‘టీఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సమితి.. రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ప్రజలను రక్షించుకునేందుకు పార్టీ నిరంతరం పాటుపడుతూనే ఉంటుంది. రాష్ట్ర సాధన కోసం ఏ విధంగా పోరాటం చేశామో.. ఇప్పుడు బంగారు తెలంగాణ సాధనలోనూ అదే స్ఫూర్తితో పని చేస్తాం’ అని టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన
సందర్భంగా ఆయన ‘నమస్తే తెలంగాణ‘కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను
వెల్లడించారు.
నిజామాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ రక్షణ సమితి అని టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటు న్న బీజేపీ, కాంగ్రెస్ నుంచి ప్రజలను రక్షించుకునేందుకు టీఆర్ఎస్ పాటుపడుతున్నదని ఆయన చెప్పారు. 2001 నుంచి నేటి వరకు అలుపెరగని పోరాటాల ద్వారా తెలంగాణ ప్రాంతానికి గులాబీ పార్టీ అండగా నిలుస్తున్నదన్నా రు. నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా తనను ఎంపిక చేసినందుకు గులాబీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఎంతో నమ్మకంతో కీలకమైన పార్టీ పగ్గాలు అప్పగించినందుకు.. పార్టీని మరింత పటిష్టం చేస్తానని చెప్పారు. ప్రతి కార్యకర్తకూ అందుబాటులో ఉంటూ… అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆశన్నగారి జీవన్‌రెడ్డి వెల్లడించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా తనపై ఉన్న గురుతర బాధ్యతను మరింత కష్టపడి నిర్వర్తిస్తానని చెప్పారు. జిల్లా అధ్యక్షుడిగా వెల్లడించిన పలు విషయాలు ఆయన మాటల్లోనే..
నమస్తే తెలంగాణ: టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియామకం అవడంపై ఎలా ఫీలవుతున్నారు?
జీవన్‌రెడ్డి: టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఎంపికవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ బాధ్యతలతో పార్టీకి మరింత సేవ చేసే అవకాశం కలిగింది. నాపై అపారమైన విశ్వాసంతో జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టినందుకు అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు. కీలకమైన పార్టీ పగ్గాలు నా చేతిలో పెట్టడంతో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషిచేస్తా.
ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా, పార్టీ అధ్యక్షుడిగా పని చేయబోతున్నారు. ఎలా అనిపిస్తున్నది?
రాష్ట్ర సాధన కోసం మొదలైన ఉద్యమంలో 2001 నుంచి కేసీఆర్ వెంట నడిచాం. ఆయన అడుగులో అడుగేసి ముం దుకు కదిలాం. ఇప్పుడు రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బాటలోనూ పయనిస్తుండడం మాటల్లో వర్ణించలేనిది. ఆర్మూర్ ఎమ్మెల్యేగా, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా ఫీలవుతున్నా. ఉద్యమాల్లో రాష్ట్ర సాధన కోసం ఏ విధంగా పోరాటం చేశామో..? ఇప్పుడు బంగారు తెలంగాణ సాధనలోనూ అదే స్ఫూర్తితో పనిచేస్తాం.
గులాబీ పార్టీకి జిల్లా సారథిగా మీకున్న లక్ష్యాలేంటి?
ఉద్యమ సమయం నుంచి జిల్లా గులాబీ పార్టీకి కంచుకోట. రాష్ట్ర సాధన ఉద్యమాన్ని మా అధినేత కేసీఆర్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు నిజామాబాద్ జిల్లా ప్రజలంతా అండగా నిలిచారు. నేటికీ అదే స్ఫూర్తితో అండగా నిలుస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వచ్చే ఎన్నికల్లో అన్ని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను గెలుచుకోవడమే మా ప్రధాన ధ్యేయం.
నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పటిష్టంగా ఉన్నది. అధ్యక్షుడిగా కార్యకర్తలకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి?
పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ప్రతి కార్యకర్తకూ ఎల్లవేళలా అండగా ఉంటా. త్వరలోనే మా అధినేత ఆదేశాలతో నిజామాబాద్‌లో నిర్మించిన పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించుకుంటాం. క్రియాశీలక సమావేశాలు, నియోజకవర్గ స్థాయి సమీక్షలు, పార్టీ నిర్మాణం ఇతరత్రా కార్యక్రమాల నిర్వహణకు మినీ తెలంగాణ భవన్ ఉపయోగపడనుంది. ఇదే వేదికగా కార్యాచరణను మొదలు పెడుతాం. జిల్లావ్యాప్తంగా ప్రతి గల్లీలో టీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తాం.
చివరగా చెప్పండి.
ప్రతిపక్ష పార్టీల తీరుపై మీ అభిప్రాయం ఏమిటి?
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నిరోధకులు. ఈ రెండు పార్టీలే తెలంగాణ ప్రాంతం దశాబ్దాల గోసకు కారణం. ఈ రెండు పార్టీల తీరును చూసి సొంత పార్టీ నాయకులే ఛీ కొడుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ గూటికి వచ్చేందుకు చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. అలాంటి వారందరినీ టీఆర్ఎస్లో చేర్చుకుంటాం.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాలకు దీటైన జవాబు ఇవ్వడంలో మీకు మంచి గుర్తింపు ఉంది.
ఆ అనుభవాన్ని ఎలా ఉపయోగిస్తారు?
రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో ఎన్నడూ కనిపించని, వినిపించని వ్యక్తులు ఈరోజు ప్రజల ముందుకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. ఆనాడు సమైక్య పాలకులకు తొత్తులుగా వ్యవహరించిన వారు సూక్తులు చెబుతుంటే నవ్వొస్తుంది. అలాంటి వ్యక్తుల నుంచి తెలంగాణ ప్రజలను రక్షించాలన్న ధ్యేయంగా టీఆర్ఎస్ పనిచేస్తుంది. నా దృష్టిలో టీఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సమితి. ప్రజలకు రక్షణ కవచంగా నిలిచే పార్టీ మాది. అబద్ధాలు, అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్య పెడుతుంటే వారిని చీల్చి చెండాడడం నా కర్తవ్యం. నిజాలను నిక్కచ్చిగా ఆయా వేదికలపై వివరిస్తూ ప్రజలకు వాస్తవాలను తెలియజేశాను. ఇక ముందు కూడా తెలియజేస్తా.
పార్టీ పటిష్టత కోసం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఏ విధంగా వ్యవహరించబోతున్నారు?
నిజామాబాద్ ప్రాంతం నాకు కొత్త కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేశాను. మూడు పర్యాయాలు అధ్యక్షుడిగా కొనసాగే అవకాశాన్ని సీఎం కేసీఆర్ కల్పించారు. ఆయన ఆదేశాలను తూచ తప్పకుండా పాటించి ఉద్యమంలో యువతను భాగస్వామ్యం చేయడం కోసం ప్రయత్నించి సఫలం అయ్యాము. అధికార పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా క్రియాశీలకంగా పనిచేస్తా. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు మహ్మద్ షకీల్, బిగాల గణేశ్ గుప్తా, జడ్పీ చైర్మన్ విఠల్‌రావును కలుపుకొని పార్టీని మరింత ముందుకు తీసుకుపోతా.
కార్యకర్తగా మొదలైన మీ ప్రస్థానం ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి అనుకూలించిన అంశాలేంటి?
పార్టీని నమ్ముకుని నడిచినందుకు అధిష్టానం నాకు ఇన్ని అవకాశాలు కల్పించింది. కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం పంచుకున్నాను. 2014, 2018లో వరుసగా ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం, పీయూసీ చైర్మన్‌గా కేసీఆర్ నియమించడం, ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్ష పీఠం దక్కడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశాలు దక్కడానికి టీఆర్ఎస్ కార్యకర్తలు, ఆర్మూర్ ప్రజా దేవుళ్లే కారణం. వారికి నా వందనాలు.