అప్పుడే రైతులకు మద్దతు ధర లభిస్తుంది
ఇప్పటికీ దేశానికి రూ.80 వేల కోట్ల ఆయిల్ దిగుమతి
పంజాబ్‌లో పక్కాగా పంటల మార్పిడి అమలు
మన రైతులు కూడా మారాలి
రాష్ట్ర జీడీపీని కాపాడింది వ్యవసాయ రంగమే..
సూర్యాపేట జడ్పీ సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట, నవంబర్ 1 :‘దేశంలో ఆహార నిల్వలు పెరిగిపోయాయి.. రాష్ట్రంలో వరి సాగు బాగా పెరిగింది.. రైతులు యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తేనే లాభాలు వస్తాయి.. ఆ దిశగా సన్నద్ధం కావాలి’ అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో నూనె గింజలకు బాగా డిమాండ్ ఉందని, ఇప్పటికీ రూ.80 వేల కోట్ల నూనె ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నామని అన్నారు. 40 ఏండ్లు దేశానికి అన్నం పెట్టిన పంజాబ్ రాష్ట్రంలో పంట మార్పిడి పక్కాగా అమలవుతున్నదని, మనం కూడా డిమాండ్‌కు అనుగుణంగా పంటలు మార్పిడి చేయాలని సూచించారు. అన్ని రాష్ర్టాల్లో జీడీపీ పడిపోయి మైనస్‌లో ఉంటే తెలంగాణలో మాత్రం ప్లస్‌లో ఉన్నదని, అది సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి 50 శాతం కేటాయించిన బడ్జెట్తోనేనని స్పష్టం చేశారు.
రైతులు మూస పద్ధతికి స్వస్థి పలికి డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసి మద్దతు ధర పొందాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సూచించారు. సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం మార్కెట్ అంతర్జాతీయమైందని, అక్కడే ధరల నిర్ణయం జరుగుతుందని అన్నారు. మార్కెట్లో డిమాండ్‌కు అనుకూలంగా పంటల సాగు చేసినప్పుడే పండించిన పంట అమ్ముడు పోతుందన్నారు. దేశంలో ఆహార నిల్వలు పెరిగిపోయాయన్నారు. రాష్ట్రంలో వరి సాగు బాగా పెరిగిందని, ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇప్పుడు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. సూర్యాపేట జిల్లాలో 2014లో 1.60 లక్షల ఎకరాల్లో వరి సాగయితే 2021లో 4.69 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. దేశంలోని అన్ని రాష్ర్టాల్లో జీడీపీ పడిపోయి మైనస్‌కు చేరిందని, తెలంగాణలో మాత్రమే ప్లస్‌లో ఉందని పేర్కొన్నారు.
పంట మార్పిడి చేయాల్సిందే..
దేశంలో ఆహార నిల్వలు పెరగడం వల్లనే కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయమని స్పష్టంగా చెప్పిందన్నారు. వానకాలంలో 24 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామంటే ముఖ్యమంత్రి, మంత్రులు ప్రధానితో మాట్లాడి 45 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని కోరడం జరిగిందన్నారు. ఆ సమయంలోనే కేంద్రం యాసంగిలో ఒక్క గింజా కొనుగోలు చేయమని స్పష్టంగా చెప్పిందని గుర్తుచేశారు. అందుకే వరి సాగు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచిస్తుందన్నారు. పంట మార్పిడితోనే మంచి లాభాలు వస్తున్నాయని, గతంలో మనం పంట మార్పిడి చేసినట్లు తెలిపారు. 40 ఏండ్లు దేశానికి అన్నం పెట్టిన పంజాబ్ రాష్ట్రంలో పంట మార్పిడి అమలవుతుందని, మన రాష్ట్రంలోనూ అమలు చేయాలని సూచించారు. దేశంలో నూనె గింజలకు డిమాండ్ ఉందని చెప్పారు. ఇప్పటివరకు దేశం 80వేల కోట్ల నూనె గింజలను దిగుమతి చేసుకుంటుందని గుర్తుచేశారు. ఆ పంటలను మన వద్దే పండిస్తే మంచి మద్దతు ధర వస్తుందన్నారు. వ్యవసాయాన్ని, రైతులను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఏడేండ్లుగా రైతన్న కోసం పడిన కష్టమే ఈ రోజు ఈ వరి దిగుబడి అని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ సురేశ్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి : ఎంపీ బడుగుల
వానకాలం భారీ వర్షాలతో జిల్లాలో చాలా రోడ్లు ధ్వంస మయ్యాయని, వాటికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. రోడ్ల మరమ్మతుల కోసం ప్రభుత్వానికి ఎన్ని ప్రతిపాదనలు పంపారో చెప్పాలని అధికారులను అడిగారు. ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో ఏ ఏ రోడ్లు చేస్తున్నారో చెప్పాలని కోరారు. నిధులు కావాలంటే ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేస్తుందన్నారు. ధ్వంసమైన రోడ్లను వెంటనే బాగు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.
ప్రతి సమస్యనూ పరిష్కరించాలి : జడ్పీ చైర్పర్సన్
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు లేవనెత్తిన ప్రతి సమస్యనూ అధికారులు పరిష్కరించాలని చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్‌రావు అధికారులను ఆదేశించారు. సమావేశం అనంతరం సమస్యల పరిష్కారం కోసం ఫాలోఅప్ చేయాలని కోరారు. తిరిగి సమావేశమైన రోజు అదే సమస్య చర్చకు రావద్దన్నారు. సమస్య పరిష్కారం ఎంత వరకు వచ్చిందనేది ఎప్పటికప్పుడు సభ్యులకు తెలియజేయాలని సూచించారు. పాత సమస్యలను చర్చించి సమయం వృథా చేయవద్దన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే నిర్ణయాన్ని పక్కాగా అమలు చేయాలని సూచించారు.