రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/ పరిగి, జనవరి 2 : ఒమిక్రాన్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు నిబంధనలు, ఆంక్షలు విధించాలంటూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కట్టడి చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం మార్గనిర్దేశంతోపాటు హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం సభలు, సమావేశాలు, ర్యాలీలపై ఈనెల 10వ తేదీ వరకు నిషేధం విధించింది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ప్రజలు గుమిగూడే విధంగా సమావేశాలు నిర్వహించరాదన్నది ఆంక్షల ఉద్దేశం. తద్వారా కరోనా వ్యాప్తిని అడ్డుకట్ట వేయవచ్చని సర్కారు భావించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు జారీ చేస్తుండగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు దిగడం ద్వారా తమ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు తూలనాడుతుండడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీ బండి సంజయ్ దీక్షకు అనుమతి లేకపోగా మొండి వైఖరితో అవలంబించడం సరైంది కాదనే భావన వ్యక్తమవుతున్నది. మరోవైపు ఉద్యోగులు, ఉపాధ్యాయులను జిల్లాల సర్దుబాటులో భాగంగా ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 317ను కొంతమంది మాత్రమే విభేదిస్తున్నారు. దీనిపై బీజేపీ నాయకులు కరోనా ఆంక్షలు ఉల్లంఘించి ఆందోళనలు చేపట్టడం సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. 317 జీవోను సరిదిద్దేందుకు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశాయని సంఘం నాయకులు చెబుతున్నారు.
జోనల్ పోస్టులుగా మార్చాలి..
జిల్లాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయుల సర్దుబాటుకు సంబంధించి ప్రభుత్వం తీసుకువచ్చిన 317 జీవో ను కొంతమంది మాత్రమే విభేదిస్తున్నారు. ఇతర జిల్లాల్లోని మండలాలు కొత్త జిల్లాల్లోకి వచ్చిన చోట సీనియర్ ఉపాధ్యాయులు ఈ కొత్త జిల్లాల్లోకి రావడంతో జూనియర్లకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని నివారించడానికి ప్రభుత్వం ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను జోనల్ పోస్టులుగా మారిస్తే ఇబ్బంది తొలగిపోతుంది. – అమర్నాథ్, పీఆర్టీయూ , వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి
పారదర్శకంగా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ
జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయుల కేటాయింపు ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరుగకుండా సీనియారిటీ జాబితాను పరిగణనలోకి తీసుకొని ఉమ్మడి జిల్లాలోని ఆయా జిల్లాలకు ఉద్యోగ, ఉపాధ్యాయులను కేటాయించారు. అయితే స్థానికత అంశం ఉన్నప్పటికీ సీనియర్లు ఉన్న చోట సీనియారిటీకి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలున్న దృష్ట్యా ఆ దిశగా కేటాయించారు. కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా కమిటీ చేసిన కేటాయింపు ప్రక్రియపై జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.