నిజామాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ జిల్లాలో ఏటా వానకాలం, యాసంగి పంటలు సమృద్ధిగా పండుతాయి. సాగు నీళ్ల అవకాశాల మేరకు రైతులు విత్తు వేయడం, సాగు బాట పట్టడం పరిపాటే. అయితే, గతంలో సీజన్ ముంచుకొస్తుందంటేనే రైతన్నలకు గుండెదడ పుట్టేది. పెట్టుబడికి చిల్లిగవ్వ లేక నానా తంటాలు పడేది. పంటపై వచ్చిన ఆదాయమంతా వడ్డీలకు, అప్పుల చెల్లింపులకే సరిపోయేది. చాలీచాలని లాభాలు కాస్త కుటుంబపోషణ భారమయ్యేది. తదుపరి పంట పెట్టుబడికి మాత్రం పైసల్ మిగిలేది శూన్యం. ఈ దీనస్థితిలో రైతు దిక్కులేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించేది. లేదంటే గ్రామంలో పెద్దల వద్ద మోకరిల్లాల్సి వచ్చేది. రూ.2 నుంచి రూ.4వడ్డీ రేటుతో ఏకంగా రుణ బంధీలుగా మారి సతమతమయ్యేది. తీరా చేసేదిలేక రుణ విముక్తి కోసం ఉరి కంభం ఎక్కే గడ్డు పరిస్థితులు గత పాలకుల సమయంలో కోకొల్లలుగా వెలుగు చూశాయి. ఇలాంటి గడ్డు పరిస్థితికి సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన సంస్కరణలతో అడ్డుకట్ట పడింది. ఏడేండ్ల కాలంలో రైతులను ఆనందపెడుతూ, సాగును సంబురంలా మారుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల రుణ సంకెళ్లను బద్దలు కొట్టి స్వేచ్ఛను ప్రసాదిస్తున్నారు. 2018లో పురుడు పోసుకున్న రైతుబంధు పథకం మరోమారు రైతు ఖాతాలో జమ చేసేందుకు సర్కారు సమాయత్తం అవుతున్నది. యాసంగి పెట్టుబడి సాయం అందించేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో కర్షకలోకం ఆనందం వ్యక్తంచేస్తున్నది.
ఇప్పటి వరకు రైతుబంధు మంజూరు ఇలా..
2018లో ఆరంభమైన రైతుబంధు పథకం డబ్బులను వానకాలం పంట నుంచి పంపిణీ చేశారు. తొలి విడుతలో నిజామాబాద్ జిల్లాలో 2లక్షల 36వేల 409 మందికి రూ.203.61 కోట్లు మంజూరవ్వగా రూ.179.73 కోట్లు పంపిణీ చేశారు. 2018-19 యాసంగిలో రెండో విడుత కింద 2లక్షల 29వేల 674 మందికి రూ.204.44 కోట్లు విడుదలయ్యాయి. రూ.191.08 కోట్లు పంపిణీ చేశారు. 2019 వానకాలంలో మూడో విడుత 2లక్షల 36వేల 401 మందికి రూ.258.93 కోట్లు మంజూరవ్వగా రూ.237.70 కోట్లు జమ చేశారు. 2019-20 యాసంగికి నాలుగో విడుతగా 2లక్షల 17వేల 58 మందికి రూ.237.64 కోట్లు మంజూరవ్వగా రూ.183.34 కోట్లు బ్యాంక్ అకౌంట్లలో వేశారు. 2020 వానకాలంలో ఐదో విడుత కింద 2లక్షల 53వేల 227 మందికి రూ.270.73 కోట్లు మంజూరవ్వగా రూ.264.24కోట్లు పంపిణీ చేశారు. 2020-21 యాసంగిలో ఆరో విడుత కింద 2లక్షల 56వేల 299 మంది రైతులకు రూ.272.03 కోట్లు మంజూరు చేశారు. రూ.265.75 కోట్లు పంపిణీ జరిగింది. 2021 వానకాలంలో ఏడో విడుతలో 2లక్షల 61వేల 273 మందికి రూ.271.67కోట్లు మంజూరవ్వగా రూ.264.94 కోట్లు పంపిణీ చేశారు. 2021-22 యాసంగిలో భాగంగా ఎనిమిదో విడుతకు రైతుల వివరాలను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. దాదాపు 2లక్షల 50వేల పైచిలుకు మంది రైతులకు ఈ యాసంగిలోనూ రైతుబంధు సాయం అందనున్నది. ఇందుకోసం రూ.270 కోట్లు విడుదల కానున్నాయి. ఈ నెల 28వ తేదీ నుంచి పెట్టుబడి సాయం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. గతంలో మాదిరిగానే కమతాల వారీగా విస్తీర్ణం ఆధారంగా తక్కువ నుంచి ఎక్కువ పద్ధతిలో నగదు బదిలీ చేయనున్నారు.
