరాబాద్‌ అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. ఇతర నగరాలతో పోలిస్తే రియల్‌ ఎస్టేట్‌ రంగం మెరుగ్గా ఉండటానికి కారణం.. రాష్ట్రంలో ప్రగతి ఎంతో వేగం పుంజుకోవడమే. దీని మూలంగానే నగరానికి పెద్దమొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయి. సుస్థిర ప్రభుత్వ నిర్ణయాలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారీ పెట్టుబడులు నగరాన్ని ముంచెత్తుతున్నాయి. అందుకే, రియల్‌ ఎస్టేట్‌రంగంలో యేటా వృద్ధిరేటు అంతటి స్థాయిలో నమోదవుతూ వస్తున్నది.

పెట్టుబడులకు కేరాఫ్‌ హైదరాబాద్‌

జీ.వీ.రావు, అధ్యక్షుడు, తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌

Advertisement
పెట్టుబడులకు కేరాఫ్‌ హైదరాబాద్‌
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement