వనపర్తి, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : ప్రమాదాలు జరుగుతున్నా ప్రజల్లో అప్రమత్తత ఉండడంలేదు. చేతికొచ్చిన కొడుకులు గర్భశోకం మిగిల్చిన ఘటనలు తరుచూ చూస్తూనే ఉన్నాం. అయినా మైనర్లకు వాహనాలు ఇస్తున్నారు. రోడ్డు భద్రత నిబంధనలపై కనీసం అవగాహన లేకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్లపై ఏ వాహనదారుడిని చూసినా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఇందులో అధిక శాతం అక్షరాస్యులే కావడం గమనార్హం. అవగాహన కల్పించాల్సిన అధికారులు కూడా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చేలా అవగాహన కల్పిస్తున్నప్పటికీ మార్పు రావడం లేదు. నిర్లక్ష్యం, నిర్లిప్తత ఫలితంగా ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. మైనర్లు యథేచ్ఛగా వాహనాలపై అతివేగంగా చక్కర్లు కొడుతున్నారు. ట్రిపుల్ రైడింగ్‌తో రోడ్లపై ఫీట్లు చేస్తున్నారు. వనపర్తి జిల్లాలో 90 శాతం మంది హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదం బారిన పడి చనిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి. ఘటనలు పునరావృతం అవుతున్నా నిబంధనలు పాటించాలన్న కనీస సోయి కూడా లేదు. బుద్ధి చెప్పాల్సిన తల్లిదండ్రులు కూడా పట్టించుకోవడం లేదు.
ఎన్ఫోర్స్మెంట్తో చెక్..
ఎన్ఫోర్స్మెంట్తో నిబంధనల ఉల్లంఘనకు చెక్‌పెట్టొచ్చు. పోలీసులు, రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేపడుతున్నప్పటికీ.. మైనర్ల డ్రైవింగ్‌ను కట్టడి చేయలేకపోతున్నారు. చాలా మంది డ్రైవింగ్ లైసెన్స్‌లు లేకుండానే రోడ్లపైకి వస్తున్నారు. మద్యం తాగి.., సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్నారు. వాస్తవానికి మైనర్లకు బైక్ ఇస్తే.. ఇచ్చిన వారికి మోటారు వాహన చట్టం ప్రకారం మూడేండ్ల జైలుశిక్ష ఉంటుంది. 16 ఏండ్లు నిండినవారు లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నది. అయితే, గేర్లు ఉండే బైక్ నడపొద్దు. గేర్లు ఉండే వాహనం నడపడానికి 18 ఏళ్లు కచ్చితగా నిండాలి. ఈ నిబంధనలు పాటించకపోతే జరిమానా విధించడంతోపాటు జైలుశిక్ష తప్పనిసరి. కానీ ఇవేవీ అమలు కావడం లేదు.
నిబంధనలు పాటించాల్సిందే..
మోటారు వాహన చట్టం ప్రకారం ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాల్సిందే. హెల్మెట్ లేకుండా నడిపితే జరిమానా విధిస్తున్నాం. మైనర్లకు వాహనాలిస్తే జైలు శిక్షతోపాటు భారీ జరిమానా ఉంటుంది. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరం. లైసెన్స్, వాహనాల ధ్రువపత్రాలు లేకున్నా చర్యలు తప్పవు. ప్రతిరోజూ తనిఖీలు చేపట్టి జరిమానా విధిస్తున్నాం. అవసరమైతే స్పెషల్ డ్రైవ్ పెడుతాం. ఇప్పటికే ట్రైనీ ఎస్సైలు, ఎస్సైలు నిత్యం అవగాహన కల్పిస్తున్నారు.