-నాబార్డ్ సహాయంతో 30 మందికి శిక్షణ ఇస్తున్న స్వచ్ఛంద సంస్థ
బొంరాస్‌పేట,నవంబర్ 28 : మహిళల ఆర్థిక అభ్యున్నతికి, వారిలో వృత్తి నైపుణ్యాన్ని పెంచి జీవనోపాధి మెరుగుపర్చుకునేందుకు నాబార్డు కృషి చేస్తున్నది. నాబార్డు ఆర్థిక సహాయంతో స్వామి వివేకానంద రూరల్ డెవలప్మెంట్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ బొంరాస్‌పేట మండల కేంద్రంలో మహిళలకు ఆరీ ఎంబ్రాయిడరీలో శిక్షణ ఇస్తున్నది. గ్రామానికి చెందిన 30 మంది మహిళలకు15 రోజులపాటు ఈ శిక్షణను ఇస్తుంది. ఈ నెల 14న ప్రారంభమైన శిక్షణ ఈ నెలాఖరు వరకు కొనసాగనుంది. శిక్షణ పూర్తయిన తరువాత మహిళలకు నాబార్డు అధికారులు ఎంబ్రాయిడరీలో శిక్షణ పొందినట్లు ధ్రువపత్రం అందజేస్తారు. ప్రతి రోజూ 30 మంది మహిళలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామ సంఘం భవనంలో శిక్షణ పొందుతున్నారు. ఎంబ్రాయిడరీలో ప్రావీణ్యం పొందిన పద్మ వీరందరికీ ఎంబ్రాయిడరీ(మగ్గం వర్క్) నేర్పుతున్నది. నాబార్డు సంస్థ శిక్షణకు కావాల్సిన రింగులు, దారాలు, పూసలు, బట్టలతో పాటు ప్రతిరోజూ మధ్యాహ్న భోజన వసతి కల్పించి పూర్తి ఉచితంగా శిక్షణ ఇస్తున్నది. మారుమూల గ్రామీణ ప్రాం తాల్లోని పేద మహిళలకు ఇది ఎంతో ఉపయోగ కరంగా ఉన్న ది. వివేకానంద రూరల్ డెవలప్మెంట్ సంస్థ నిర్వహిస్తున్న ఈ శిక్షణ జిల్లాలో రెండవది. ఈ ఏడాది మార్చిలో వికారాబాద్ పట్టణంలో 30 మంది మహిళలకు ఇదే విధమైన శిక్షణ ఇవ్వగా, చాలా మంది మహిళలు మగ్గం పని నేర్చుకుని ఉపాధి పొందుతున్నారు. బొంరాస్‌పేటలో కూడా 30 మంది మహిళలు ఇప్పటికే మగ్గం వర్క్ నేర్చుకున్నారు. ఈ శిక్షణను మరో 15 రోజులు పొడిగించాలని కోరుతున్నారు.
ఆరీ ఎంబ్రాయిడరీ
మహిళలు ధరించే బ్లౌజులకు పలు రకాల డిజైన్లను మహిళలు మగ్గం వర్క్ ద్వారా చేస్తారు. ఇది ఒక కళ. ఆరీ ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన బ్లౌజులను ధరించడానికి నేటి తరం మహిళలు ఎంతో ఇష్టపడుతున్నారు. సాధారణంగా మహిళలు కుట్టించుకునే బ్లౌజుల కంటే ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన వాటికి ధర ఎక్కువ. ఒక్కో మగ్గం వర్క్ వేసిన బ్లౌజుకు కనీసం రూ. 1500 వరకు తీసుకుంటారు. బట్టలు కుట్టడం నేర్చుకున్న మహిళలకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉన్నది. వారి వృత్తి నైపుణ్యాన్ని మరింత మెరుగుపర్చుకుని ఆర్థికంగా ఎదగడానికి ఆరీ ఎంబ్రాయిడరీ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది. బయట దీనిని నేర్చుకోవాలంటే రూ.30 వేల వరకు ఖర్చవుతుంది. అదికూడా హైదరాబాద్‌లోనే శిక్షణ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇవ్వరు. దీనిని నాబార్డు వారు మహిళలకు పూర్తి ఉచితంగా అందజేస్తున్నారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని ఎంబ్రాయిడరీలో ప్రావీణ్యం పొందిన మహిళలకు బ్యాంకులు కూడా ఆర్థికంగా రుణాలను కూడా అందించే అవకాశం ఉన్నది.