
కొల్చారం, జనవరి 2 : వానకాలంలో భారీ వర్షాలకు పత్తి, మినుము, పెసర్లు తదితర పంటలకు తీరని నష్టం జరుగగా.. అంతరపంటగా వేసిన కంది విరగకాయడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఈ సంవత్సరం ప్రభుత్వం కంది క్వింటాల్ ధర రూ.6,300గా నిర్ణయించింది. వానకాలం సీజన్లో మొక్కజొన్న, పత్తిచేలలో కందిని అంతరపంటగా సాగుచేయడంతో ఇపుడిప్పుడే కోతదశకు వస్తున్నది. మండల పరిధిలోని ఎనగండ్ల, ఏటిగడ్డమాందాపూర్, పైతర తదితర గ్రామాల్లో పత్తిచేనులో అంతరపంటగా, అంసాన్పల్లి, వరిగుంతం, రంగంపేట, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో మొక్కజొన్న చేనులో అంతరపంటగా కంది సాగుచేశారు. భారీ వర్షాలకు పత్తిపంటకు తీరనినష్టం జరుగగా.. మొక్కజొన్న కూడా దిగుబడులు అంతగా రాలేదు. కందిపంట బాగా కాసింది.
కందిచేలు బాగున్నాయి..
వానకాలం అధిక వర్షాలు పడడంతో మక్క, పత్తిచేలకు నష్టం జరిగింది. అంతరపంటగా వేసిన కంది బాగున్నది. మొక్కజొన్న, పత్తిసాగులో నష్టాలు వచ్చాయి. కంది దిగుబడులతో రైతుల కష్టాలు తీరుతాయని భావిస్తున్నా. రైతులు వరిపంటపైనే దృష్టి పెట్టకుండా ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలి.
-బాల్రెడ్డి, మండల వ్యవసాయాధికారి, కొల్చారం