పెద్దపల్లి కమాన్, ఆగస్టు 29: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే నెల 1వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు పు నః ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. విద్యాలయాల్లో శానిటైజేషన్ చేయిస్తున్నారు. 2020 మార్చిలో కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతపడగా, 2020-21 విద్యా సంవత్సరంలో మొదట ఆన్లైన్లో తరగతులు నిర్వహించారు. ఆ తర్వాత కొన్ని నెలలకు 8,9,10వ తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులను బోధించేందుకు పాఠశాలలను పునః ప్రారంభించినా, మళ్లీ కరోనా విజృంభించింది. దీంతో ఆన్లైన్లో పాఠాలు చెప్పి విద్యార్థులను పాస్ చేశా రు. 2021-22 విద్యా సంవత్సరంలో జూలై 1న విద్యార్థులకు ఆన్లైన్లో తరగతులను ప్రారంభించారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యక్ష తరగతులను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకొని, వచ్చేనెల 1 నుంచి విద్యాసంస్థలన్నీ తెరిచేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అన్ని ప్ర భుత్వ పాఠశాలలు, కళాశాలలను పరిశుభ్రం చేసి, శానిటేషన్ చేయాలని ఆదేశాలు రావడంతో విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పనులను ముమ్మరం చేశారు. ఆయా గ్రామ పంచాయతీ, మున్సిపల్ సిబ్బందితో పాఠశాలలు, కళాశాలల ఆవరణలోని పిచ్చి మొక్కలను తొలగిం చి, తరగతి గదులను నీటితో కడిగి, శానిటేషన్ చేయిస్తున్నారు.
మక్కువ ఎక్కువ..
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన బోధన అందిస్తుండడంతో పాటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు విద్యాసంస్థలపై అవగాహన కల్పిస్తుండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ప్రైవేట్ విద్యా సంస్థల కన్నా ప్రభుత్వ విద్యాలయాల్లో ఎక్కువ మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందుతున్నారు.
జిల్లాలో పాఠశాలలు..
జిల్లాలో మొత్తం 764 అన్ని యాజమాన్యాల పాఠశాలలు ఉండగా, 92,291 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 376 ప్రాథమిక పాఠశాలలు కాగా 12,858 మంది విద్యార్థులు, ప్రాథమికోన్నత పాఠశాలలు 141 కాగా 12,242 మంది, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 229 కాగా 46,076 మంది, హైయ్యర్ సెకండరీ స్కూల్స్ (హెచ్ఎస్ఎస్) 18 కాగా 8909 మంది విద్యార్థులు ఉన్నారు.
జూనియర్ కళాశాలలు..
జిల్లాలో మొత్తం 34 జూనియర్ కళాశాలలు ఉండగా, ఇందులో 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 14 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, 5 సోషల్ వెల్ఫేర్, 7 మోడల్ స్కూల్స్, 4 కస్తూ ర్బా, 3 మైనార్టీ, 3 జ్యోతిరావుబాపూలే కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో 5,496 మంది విద్యార్థులుండగా, ద్వితీయ సంవత్సరంలో 6,534 మంది ఉన్నారు. గతేడాది ప్రభుత్వ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో 3628 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందగా, ఈ విద్యాసంవత్సరంలో 3843 మంది చేరారు. ఈ ఏడాది 225 మంది ఎక్కువ విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశం పొందారు.
ప్రత్యేక పారిశుధ్య చర్యలు..
విద్యాసంస్థలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆయా పాఠశాలలు, కళాశాలల్లో గ్రామ పంచాయతీ, మున్సిపల్ సిబ్బందితో విద్యాశాఖ అధికారులు, ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయు లు, ప్రజాప్రతినిధులు పారిశుధ్య చర్యలు చేపట్టారు. పాఠశాలలు, కళాశాలల ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి, శానిటైజేషన్ చేయించారు. ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించారు. నీటి సౌకర్యం లేని పాఠశాలలకు మిషన్ భగీరథ పైపులైన్‌ను వేయించారు. విద్యార్థులకు సరిపడా బెంచీలను ఏర్పాటు చేసి, తాగునీటి వసతి, చేతులు శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లను అందుబాటులో ఉంచారు.