వ్యవసాయ పనులు ముగింపు దశకు చేరడంతో కూలీలు ఉపాధి పని బాట పట్టారు. దీంతో క్రమంగా ఉపాధి పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య పెరుగుతున్నది. రంగారెడ్డి జిల్లాలో గత నెలలో రోజుకు 3 వేల మంది ఉపాధి పనులకు హాజరుకాగా, పది రోజుల నుంచి మరో 3 వేల మంది అదనంగా హాజరవుతున్నారు. ప్రస్తుతం నిత్యం 6135 మంది ఉపాధి పనిని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ నెలాఖరులోగా వరికోతలు కూడా పూర్తికానుండడంతో ఉపాధి కూలీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 80.17 లక్షల పని దినాలను కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు 47.05 లక్షల పని దినాలను కల్పించారు. జిల్లావ్యాప్తంగా 1,57,952 జాబ్కార్డులుండగా.. 2,88,580 మంది కూలీలు ఉన్నారు.
రంగారెడ్డి, డిసెంబర్ 10, (నమస్తే తెలంగాణ): జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య పెరిగింది. గత నెలతో పోలిస్తే ఈనెల మొదటి వారం నుంచి భారీగా పెరుగడం గమనార్హం. వ్యవసాయ పనులు పూర్తి కావస్తుండడంతో జిల్లాలో ఉపాధి హామీ పనులు జోరందుకున్నాయి. జిల్లావ్యాప్తంగా గత నెల మొదటి వారం వరకు రోజుకు 3వేల మంది కూలీలు ఉపాధి పనులకురాగా, ఈ నెల మొదటి వారం నుంచి ఉపాధి పనులకు వచ్చే కూలీలు గత నెలతో పోలిస్తే 6వేలకు పెరిగారు. ప్రస్తుతం జిల్లాలో రోజుకు 6135 మంది కూలీలు ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు. ఈ నెలాఖరులోగా ఉపాధి పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య 15 వేల వరకు చేరనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ప్రధానంగా వ్యవసాయ పనులు పూర్తి కావస్తున్న దృష్ట్యా భూములను చదును చేసే పనులతోపాటు మట్టి రోడ్ల నిర్మాణం, నీటి ఊట గుంతల నిర్మాణం, వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను హరితహారంలో భాగంగా నర్సరీల్లో మొక్కలు పెంచడం తదితర పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం 80.17లక్షల పనిదినాలను కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు 47.05 లక్షల పని దినాలను జిల్లా యంత్రాంగం కల్పించింది. అంతేకాకుండా ప్రతి ఒక్క కూలీకి వందరోజులపాటు పని కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించగా, అందులో జిల్లా ముందు వరుసలో ఉన్నది. ప్రస్తుతం కూలీలకు రోజుకు రూ.245లను అందజేస్తున్నారు. గతంలో రూ.237లుగా ఉన్న రోజువారీ కూలీని ఏప్రిల్లో రూ.245లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా 1,57,952 జాబ్కార్డులుండగా 2,88,580 మంది కూలీలున్నారు.
6135 మందికి పెరిగిన కూలీలు
జిల్లాలో ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య భారీగా పెరిగింది. గత నెలతో పోలిస్తే ఈ నెలలో 3 వేల వరకు కూలీలు పెరిగారు. జిల్లాలో 558 గ్రామ పంచాయతీలుండగా 412 గ్రామ పంచాయతీల్లో ఉపాధి పనులు కొనసాగుతున్నాయి. ఎక్కువగా జిల్లాలోని మాడ్గుల మండలంతోపాటు మంచాల, కడ్తాల, కందుకూరు మండలాల్లో ఉపాధి పనులకు హాజరవుతున్నారు. అదేవిధంగా జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పనులకు హాజరయ్యే కూలీలకుగాను ఇప్పటివరకు రూ.47.05 కోట్ల చెల్లింపులను పూర్తి చేశారు. మరోవైపు జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా హరితహారంతోపాటు ఇంకుడు గుంతలు, నీటిఊట గుంతల నిర్మాణం, మట్టి రోడ్ల నిర్మాణం పనులను ప్రధానంగా చేస్తున్నారు. అంతేకాకుండా అసైన్డ్ భూముల్లోని రాళ్లను తొలగించడం, భూమిని చదునుచేయడం, బౌండ్రీల ఏర్పాటు, ఎరువు గుంతల నిర్మాణం, బోరుబావి తవ్వించడం తదితర పనులు అసైన్డ్ భూముల్లో చేపట్టనున్నారు. ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, మట్టి కట్టలు, నీటి ఊట గుంతలు, పశువులకు షెడ్ల ఏర్పాటు, భూ ఉపరితల నీటి గుంతల నిర్మాణం, పంట కాలువల మరమ్మతులు, పంట మార్పిడి కల్లాలు, కొత్త సేద్యపు బావులు తవ్వడం, నిరవధిక సమతల కందకాలు, ఖండిత సమతల కందకాలు, కొండ దిగువ ప్రాంతాల్లో నీటి నిల్వ కందకాలు, పశువుల నిరోధక కందకాలు, భూసార సంరక్ష కందకాలు, కొత్త పంట కాలువల నిర్మాణం, మైనర్ ఇరిగేషన్ కాలువలో పూడికతీత, చేపల ఉత్పత్తి కుంటల నిర్మాణం, వరద కట్టల నిర్మాణం పనులను చేస్తున్నారు.
వంద రోజుల కల్పనలో పదోస్థానం..
ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా వీలైనంత ఎక్కువ మంది కూలీలకు వంద రోజుల పనిని కల్పించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. వంద రోజుల పని కల్పనలో జిల్లా పదో స్థానంలో నిలిచింది. జిల్లాలో ఇప్పటివరకు 6873 కుటుంబాలకు వంద రోజుల పనిదినాలను కల్పించారు. ఈ ఏడాది ఇప్పటివరకు వంద రోజుల పని దినాలను పూర్తి చేసుకున్న కుటుంబాల్లో అత్యధికంగా యాచారం మండలంలో 829 కుటుంబాలు, మాడుగుల మండలంలో 799 కుటుంబాలు, కడ్తాల్ మండలంలో 597 కుటుంబాలు, కందుకూరు మండలంలో 578 కుటుంబాలు, మంచాల మండలంలో 504 కుటుంబాలు, తలకొండపల్లి మండలంలో 485 కుటుంబాలకు 100 రోజుల పని దినాలను కల్పించారు.