యాలాల, డిసెంబర్ 11 : యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా రైతులకు సూచించారు. శనివారం మండల కేంద్రంలో ఆరుతడి పంటలపై రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భూసారం కాపాడుకునే విధంగా రైతులు ఆరుతడి పంటలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఖర్చు తక్కువ లాభాలు ఎక్కువ అందించే తృణ ధాన్యాలు సాగు చేసుకోవాలని సూచించారు. ఏడీఏ శంకర్‌రాథోడ్ మాట్లాడుతూ ఆరుతడి పంటలకు సర్వ సాధారణంగా వచ్చే లద్దె పురుగు నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఏవో జ్యోత్స్న ప్రియదర్శిని, రవీందర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
నూనెగింజలు, పప్పుదినుసుల పంటలు సాగుచేయాలి
కులకచర్ల, డిసెంబర్ 11 : యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేయాలని కులకచర్ల ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్‌నాయక్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు పీరంపల్లి రాజు అన్నారు. శనివారం కులకచర్ల మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో ఆరుతడి పంటలపై సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు, రైతుబంధు సమితి గ్రామ అధ్యక్షులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాసంగిలో నూనెగింజలు, పప్పుదినుసుల పంటలు మాత్రమే సాగుచేయాలని అన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, కులకచర్ల సర్పంచ్ సౌమ్యావెంకట్‌రాంరెడ్డి, ఎంపీటీసీ ఆనందం, చౌడాపూర్ ఎంపీటీసీ శంకర్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు శంకర్‌నాయక్, మండల వ్యవసాయ శాఖ అధికారి వీరస్వామి, ఏఈవో ప్రసన్న, అనిత, బాబు, ఆయా గ్రామాల రైతులు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు బంధు సమితి గ్రామ అధ్యక్షులు పాల్గొన్నారు.
ఆరుతడి పంటలనే సాగు చేయాలి
బొంరాస్‌పేట, డిసెంబర్ 11 : మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తే రైతులకు లాభాలు వస్తాయని ఎంపీపీ హేమీబాయి అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. యాసంగిలో రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. జడ్పీటీసీ చౌహాన్ అరుణాదేశు మాట్లాడుతూ రైతులు మార్కెట్, డిమాండ్‌పై అవగాహన పెంచుకుని పంటలు పండించాలని సూచించారు. వరిసాగు విషయంలో కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తున్నందునే ఇతర పంటలు సాగు చేయాలని ప్రభుత్వం సూచిస్తుందని చెప్పారు. యాసంగిలో ఎంత విస్తీర్ణంలో వేరుశనగ సాగు చేస్తారో రైతులు చెబితే విత్తన రాయితీ గురించి కలెక్టర్‌ను అడుగుతామని అరుణాదేశు వివరించారు. వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి మాట్లాడుతూ వరివేసి రైతులు నష్టపోవద్దనే ప్రభుత్వం ఇతర పంటల సాగును ప్రోత్సహిస్తుందన్నారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, ఏవో రాజేశ్‌కుమార్, ఏఈవోలు, సర్పంచ్‌లు, రైతులు పాల్గొన్నారు.
దేవర్‌ఫస్లవాద్ గ్రామంలో
దౌల్తాబాద్, డిసెంబర్ 11 : యాసంగి సీజన్లో రైతులు వరికి బదులుగా ఇతర పంటలు వేయాలని వ్యవసాయా అధికారుల ఆధ్వర్యంలో శనివారం మండలంలోని దేవర్‌ఫస్లవాద్ గ్రామంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఈవో నిఖిల్ మాట్లాడుతూ లాభాలు వచ్చే పంటలపై రైతులు మొగ్గుచూపాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, రైతులు పాల్గొన్నారు.
దోమ మండల కేంద్రంలో..
దోమ, డిసెంబర్11 : ఆరుతడి పంటల సాగుపై రైతులకు ప్రజాప్రతినిధులు గ్రామ కోఆర్డినేటర్లు అవగాహన కల్పించాలని మండల వ్యవసాయ అధికారి శ్వేతాకుమారి అన్నారు. శనివారం దోమ మండల కేంద్రంలోని రైతువేదికలో రైతు బంధు మండల కోఆర్డినేటర్ లక్ష్మయ్యముదిరాజ్ మండల పరిధిలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఆయా గ్రామాల రైతుబంధు కోఆర్డినేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు బంధు మండల కోఆర్డినేటర్ లక్ష్మయ్యముదిరాజ్, వైస్ ఎంపీపీ మల్లేశం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని ఈ యాసంగిలో కొనుగోలు చేయలేమని తేల్చి చెప్పిందన్నారు. ఈ సందర్భంగా వారు ఆరుతడి పంటల సాగు క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులకు గ్రామ స్థాయిలో సూచిస్తామని సమావేశానికి హాజరైన వారు హామీ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీటీసీ అనిత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్‌గౌడ్, కోఆప్షన్ సభ్యుడు ఖాజాపాషా, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కో ఆర్డినేటర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు బాబ్యానాయక్, చెన్నయ్య, కావ్య, ప్రసన్న పాల్గొన్నారు.