వేసవికాలం వచ్చేసింది. భరించలేని ఉక్కపోత నుంచి బయట పడటానికి ఏసీలు, కూలర్లు కావాల్సిందే. అయితే, ఏసీలు వినియోగించడం తేలికే అయినా, కూలర్లను వినియోగిస్తుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
కూలర్లలోని నీటిని వారానికోసారి ఖాళీ చేయాలి. ట్యాంక్‌ను శుభ్రంగా కడుగాలి. దీనివల్ల నీటిలోని ప్రమాదకర సూక్ష్మజీవులు నశిచడంతోపాటు దుర్వాసన రాకుండా ఉంటుంది. అవసరమైతే కూలర్ సెంట్లు కూడా వాడుకోవచ్చు.
కూలర్లలోని కూలింగ్ ప్యాడ్లు సరిగ్గా తడుస్తున్నాయో.. లేదో చూసుకోవాలి. అవి పూర్తిగా తడవకున్నా, వాటి మధ్య ఖాళీ స్థలం ఉన్నా చల్లగాలి రాదు.
కూలర్లను వినియోగిస్తున్నప్పుడు తలుపులు, కిటికీలను మూసేసి ఉంచితే ఇంట్లో తేమశాతం పెరిగిపోతుంది. ఫలితంగా తీవ్రమైన ఉక్కపోతకు దారితీస్తుంది. ఊపిరాడని పరిస్థితి తలెత్తుతుంది. గదికి వెంటిలేషన్ ఉండటమే దీనికి పరిష్కారం. గదిలోని గాలి బయటకు.. బయటి గాలి లోపలికి వస్తేనే ఎయిర్ కూలర్లు బాగా పనిచేస్తాయి.
కూలర్లలో నీరు తగ్గిపోతే వెంటనే మోటర్‌ను ఆఫ్ చేయాలి. కూలర్ ఆన్‌లో ఉన్నప్పుడు నీళ్లు నింపేందుకు ప్రయత్నించవద్దు. దాని వల్ల నీళ్లు ఫ్యాన్ మోటర్, ఇతర ఎలక్ట్రిక్ భాగాలపై పడి పాడైపోయే అవకాశం ఉన్నది.