అంబర్‌పేట : పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం పిల్లలకు టీకాలు వేయించడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నల్లకుంట డివిజన్ విద్యానగర్‌లోని దుర్గాభాయి దేశ్‌ముఖ్ మహిళా సభ ఆవరణలో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 15-18 ఏళ్ల చిన్నారులకు నిర్వహించిన కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నదని, అందుకే తెలంగాణలోని 22.78 లక్షల మందికి టీకా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. అంబర్‌పేట నియోజకవర్గంలోని కాచిగూడ నెహ్రూనగర్, తిలక్‌నగర్ యూపీహెచ్సీ, బాగ్‌అంబర్‌పేట యూపీహెచ్సీ, డీడీఎంఎస్ యూపీహెచ్సీ, ఫీవర్ దవాఖానలో 15-18 ఏళ్ల పిల్లలకు టీకాలు వేసేందుకు కేంద్రాలను నెలకొల్పడం జరిగిందని చెప్పారు.
ఆయా కేంద్రాలకు తమ పిల్లలను తీసుకెళ్లి టీకా వేయించాలని సూచించారు. చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారిని కరోనా నుండి కాపాడుకుందామన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించి కోవిడ్ నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. టీకా పట్ల పిల్లల్లో ఉన్న అపోహలు తొలగించి వారికి అవగాహన కల్పించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డా.హరిశ్రీ, సిబ్బంది సుజాత, పరిమళ, సువర్ణ, మహేశ్వరి, బిందు, శైలజ, చంద్రకళ, ఆశావర్కర్లు లావణ్య, అనురాధ, ప్రియాంక, దుర్గాప్రసన్న, నాగమణి తదితరులు పాల్గొన్నారు.