బొడ్రాయిబజార్ : రాష్ట్ర ఏర్పాటుతోనే బతుకమ్మకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మను మహిళలంతా కలిసి సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం అందంగా అమర్చిన బతుకమ్మలకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు 100మందికి కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్‌రావు, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉప్పల లలితాదేవీఆనంద్, ఆర్యవైశ్య మహిళా పట్టణాధ్యక్షురాలు కలకోట అనిత, రాష్ట్ర అధ్యక్షురాలు ఉప్పల శారద, సెక్రటరీ సామ్రాజ్యలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు జూలకంటి వాణి, పాల్గొన్నారు. అదేవిధంగా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మహిళలు, లక్ష్మీ వెంకటసాయి ఒకేషనల్ కళాశాలలో విద్యార్థినులు బతుకమ్మ ఆడారు.