ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానికసంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని శాసనమండలిలో ప్రొటెం స్పీకర్ జాఫ్రీ ఈ మేరకు కవితతో ప్రమాణం చేయించారు. కొవిడ్ నేపథ్యంలో నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరుగగా.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరై అభినందనలు తెలిపారు.
నిజామాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ శాసనమండలిలో ప్రొటెం స్పీకర్ జాఫ్రీ ఈ మేరకు ప్రమాణం చేయించారు. కొవిడ్ -19 మార్గదర్శకాల మేరకు నిరాడంబరంగా ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా వేముల ప్రశాంత్‌రెడ్డి మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తెలుగులోనే కవిత ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మహమూద్ అలీ, సత్యవతీ రాథోడ్, ఎంపీలు కేఆర్ సురేశ్‌రెడ్డి, బీబీ పాటిల్, రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు, ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, బిగాల గణేశ్ గుప్తా, షకీల్, సంజయ్ కుమార్, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, ఫారూఖ్ హుస్సేన్, భానుప్రసాద్ రావు, ఎమ్.ఎస్.ప్రభాకర్‌రావు, ఎల్.రమణ, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 10, 2020న జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో కవిత అఖండ విజయం సాధించారు. నవంబర్ 26, 2021న ఇదే నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో తిరిగి ఏకగ్రీవంగా గెలుపొందారు. 2014 నుంచి 2019 వరకు నిజామాబాద్ లోక్‌సభ సభ్యురాలిగా విశేష సేవలందించిన కవిత.. రెండుమార్లు ఎమ్మెల్సీగా గెలుపొందడం విశేషం.
అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు…
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాను. గొప్ప అవకాశం కల్పించిన టీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ద్వారా నాపై, నా అభ్యర్థిత్వంపై ఎనలేని విశ్వాసం ప్రదర్శించిన స్థానిక సంస్థల ప్రతినిధులకు, నా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. కరోనా కారణంగా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాలేకపోయిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.