ముషీరాబాద్ : మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తూ ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాకారమవుతుందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. సోమవారం అక్షర స్పూర్తి మహిళా సంస్థ ఆధ్వర్యంలో చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు.
స్త్రీలు ఆర్థికంగా బలపడితే కుటుంబం శక్తివంతమవుతుందని అన్నారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఇంటిని చక్కబెడుతున్న మహిళలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, ఇటీవలి కాలంలో ఎదురవుతున్న గర్భాశయ, బ్రెస్ట్ క్యాన్సర్ల పట్ల జాగ్రత్తగా ఉంటూ తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఒబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎన్వైకె అధికారి కుష్భు, అలీప్ అధ్యక్షురాలు రమాదేవి, అక్షర స్పూర్తి నిర్వహకులు కె.ఉమ, కార్పొరేటర్లు పావని, సుప్రియా గౌడ్, శిరీష, రజినీ, శైలజ, సునీత తదితరులు పాల్గొన్నారు.