యాసంగిలో వరికి బదులుగా ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఈ మేరకు వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు జిల్లా రైతాంగానికి అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే వేరుశనగ, శనగ, పొద్దుతిరుగుడు, కుసుమ, మినుములు, పెసర పంటలపై ప్రచారం ముమ్మరం చేయగా… వీటితోపాటు కూరగాయలు, పండ్లు, పూల పంటలను సాగు చేయాలని చెబుతున్నారు. గతేడాది కన్నా అదనంగా 3,863 ఎకరాల్లో ఉద్యాన సాగు చేపట్టాలని నిర్ణయించగా మొత్తం 55,428 ఎకరాలకు విస్తీర్ణాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. అత్యధికంగా 3,863 ఎకరాల్లో కూరగాయల పంటలు పండించనుండగా.. మిగతాది పూలు, పండ్లు, పట్టు సాగుకు చర్యలు తీసుకుంటున్నారు.
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 6 : ప్రభుత్వ ఆదేశాల మేరకు వరికి బదులు ఇతర పంటల సాగువైపు రైతులు వెళ్లేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. అంతేకాకుండా యాసంగి సీజన్లో పండించే ధాన్యాన్ని సేకరించబోమని కేంద్రం స్పష్టం చేసిన దృష్ట్యా జిల్లా రైతాంగం ఇతర పంటలను సాగు చేసేలా అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే వరికి ప్రత్యామ్నాయంగా వేరుశనగ, శనగ, పొద్దుతిరుగుడు, కుసుమ, మినుములు, పెసర పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వారం రోజులుగా రైతు వేదికలే కేంద్రాలుగా అవగాహన కార్యక్రమాలు కొనసాగుతుండగా, ఉద్యానవన శాఖ అధికారులు కూడా ఉద్యానవన పంటలైన కూరగాయలు, పండ్లు, పూల పంటలను వరికి బదులుగా సాగు చేయాలని అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని రైతు వేదికల వద్ద జిల్లా వ్యవసాయ శాఖతోపాటు ఉద్యానవన శాఖ అధికారులు రైతులకు ఇతర పంటలపై అవగాహన కల్పిస్తుండడంతోపాటు ఆన్లైన్ వేదికగా కూడా ఉద్యానవన రైతులకు ఇతర పంటలపై సంబంధిత అధికారులు అవగాహన పెంచుతున్నారు. తక్కువ సమయం, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించవచ్చని అవగాహన కార్యక్రమాల్లో సంబంధిత అధికారులు జిల్లా రైతాంగానికి సూచిస్తున్నారు.
3863 ఎకరాల్లో ఉద్యానవన పంటలు
వరికి బదులు ఇతర పంటలను సాగు చేయాలని ప్రభుత్వం సూచిస్తున్న దృష్ట్యా జిల్లాలో వరికి బదులుగా ఉద్యానవన పంటల సాగుకు ప్రణాళికను రూపొందించారు. జిల్లావ్యాప్తంగా యాసంగి సీజన్లో వరి పంట స్థానంలో 3863 ఎకరాల్లో ఉద్యానవన పంటలను సాగు చేసేందుకు సంబంధిత అధికారులు నిర్ణయించారు. ఇందులో ప్రధానంగా కూరగాయల సాగు చేసేందుకు దృష్టి సారించారు. వరికి బదులు యాసంగిలో సాగు చేసే ఉద్యానవన పంటల్లో భాగంగా, కూరగాయలు-3260 ఎకరాలు, పచ్చిమిర్చి-70, పూలు-260, పండ్ల తోటలు-223, పట్టు-50 ఎకరాల్లో సాగు చేసేందుకు జిల్లా ఉద్యానవన శాఖ ప్లాన్ చేసింది. అయితే గతేడాది యాసంగిలో 51,565 ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగుకాగా, ఈ ఏడాది 55,428 ఎకరాల్లో ఉద్యానవన పంటల సాగుకు నిర్ణయించారు, ఈ ఏడాది పెంచిన విస్తీర్ణంలో గతేడాది వరి సాగు చేసిన స్థానాల్లో ఉద్యానవన పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు. జిల్లాలో మెజార్టీ సంఖ్యలో పెంచే కూరగాయలకు సంబంధించి గత యాసంగిలో 19,860 ఎకరాల్లో కూరగాయల పంటలను సాగు చేయగా, ఈ ఏడాది 23,120 ఎకరాల్లో కూరగాయల పంటలు సాగయ్యేలా అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం
జిల్లాలో వరి స్థానంలో ఉద్యానవన పంటలను సాగు చేసేలా రైతు వేదికలతోపాటు ఆన్లైన్ వేదికగా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. యాసంగిలో వరికి బదులు అత్యధికంగా కూరగాయల పంటలను సాగు చేసేలా ప్రణాళికను రూపొందించాం. దీంతో అధిక లాభాలు పొందొచ్చు.
రంగారెడ్డి జిల్లాలో మండలాలవారీగా కూరగాయల సాగుకు ప్రణాళిక
మండలం ఎకరాలు
చేవెళ్ల 200
మొయినాబాద్ 100
షాబాద్ 220
శంకర్పల్లి 200
అబ్దుల్లాపూర్మెట్ 130
హయత్నగర్ 10
ఇబ్రహీంపట్నం 250
మాడ్గుల 100
మంచాల 150
యాచారం 150
ఆమనగల్లు 50
బాలాపూర్ 30
కడ్తాల్ 60
కందుకూరు 250
మహేశ్వరం 300
శంషాబాద్ 250
చౌదరిగూడెం 50
కేశంపేట 300
కొందుర్గు 60
కొత్తూరు 80
నందిగామ 70
తలకొండపల్లి 100