అర్వపల్లి, అక్టోబర్ 10 : రాష్ట్ర ఏర్పాటులో రామరాజు విద్యాసాగర్‌రావు కీలకపాత్ర పోషించారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని జాజిరెడ్డిగూడెం సబ్ మార్కెట్‌యార్డు ఆవరణలో విద్యాసాగర్‌రావు విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే భూమిపూజ చేసి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో విద్యాసాగర్‌రావు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. నదీజలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచానికి చాటిచెప్పి నీటి లెక్కల మాస్టారుగా పేరుగాంచారని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాలను సాధారణ జనానికి అర్థమయ్యేలా వివరించి ఉద్యమానికి ఊపిరి పోసిన మహనీయుడని కొనియాడారు. విద్యాసాగర్‌రావు విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్‌గౌడ్, ఎంపీపీ మన్నె రేణుక, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ ఎర్ర నర్సయ్య, సర్పంచ్ కుంభం ఉషారాణి, టీఆర్ఎస్ నాయకులు మొరిశెట్టి ఉపేందర్, చిల్లంచర్ల విద్యాసాగర్, సోమిరెడ్డి, బందెల అర్వపల్లి, గోసుల విజయ్, కుంభం నాగరాజు, హరిప్రసాద్, వల్లాల రమేశ్ పాల్గొన్నారు.