రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బృహత్ ప్రకృతివనాల ఏర్పాటు పనులు నిజామాబాద్ జిల్లాలో చురుగ్గా సాగుతున్నాయి. వనాల ఏర్పాటుపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామగ్రామానా ఏర్పాటు చేసిన ప్రకృతివనాలు పల్లెల్లో ఆహ్లాదాన్ని పంచడంతోపాటు పచ్చదనాన్ని పెంపొందించడంలో కీలకంగా మారాయి. దీంతో రాష్ట్రప్రభుత్వం ప్రతి మండలంలో ఒక బృహత్ ప్రకృతివనాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఎంపిక చేసిన గ్రామాల్లో ఒక్కో వనం కోసం పదెకరాల స్థలాన్ని ప్రభుత్వం సేకరించింది. నిజామాబాద్ జిల్లాలోని 29 మండలాలకుగాను 27 చోట్ల బృహత్ ప్రకృతివనాల ఏర్పాటుకు గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే 16 మండలాల్లో పనులు పూర్తికాగా, మిగితా పది మండలాల్లో కొనసాగుతున్నాయి. రుద్రూర్ మండలంలో ప్రభుత్వ స్థలం లభ్యం కాకపోవడంతో అధికారులు భూమిని సేకరించే పనిలో ఉన్నారు. వచ్చే సీజన్ నాటికి బృహత్ ప్రకృతివనాలను సుందరంగా తీర్చిదిద్దాలని, ఆలస్యంగా పనులు మొదలైన చోట వానకాలంలో మొక్కలు నాటాలని యంత్రాంగం ప్రయత్నిస్తున్నది. లక్ష్యం నీరుగారకుండా ఉండేందుకు ఏర్గట్ల మండలంలో ఐదు ఎకరాల్లోనే బృహత్ ప్రకృతివనాన్ని ఏర్పాటు చేయడం విశేషం.
నిజామాబాద్, జనవరి 13, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలతో గ్రామాలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. దీంతో ప్రభుత్వం ప్రతి మండలానికీ ఒక బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం ప్రతి మండలంలో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరిస్తోంది. మండల కేం ద్రం లేదంటే ప్రభుత్వ స్థలం ఉన్న గ్రామ శివారులో బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో 29 మండలాలకుగాను 27 మండలాల్లో బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటుకు గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 16 మండలాల్లో పనులు పూర్తయ్యాయి. 10 మండలాల్లో స్థలాలు సేకరించగా పనులు కొనసాగుతున్నాయి. రుద్రూర్ మండలంలో పదెకరాల స్థల సేకరణ సమస్య ఉత్పన్నం కావడంతో నిర్ణయాన్ని కలెక్టర్కు వదిలేశారు. వచ్చే సీజన్ నాటికి బృహత్ పల్లె ప్రకృతి వనాలను అందంగా తీర్చిదిద్దాలని యంత్రాంగం కృషి చేస్తోంది. ఆలస్యంగా పనులు మొదలైన చోట వచ్చే సీజన్లో మొక్కలు నాటనున్నారు.
ఆదర్శంగా ఊరూరా వనాలు…
నిజామాబాద్ జిల్లాలోని 530 గ్రామ పంచాయతీ పరిధిల్లో 660 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ విజయవంతం కావడంతో రాష్ట్రంలో పచ్చదనాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం మరిన్ని వనాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నది. మండల కేంద్రాల్లో సుమారు 10 ఎకరాల స్థలాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడానికి సిద్ధం కాగా జిల్లాలో పనులు కొనసాగుతున్నా యి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం, పట్టణంలో ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి మరింత స్పందన రావడంతో మండలానికి ఒకటి చొప్పున ప్రకృతి వనాలు ఏర్పాటవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 29 మండలాలకుగాను 27 మండలాల్లో 10 ఎకరాల చొప్పున స్థలాలను గుర్తించారు. రుద్రూర్ మండలంలో స్థల సేకరణ సమస్యగా మారింది. నిర్దిష్టంగా పదెకరాలు దొరకని చోట అందుబాటులో ఉన్న స్థలంలోనే బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. లక్ష్యం నీరుగారకుండా ఉండేందుకు ఏర్గట్ల మండలంలో ఐదు ఎకరాల్లోనే బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు.
వనాల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ
ఖాళీ స్థలాల్లో పెరిగిన పిచ్చిమొక్కలు, ముళ్లకంపలను తొలగించి, ఎత్తు పల్లాలుగా ఉంటే సరిచేసి మొక్కలు నాటేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. సంబంధిత ప్రదేశాల్లో రెండు వరుసల్లో 1.5 మీటర్ల ఎత్తు ఉండే నీడ, ఫలాలిచ్చే మొక్కలు నా టడం, ప్రదేశాలను గుర్తించిన తర్వాత సాంకేతికపరమైన అనుమతులకు అటవీ, ఉద్యానవన అధికారుల సహకారం తీసుకోనున్నారు. బీపీవీల్లో ప్రజలు నడిచేందుకు వీలుగా ఆరు మీటర్ల వెడల్పుతో వాకింగ్ ట్రాక్లు, నడకదారులు ఏర్పాటు చేయనున్నారు. ఆకట్టుకునే మొక్కలు, విశాలమైన దారులను అందుబాటులోకి తెస్తున్నారు. మరో నాలుగైదు నెలల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలు అచ్చంగా ఉద్యానవనాలను తలపించేలా అందుబాటులోకి రానున్నాయి. ప్రజలు వనంలో నడక సాగించేందుకు, సెలవు దినాల్లో కుటుంబ సమేతంగా సందర్శించేందుకు వీలుగా తీర్దిదిద్దుతున్నారు.
వినియోగంలోకి ఖాళీ స్థలాలు…
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించిన ఖాళీ జాగా కనిపిస్తే చాలు… మాయమయ్యేది. రాత్రికి రాత్రే రికార్డులు సృష్టించి బోగస్ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు సైతం పూర్తి చేసుకునేది. ఇలా ప్రభుత్వ స్థలాలను వేల ఎకరాల్లో కొల్లగొట్టారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రికార్డుల ప్రక్షాళనతో ఎక్కడికక్కడ పారదర్శకత ఏర్పడింది. ఖాళీ స్థలాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడెక్కడ ఎంత ఉందో లెక్క తేల్చారు. విలువైన ప్రభుత్వ స్థలాలను ఖాళీగా ఉంచడం మూలంగా అక్రమార్కుల కన్నుపడి ఏదో విధంగా కబ్జాకు గురయ్యే ఆస్కారం లేకపోలేదు. ప్రభుత్వం తలపెట్టిన బృహత్ పల్లె ప్రకృతి వనాలతో పరోక్షంగా ప్రభుత్వ స్థలాలకు రక్షణ లభించినట్లవుతున్నది. మొన్నటి వరకు ఖాళీగా దర్శనం ఇచ్చిన స్థలాలే ఇప్పుడు మొక్కలతో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహణలోకి రావడంతో రక్షణ దొరికినట్లు అయ్యింది. వనాల పేరుతో ప్రజా బాహుళ్యంలోకి పనికి రాని భూములను వినియోగంలోకి తీసుకురావడంతో సర్కారు స్థలం జోలికి వెళ్లాలంటే కబ్జాదారులకు భయం పట్టుకునే పరిస్థితి ఎదురైంది.