ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 11 : ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యతో పాటు విజ్ఞానాన్ని అందించడంలో నోముల పాఠశాలకు జిల్లాలోనే ప్రత్యేకత ఉన్నది. చిన్నారుల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాల వద్దు.. ప్రభుత్వ పాఠశాలనే ముద్దు అని భావిస్తున్నారు. అర్హులైన ఉపాధ్యాయులతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మధ్యాహ్న భోజనం కూడా పెడుతుండడంతో ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గుచూపుతున్నారు. రంగారెడ్డి జిల్లా, మంచాల మండలంలోని నోములు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల మెప్పు పొందుతున్నది. విద్యతో పాటు విజ్ఞానం, మహనీయుల చరిత్ర తెలిపేలా పాఠశాలను తీర్చిదిద్దారు. తరగతి గదితో పాటు గోడలపై సులువుగా అర్థమయ్యే రీతిలో బొమ్మలు, దేశానికి సేవచేసిన మహనీయుల చిత్రాలను వేసి వారి జీవిత చరిత్రను విద్యార్థులకు వివరిస్తున్నారు. పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుకురావడంతో జిల్లాలోనే ఒక మోడల్ పాఠశాలగా రూపుదిద్దుకున్నది. జిల్లాలో 1307 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అర్బన్ పథకం కింద ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పాఠ్యాంశాల్లోని బొమ్మలను గోడలపై వేయడంతో పాఠశాల వాతావరణం కొత్తగా కనిపిస్తున్నది. విద్యార్థులు మరిచిపోలేని విధంగా ఈ చిత్రాలు ఉన్నాయి. తెలుగు, హిందీ వర్ణమాల, శరీర భాగాలు, ప్రపంచపటం, ఇండియాపటం, సెవెన్వండర్స్, ఇండియాలో ముఖ్యమైన ప్రదేశాలు ఇలా ఎన్నో బొమ్మలను వేశారు. విద్యార్థులను తీర్చిదిద్దుతున్న తీరుకు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బొమ్మలతో ఆసక్తి..
పాఠశాల గోడలపై చిత్రాలు వేయడంతో ప్రతి విద్యార్థి ఆసక్తిగా చూస్తూ గుర్తుపెట్టుకుంటున్నాడు. మొక్కల పెంపకం, మహనీయుల చిత్రాలు, సౌరకుటుంబం, శరీర అవయవాలు, వివిధ రీతుల్లో ఇండ్ల నిర్మాణాలు, పాఠశాల పిల్లర్లు, గోడలపై ఏబీసీడీలతో పాటు హిందీ వర్ణమాల వంటి వాటిని వేయించాం. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సౌకర్యాలు ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలో చేర్పిస్తున్నారు.
ప్రతి విద్యార్థిని చేర్పిస్తున్నాం..
గ్రామంలోని ప్రతి విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు కృషి చేస్తున్నాం. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్య, విజ్ఞానాన్ని అందిస్తున్నది. పాఠశాల గోడలపై తీర్చిదిద్దిన చిత్రాలు విద్యార్థులను ఆకట్టుకునే రీతిలో ఉన్నాయి. ఈ చిత్రాలతో విద్యార్థులకు సులువుగా అర్థమవుతుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.