ఈ నెల నుంచే అమలు l250 యూనిట్లకు వర్తింపు
ఫలించిన రజకులు, నాయీబ్రాహ్మణుల కల
పెద్దపల్లి, ఆగస్టు 9(నమస్తే తెలంగాణ)పరజకులు, నాయీబ్రాహ్మణుల కల నెరవేరింది. ఇప్పటికే రాష్ట్రంలోని కుల వృత్తులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం తాజాగా, వారికి ఇచ్చిన హామీ మేరకు శుక్రవారం నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చే పథకానికి రూ.198 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఇటీవల ఉత్తర్వులు జారీ చేయగా, ఈ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. కాగా, హెయిర్ సెలూన్లు, లాండ్రీ, డ్రైక్లీనింగ్ ఒక్కో షాపునకు రూ.2670లు, ఒక్కో దోబీ ఘాట్‌కు రూ.1045లు లబ్ధి చేకూరనున్నది. సీఎం కేసీఆర్ చెప్పిన మాట ప్రకారం తమకు ఉచిత విద్యుత్ అందిస్తున్నందుకు రజక, నాయీబ్రాహ్మణ లోకం సంతోషపడుతున్నది. రోజురోజుకూ పెరుగుతున్న ఖర్చులతో సతమతమవుతున్న తమకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొండంత భరోసానిస్తున్నందని సంబురాలు చేసుకుంటున్నది.
రజకులు, నాయీబ్రాహ్మణులకు ప్రకటించిన ఉచిత, సబ్సిడీ విద్యుత్‌ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దోబీ ఘాట్లు, డ్రైక్లీనింగ్, లాండ్రీ షాపులు, హెయిర్ సెలూన్షాపులకు 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరాకు సంబంధించి ఇటీవలే ఆదేశా లు ఇవ్వడంతో ఉమ్మడి జిల్లాలో అధికార యం త్రాంగం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టింది. కాగా, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 3 వేల క్షౌరశాలలు, 18 వేలకు పైగా దోబీఘాట్లు, లాండ్రీ, డ్రైక్లీనింగ్ షాపుల నిర్వాహకులకు ప్రయోజనం చేకూరనున్నది. పెద్దపల్లి జిల్లాలో 228 లాండ్రీ, డ్రైక్లీనింగ్ షాపులను నిర్వహించే 5, 600ల మంది రజకులు లబ్ధిపొందనున్నారు. అదే విధంగా జిల్లాలో 546ల సెలూన్ షాపులను నిర్వహించే 8, 840మంది ఓనర్లు, వర్కర్లకు ప్రయోజనం కలుగనుంది. ఈ లెక్కన జిల్లాలోని రజక, నాయీబ్రాహ్మణులకు నెలకు సుమారు రూ.20,42,205ల లబ్ధి చేకూరనుంది.