పల్లె ప్రగతితో మారిన రూపురేఖలు
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక నిధులు
ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలి
పంచాయతీలకు ఫాగింగ్ మిషన్ల పంపిణీలో మంత్రి సబితారెడ్డి
తాండూరు, డిసెంబర్ 10 : పట్టణాలకు దీటుగా పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితారెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని తులసీగార్డెన్లో నియోజకవర్గంలోని 123 గ్రామ పంచాయతీలకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, సురభి వాణీదేవి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఫాగింగ్ మిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి, హరితహారంతో పల్లెలు పరిశుభ్రంగా కనిసిస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని ప్రతి పంచాయతీలో డంపింగ్‌యార్డు, వైకుంఠధామం, ప్రకృతివనంతో పాటు రైతు వేదికల నిర్మాణాలతో చక్కటి మార్పు సంతరించుకుందని తెలిపారు. తాండూరు నియోజకవర్గంలోని 143 గ్రామ పంచాయతీల్లో ఫాగింగ్ మిషన్లను అందజేసిన ఘనత ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికే దక్కుతుందని అభినందించారు. మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డుకు ఫాగింగ్ మిషన్ ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. పట్టణంలోని వార్డులతో పాటు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకునేలా ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ నెల చివరి వరకు ప్రతి పంచాయతీలో 100శాతం వ్యాక్సిన్ పూర్తికావాలని ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, సురభి వాణీదేవి మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవనం కోసం గ్రామాలను ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. క్రిమికీటకాల నివారణకు గ్రామాలకు ఫాగింగ్ మిషన్‌ను అందజేస్తున్నట్లు తెలిపారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ పల్లెల్లోని ప్రజలు ఆరోగ్యంతో పాటు స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లోని ప్రతి గ్రామ పంచాయతీకి ఫాగింగ్ మిషన్‌ను అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, ఆర్డీవో అశోక్‌కుమార్, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్‌నాయక్, పెద్దేముల్ ఎంపీపీ అనురాధ, యాలాల ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా, తాండూరు జడ్పీటీసీ గౌడి మంజుల, బషీరాబాద్ జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌లు, కార్యదర్శులు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
కోట్‌పల్లి, డిసెంబర్ 10 : రైతు సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితారెడ్డి అన్నారు. శుక్రవారం కోట్‌పల్లి మండల నూతన మార్కెట్ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథులుగా మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవీ, ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్‌రెడ్డి, ఆనంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతు పక్షపాతిగా పని చేస్తున్నదని, విత్తనాలను మొదలుకొని పంట దిగుబడిలోనూ మద్దతు ధరను కల్పిస్తున్నదన్నారు. రైతు వెన్నంటే ఉండి రైతాంగ అభివృద్ధికి నిరంతరం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఉద్యమ కారులైన ఉప్పరి మహేందర్, దశరథ్గౌడ్లను కోట్‌పల్లి మండల నూతన మార్కెట్ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎంపిక చేయడం సంతోషకరమన్నారు. గత పాలక వర్గం కోట్‌పల్లి మార్కెట్ కమిటీ గోడౌన్ నిర్మాణం కోసం నివేదికను అందించారని, అది పెండింగ్‌లో ఉందని మంత్రి దృష్టికి నూతన పాలకవర్గ సభ్యులు తేగా స్పందించిన మంత్రి వెంటనే సంబంధిత శాఖతో మాట్లాడారు. త్వరలో మంజూరు చేయాలని చెప్పారని, ఇక నూతన మార్కెట్ కమిటీ గోడౌన్ నిర్మాణం చేసి రైతులకు ఇబ్బందులు తీర్చాలని కోరారు. రైతులు వరికి బదులుగా ఇతర పంటలనే వేసుకుని లాభాలు పొందేలా వ్యవసాయాధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలోని ఆరు పంచాయతీల అభివవృద్ధికి 90 లక్షల డీఎంఎప్టీ నిధులను కేటాయించి అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కోట్‌పల్లి ప్రాజెక్టు వాటర్‌ను రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు రీ మోడలింగ్ కోసం రూ.110 కోట్లు నిధులకు నివేదికను పంపించామని, రాగానే రైతు సాగుకు ఇక నీటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ సభ్యులు శుభప్రద్‌పటేల్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, మండల అధ్యక్షుడు అనిల్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, వైస్ ఎంపీపీ మల్ల ఉమాదేవీ, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.