బొంరాస్‌పేట, డిసెంబరు 10 : కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి అనిల్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో కిసాన్ క్రెడిట్ కార్డు రుణమేళా నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాడి రైతులు, మత్స్యకారులకు బ్యాంకులు రుణాలు ఇస్తాయని, వీటిని పొంది రైతులు, మత్స్యకారులు ఆర్థికంగా ఎదుగాలన్నారు. నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్(ఎన్ఎల్ఎం) పథకం ద్వారా రైతులకు రూ.50 లక్షల రుణాలను అందిస్తున్నామని, దీనిలో 50 శాతం రాయితీ ఉంటుందని, యువ రైతులు, స్వయం సహాయక సంఘాలు ఈ రుణాలు పొందడానికి ముందుకు రావాలని ఆయన కోరారు. కేసీసీ రుణాలను మార్చి వరకు తీసుకోవాలని సూచించారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజరు రాంబాబు మాట్లాడుతూ కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలు తీసుకోవాలంటే రైతులు బ్యాంకుల్లో తప్పక పంట రుణం తీసుకుని ఉండాలని, మత్స్యకారులైతే మత్స్యకార సంఘాల్లో సభ్యత్వం కలిగి ఉండాలని అన్నారు. పంటరుణం, కేసీసీ రుణం కలిపి రూ.1.60 లకు మించకుండా ఇస్తామన్నారు. బ్యాంకుల్లో పంటరుణాలు తీసుకున్న రైతులు ఏడాదిలోగా తిరిగి చెల్లిస్తేనే వడ్డీ భారం తగ్గి రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. నాబార్డు డీడీఎం ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ పాడిరైతులు, మత్స్యకారులను ప్రోత్సహించడానికి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణాలు అందిస్తున్నామని చెప్పారు. జిల్లా మత్స్యశాఖ ఏడీ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ చేపల చెరువుల తవ్వకం, చేపలను అమ్ముకోవడానికి రాయితీ రుణాలు అందజేస్తామన్నారు. కేసీసీ రుణాలను కూడా అందిస్తామని చెప్పారు. సమావేశంలో మండల పశువైద్యాధికారి ఆనంద్, జ్యోత్స్న, ఏవో రాజేశ్‌కుమార్, ఎస్బీఐ మేనేజర్ లవకుమార్, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.