ఆమనగల్లు, డిసెంబర్ 29 : శాంతిభద్రతల పరిరక్షణలో ఆమనగల్లు పోలీస్ సర్కిల్ ప్రశంసలు అందుకుంటున్నది. రోడ్డు భద్రత, ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాల్లో ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించినందుకు సైబరాబాద్లో ఉత్తమ సర్కిల్ గా అవార్డు దక్కింది. ఆమనగల్లు పోలీస్ సర్కిల్ పరిధిలోని ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల మండలాల్లోని పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన కేసుల విషయంలో బాధితులకు న్యాయం జరిగేలా సీఐ ఉపేందర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. వివిధ కేసుల్లో నేరాలకు పాల్పడిన నిందితులు తప్పించుకోకుండా చట్టం ప్రకారం శిక్షలు పడేలా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ఆమనగల్లు పోలీస్ సర్కిల్ పరిధిలో 622 కేసులు నమోదు అయ్యాయి. సర్కిల్లో 43 మిస్సింగ్ కేసులు కాగా అందులో 41 కేసులు పరిష్కారమయ్యాయి. ప్రజల సహకారంతో సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రత్యేక చర్యలు తీసుకుంటానని సీఐ ఉపేందర్ తెలిపారు. ఈ సంవత్సరం ఆమనగల్లు పోలీస్ సర్కిల్ ప్రోగ్రెస్ ఇలా ఉంది.
ఆమనగల్లు పీఎస్ పరిధిలో జరిగిన హత్య కేసులో నిందితులను గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకొని ప్రాపర్టీని రికవరీ చేశారు.
ఐపీఎల్ బెట్టింగ్, పేకాట రాయుళ్లను చాకచక్యంగా పట్టుకొని రూ.4 లక్షలను రికవరీ చేశారు. దొంగతనాల్లో 16 కేసుల్లో నిందితుడు మల్లేశ్, రేప్ కేసులో నిందితుడైన తలకొండపల్లి మండలానికి చెంది న శేఖర్ పై రెండు పీడీయాక్ట్లు నమోదు అయ్యాయి.
గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురు నిందితుల పై కేసులు నమోదు. గంజాయి పై ప్రత్యేకంగా నిఘాపెట్టారు.
ఆపరేషన్ ముస్కాన్ బృందం సహాయంతో బాల్యవివాహాలు అరికట్టడం, బాలకార్మికులను రెస్కూ చేసే కార్యక్రమాలు చేపట్టారు. సర్కిల్ పరిధిలో నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణా తరగతులు, పోలీసు అమరవీరుల సంస్మరణ దినం పురస్కరించుకొని రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు, విద్యార్థులకు ఆటల-పోటీలు నిర్వహించి సర్కిల్ ప్రజల చేత పోలీసులు ప్రశంసలు అందుకున్నారు.
సర్కిల్ పరిధిలో విధులు సక్రమంగా నిర్వహించిన ఎస్ఐలతో క్రైం విభాగం, పెట్రోలింగ్ సిబ్బందికి సీపీ నుంచి ప్రశంసలు, రివార్డులు దక్కాయి.
పోలీసు సంస్మరణ వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో సీఐ ఉపేందర్ ద్వితీయ స్థానం బహుమతి పొందారు.