e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, January 21, 2022
Home News విభిన్నసంస్కృతుల.. కొత్తూరు

విభిన్నసంస్కృతుల.. కొత్తూరు

  • మినీ ఇండియాగా కొత్తూరు పారిశ్రామిక ప్రాంతం
  • వివిధ సంస్కృతి, సంప్రదాయాలకు నిలయంగా మారుతున్న ప్రాంతం
  • పండుగలను కలిసికట్టుగా నిర్వహించుకుంటున్నఇరు ప్రాంతాల ప్రజలు

కొత్తూరు రూరల్‌, డిసెంబర్‌ 8 : వివిధ సంస్కృతి, సంప్రదాయాలకు నెలవుగా కొత్తూరు పారిశ్రామిక ప్రాంతం నిలుస్తున్నది. దేశంలోని వివిధ రాష్ర్టాల ప్రజలు, వివిధ కులాలు, మతాలకు చెందినవారు కొత్తూరు పారిశ్రామిక ప్రాంతంలో నివసిస్తుంటారు. వివిధ రాష్ర్టాల ప్రజలతో పాటు వారి సంస్కృతి, సంప్రదాయలనూ స్థానికులు ఆహ్వానిస్తున్నారు. స్థానికులు, స్థానికేతరులు సోదరభావంతో కలిసి ఉంటున్నారు. అందుకే కొత్తూరు పారిశ్రామిక ప్రాంతాన్ని సర్వమత సమ్మేళనంగా, ఓ మినీ ఇండియాగా పిలువబడుతున్నది.

కార్మికుల జీవితాల్లో వెలుగులు..

- Advertisement -

ఎంతో మంది కార్మికుల జీవితాల్లో వెలుగు దివ్వెలను కొత్తూరు నింపుతున్నది. కార్మికుల జీవనోపాధికి కేరాఫ్‌ అడ్రస్‌గా కొత్తూరు పారిశ్రామిక ప్రాంతం నిలుస్తున్నది. కొత్తూరు, నందిగామ మండలాల పరిధిలోని వివిధ గ్రామాల్లో సుమారు 270 పరిశ్రమలు ఉన్నాయి. వాటిలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు అత్యధికం. భారీ తరహా పరిశ్రమలు సుమారు 10 ఉన్నాయి. మొత్తం పరిశ్రమల్లో కార్మికులు 32వేల మంది పని చేస్తున్నారు. ఈ మొత్తం కార్మికుల్లో స్థానికేతరులే అత్యధికం. జీవనోపాధి కోసం పొట్టచేత పట్టుకుని వచ్చేవారికి కేరాఫ్‌ అడ్రస్‌గా కొత్తూరు పారిశ్రామిక ప్రాంతం నిలుస్తున్నది.

వివిధ సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం..

కొత్తూరు, నందిగామ మండలాల పరిధిలోని వివిధ గ్రామాల్లోని పరిశ్రమల్లో పని చేసేందుకు బీహార్‌, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ, చత్తీస్‌ఘడ్‌, అస్సాం, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌ ఇతర రాష్ట్రాల ప్రజలు వారి కుటుంబాలతో వలసవచ్చి నివసిస్తున్నారు. స్థానికులకంటే స్థానికేతర కార్మికుల సంఖ్యే ఎక్కువ. అయినప్పటికీ ఇతర రాష్ర్టాల ప్రజలతో స్థానికులు సోదర భావంతో కలిసి మెలిసి పండుగలు నిర్వహించుకోవడం విశేషం. తెలుగు రాష్ర్టాల ప్రజలతో పాటు ముఖ్యంగా ఉత్తరాది రాష్ర్టాల ప్రజలు రాందేవ్‌ బాబా జయంతి, ఛఠ్‌పూజ, తీజ్‌, దసరా, దీపావళి, హోలి, సంక్రాంతి పండుగలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

కళకళలాడుతున్న పల్లెలు..

కొత్తూరు, నందిగామ మండలాల పరిధిలో నెలకొల్పిన వివిధ జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమల్లో పని చేసేందుకు వివిధ రాష్ర్టాల నుంచి కార్మికులు చేరుకోవడంతో గ్రామాలు కళకళలాడుతున్నాయి. కార్మికుల రాకతో గ్రామాల్లో ఎటువంటి వ్యాపారమైనా మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లుగా సాగుతున్నాయి. కార్మికులు నివసించేందుకు ఇంటి అద్దెలు అందుబాటులో ఉండడంతో పల్లెల్లో ఉండేందుకు కార్మికులు ఇష్టపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు పెద్దపీట వేయడంతో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు పెట్టుబడిదారులు ముందుకొస్తుండడంతో కొత్తూరు, నందిగామ మండలాల్లో మరిన్ని పరిశ్రమలు పెరిగే అవకాశం ఉన్నది.

ఉపాధి దొరికింది..

25 ఏండ్ల కింద తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్‌ నుంచి కొత్తూరుకు వలస వచ్చారు. పరిశ్రమల్లో కార్మికులుగా పని చేస్తూ జీవనం గడిపేవాళ్లం. నేడు కొత్తూరులో ప్లాటు తీసుకుని సొంత ఇంటిని నిర్మించుకుని స్థిరపడ్డాం. ఆర్థికంగా ఎదగడానికి స్థానిక పరిశ్రమలు, స్థానికులు ప్రోత్సాహాన్ని అందించారు. ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగం చేస్తున్నా. – బిపిన్‌షా, నారాయణగూడ కాలనీ, కొత్తూరు

ఆర్థిక సమస్యలు దూరమయ్యాయి..

కొన్ని ఏండ్ల కింద పొట్టచేత పట్టుకుని బీహార్‌ రాష్ట్రం నుంచి కొత్తూరుకు వచ్చాం. ఆనాడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకులోనై ఏమీతోచని స్థితిలో కుటుంబ సభ్యులతో కొత్తూరు పారిశ్రామిక ప్రాంతానికి వచ్చాం. స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో పని చేస్తూ పైసా పైసా కూడబెట్టి అప్పులు తీర్చుకున్నాం. ఆర్థిక సమస్యలు దూరమయ్యాయి. ఇప్పుడు సొంతంగా ఇంటర్‌నెట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసుకున్నా.

  • జితేందర్‌కుమార్‌, కొత్తూరు
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement