బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్ రోడ్ నెం 66లో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఫుట్‌పాత్‌ను అక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ సిబ్బంది గురువారం కూల్చేశారు. ఎంపీ సీఎం రమేష్ ఇటీవల కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు.
నిర్మాణంలో భాగంగా వాచ్మెన్ గదులను ఇంటిముందు ఉన్న ఫుట్‌పాత్‌పైకి సుమారు 10 నుంచి 12అడుగులు ముందుకు వచ్చి నిర్మాణం చేస్తున్నారు. ఈ విషయంపై స్థానికులు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడంతో అక్కడకు చేరుకున్న టౌన్‌ప్లానింగ్ సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు.
అయితే సీఎం రమేష్ కుటుంబ సభ్యులతో పాటు కార్యాలయ సిబ్బంది జీహెచ్ఎంసీ సిబ్బందిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విధులు నిర్వహించేందుకు వచ్చిన వారిని వీడియోలు తీస్తూ బెదిరించేందుకు ప్రయత్నించారు.
అయితే ఆక్రమణలను ఉపేక్షించేది లేదంటూ సిబ్బంది పనులు కొనసాగించారు. కొంతభాగం మిగిలి ఉండగా తామే కూలుస్తామని కార్యాలయ సిబ్బంది చెప్పడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది అక్కడనుంచి వెళ్లిపోయారు.