
గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి
సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్
సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 8 : గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ ప్రజలకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనం ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. డివిజనల్ స్థాయిలో ఆర్డీవోలు, డీఎస్పీలు, అధికారులు, మండల స్థాయి నిర్వాహకులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతుల విగ్రహాలను ప్రోత్సహించాలని చెప్పా రు. మండపాల్లో పెద్ద విగ్రహాలు కాకుండా చిన్నవి, మీడియం సైజు విగ్రహాలు పెట్టేలా అవగాహన కల్పించాలన్నారు. మండపాల వద్ద అగ్నిప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. నిమజ్జనం రోజున చెరువుల వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని, మత్స్య, నీటి పారుదల శాఖ అధికారులకు సూచించారు. గణేశ్ మండపాలకు తాత్కాలిక మీటర్లు ఏర్పాటు చేయడానికి విద్యుత్ అధికారులు చొరవ తీసుకోవాలని చెప్పారు. వినాయక మండపాలను రోడ్డుపై అడ్డంగా ఏర్పాటు చేయకూడదన్నారు. మున్సిపల్ అధికారులు ప్రతి మండపాన్ని సందర్శించాలని, మండపాలు అన్ని విధాలా సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల వద్ద బలవంతపు చందాలు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి భద్రతలు పటిష్టంగా అమ లు జరుగాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
పటిష్టమైన చర్యలు తీసుకోవాలి : సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా
గణేశ్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. మండపాల్లో కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. వినాయక విగ్రహాలు వెళ్లే దారిలో విద్యుత్ తీగలను సరి చేయాలన్నారు. నిమజ్జన కేంద్రాల వద్ద క్రేన్లు ఏర్పాటు చేయాలని, నిమజ్జనం తర్వాత పారిశుధ్య నిర్వహణ పనులు సమర్థవంతంగా జరగాలని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి రాధికారమణి, నీటి పారుదల, విద్యుత్, ఆర్అండ్బీ, అగ్నిమాపక, ఎక్సైజ్‌శాఖ అధికారులు, డీఎస్పీలు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.