బంట్వారం, డిసెంబర్ 11 : క్షేత్రస్థాయిలో అధికారులు తమ విధులను సక్రమంగా, అంకితభావంతో నిర్వహించాలని ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. ‘మీతో నేను’ కార్యక్రమంలో భాగంగా, మండల పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామంలో ఆయన పర్యటించి, పలు సమస్యలపై స్థానిక ప్రజలతో ముఖాముఖి చర్చించారు. మిషన్ భగీరథ నీరు గుట్టపైకి రావడం లేదని, ఈ సమస్యను స్థానిక సిబ్బందికి చెప్పినా పట్టికోవడం లేదని చెప్పారు. దీంతో వెంటనే ఏఈ వేణుమాధవ్‌ను పిలిచి రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించి, తాగు నీరును ప్రతి ఇంటికి అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్థానికంగా పని చేస్తున్న ఏఎన్ఎం గ్రామానికి రావడం లేదని గ్రామాస్తులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఈ సమస్యపై వైద్యాధికారి కృష్ణను ప్రశ్నించగా, ఏఎన్ఎం గైర్హాజరయ్యారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ, ఇలా విధులకు హాజరుకాని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యాధికారికి సూచించారు. గ్రామంలో లూజ్ లైన్లు మార్చాలని, రోడ్డు సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను తొలగించాలని విద్యుత్ అధికారులకు పలు మార్లు చెప్పినా సరిచేయడం లేదని గ్రామస్తులు ఎమ్మెల్యేకు తెలిపారు. విద్యుత్ సరఫరా కోసం డీడీలు కట్టి ఐదు ఏండ్లు అవుతున్నా తమకు ఇప్పటికీ కనెక్షన్ ఇవ్వడం లేదని స్థానిక రైతు రత్నం ఎమ్మెల్యేకు విన్నవించాడు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే వెంటనే డీఈతో ఫోన్లో మాట్లాడి సమస్యను వారం రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు. స్థానికంగా పని చేస్తున్న వెటర్నరీ సక్రమంగా తమ గ్రామానికి రావడం లేదని, ఇక్కడికి వచ్చే గోపాల మిత్రలు రైతుల వద్ద డబ్బులు తీసుకొని చికిత్స చేస్తున్నారని పలువురు రైతులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. పశువైద్యాధికారి కుమారస్వామిని ఎమ్మెల్యే మందలించి, ఇలాంటి చర్యలకు మరో మారు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో 24 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ పేద ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకొని, ఆడపిల్లలు తల్లిదండ్రులకు భారం కారాదని భావించి, పెండ్లి ఖర్చుల కోసం లక్షా నూట పదహారు రూపాయలను అందజేస్తున్నారని గుర్తు చేశారు. అనంతరం పార్టీ కారకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు నర్సింహులు, లావణ్య, డిప్యూటీ తాసిల్దార్ నాగార్జునరెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు నర్సింహులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు స్ఫూర్తి, గోవింద్‌రెడ్డి, బల్వంత్‌రెడ్డి, నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ నేత రాములు యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ రామచంద్రారెడ్డి, నాయకులు చందుసింగ్, మల్లేశం, శరణురెడ్డి, శ్రీనివాస్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ఖాజాపాషా పాల్గొన్నారు.