దరఖాస్తులకు అవకాశం..
2021 డిసెంబర్ 10వ తేదీ వరకు పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్న వారంతా యాసంగిలో పంపిణీ చేయబోయే రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. గత వానకాలంలో రైతుబంధు స్వీకరించిన వారికి యథాతథంగా నగదు జమ అవుతుంది. కాకపోతే వ్యవసాయ భూముల క్రయవిక్రయాలతో యజమానుల పేర్లలో మార్పులు, చేర్పు లు చోటుచేసుకొని ఉంటే అలాంటి వారు నూతనంగా దరఖాస్తు చేసుకునేందుకు సర్కారు వెసులుబాటు కల్పించింది. ఈమేరకు పట్టా ఉన్న ప్రతి రైతుకూ ఎకరానికి రూ.5వేలు చొప్పున ఖాతాల్లో వేసేలా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే గ్రామాల వారీగా రైతు వివరాలు, పట్టాదారు, బ్యాంక్ అకౌంట్ వివరాలు ప్రభుత్వం వద్ద నిక్షిప్తమై ఉన్నాయి. కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులను పరిగణలోకి తీసుకోనున్నారు. సర్కారు ఆదేశాలతో లబ్ధిదారుల జాబితాను అధికారులు ప్రక్షాళన చేశారు. ఆధార్, బ్యాంక్ అకౌంట్ సరిగా లేని వాటిని సరిచేశారు. ఇది వరకే భూమిని అమ్ముకున్న వారిని జాబితా నుంచి తొలగించారు. మొత్తం గా 15వేల మంది అకౌంట్లలో మార్పులు, చేర్పులు జరిగా యి. దీంతో లబ్ధిదారుల సంఖ్య పెరిగే ఆస్కారం ఉంది.
రైతుబంధు మురిపెం..
ఇన్నాళ్లపాటు బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల వద్ద పెట్టుబడులు సమకూర్చుకున్న రైతులు.. ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సాగు పెట్టుబడులకు సర్దుకుంటున్నారు. రైతుబంధు పెట్టుబడి సాయంతో ఆర్థిక ఇబ్బందులు తీరాయని చిన్న, సన్నకారు రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాగు సమయం దగ్గర పడుతుంటే గతంలో ఆందోళన ఉండేదని, ఇప్పుడు సమయానికి ముందే చేతికి డబ్బు రావడంతో భరోసాగా ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. పంట సీజన్లో పెట్టుబడికి పైసల్లేక సాగును వదిలేసిన సామాన్య రైతులు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వమే పెట్టుబడికి డబ్బులు ఇస్తుండడంతో చిన్న, సన్నకారు రైతులకు ఊరట దక్కుతున్నది. పెట్టుబడికి డబ్బుల ఢోకా లేకపోవడంతో బీడు భూములను ధైర్యంగా సాగు చేస్తున్నారు. ఫలితంగా పంటల సాగు విస్తీర్ణం పెరగడంతోపాటు ఉత్పత్తి సైతం గణనీయంగా పెరుగుతున్నది.