సువిశాల భారతదేశాన్ని ఏలిన చంద్రవంశపు రాజ ప్రముఖుల్లో నహుషుని కుమారుడైన యయాతి ఒకరు. కౌరవ పాండవులు ఈ వంశానికి చెందినవారే. యయాతి గాథ భారత, భాగవతాలలో ప్రముఖంగా కనిపిస్తుంది. ఒకప్పుడు దానవుల గురువు శుక్రాచార్యుని కుమార్తె దేవయాని, అసుర రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠల మధ్య చెలరేగిన చిన్న వివాదం తీవ్రరూపం దాల్చింది.
దాంతో కినుక వహించిన శర్మిష్ఠ..దేవయానిని బావిలోకి తోసివేస్తుంది. అదే సమయంలో వేటకు వచ్చిన యయాతి దేవ యానిని రక్షిస్తాడు. అయితే తనకు జరిగిన అవమానాన్ని మరచిపోలేని దేవయాని,తండ్రి ద్వారా వృషపర్వునిపై ఒత్తిడి తెచ్చి శర్మిష్ఠను తన దాసిగా చేసుకుంటుంది.కాలాంతరంలో యయాతి ఆమెను పరిణయమాడటంతో, దేవయానితో బాటుగా ఆమె చెలికత్తె శర్మిష్ఠ కూడా యయాతి రాజ ప్రాసాదానికి చేరుకుంటుంది.
కాలక్రమంలో యయాతికి, శర్మిష్ఠకు మధ్య అనురాగం ఏర్పడి, వారిద్దరికీ రహస్యంగా వివాహం జరుగుతుంది. ఈ విషయం తెలిసి తీవ్రంగా ఆగ్రహించిన శుక్రాచార్యుడు యయాతిని అకాల వృద్ధాప్యం పొందాలని శపిస్తాడు. అయితే, యయాతి కోరిక మేరకు, అతని కుమారులలో ఎవరైనా తండ్రి వృద్ధాప్యాన్ని స్వీకరిస్తే, యయాతి తిరిగి యౌవనాన్ని అనుభవించవచ్చని శుక్రాచార్యుడు శాపాంతరం అనుగ్రహిస్తాడు.
యయాతి తన కుమారులను వారి యౌవనాన్ని తనకు ఇవ్వవలసిందిగా కోరుతాడు. చిన్న కుమారుడు పూరు తండ్రి కోరికను అంగీకరించి, తన యౌవనాన్ని తండ్రి వృద్ధాప్యంతో మార్పిడి చేసుకుంటాడు. యయాతికి యౌవనం తిరిగి లభిస్తుంది. రాజ్యం, సంపద, అధికారం అన్నీ సమకూరుతాయి. ఇంద్రియ సుఖాలను తనివితీరా అనుభవించడానికి ఇక ఎలాంటి అడ్డంకీ లేదు. వెయ్యేండ్ల సుదీర్ఘకాలం పాటు భోగభాగ్యాలను అనుభవిస్తాడు. అయితే, ఒకసారి అనుభవించిన సుఖం తృప్తిని ఇవ్వకపోగా, మరింత సుఖానుభూతి కోసం మనసు ఉవ్విళ్లూరుతుంది. సుదీర్ఘ కాలం తర్వాత.. భోగాలను అనుభవించడం వల్ల కోరికలు తీరవని, వాటిని మరింత అనుభవించాలనే తపన పెరుగుతుందనే మౌలిక సత్యాన్ని గ్రహిస్తాడు యయాతి. చివరికి సాంసారిక జీవితంపై విరక్తి చెంది, వానప్రస్థాశ్రమాన్ని స్వీకరిస్తాడు.
ఆ సందర్భంగా భాగవతంలో యయాతి చెప్పిన ప్రసిద్ధ శ్లోకం ఇది –
న జాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి
హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవాభివర్ధతే॥
అంటే, కోరికలను భోగాల ద్వారా తీర్చలేం. అగ్నిలో ఆజ్యం వేస్తే అది ఆరిపోకుండా మరింత ప్రజ్వలించినట్లే, అనుభవాలతో కోరికలు తగ్గవు, మరింత పెరుగుతాయి.
నిత్యజీవితంలో అనుభవాల వేటలోనే నిరంతరం సతమతమవుతూ ఉండే ఎందరో ఆధునిక ‘యయాతు’లను చూస్తుంటాం. ఇటువంటి మానవ స్వభావానికి, ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రం ‘హెడానిక్ ట్రెడ్మిల్’ అని నామకరణం చేసింది. ‘హెడోనే’ అనే గ్రీకు పదానికి సుఖం, ఆనందం, ఇంద్రియానుభూతి అనే అర్థాలున్నాయి. ఇదే మూలపదం నుంచి పుట్టిన ‘హెడోనిజం’ అనే తత్వశాస్త్ర సిద్ధాంతం, జీవిత పరమావధి సుఖానుభవమే అన్న భావనను విశ్లేషిస్తుంది.
అయితే ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మరో ఆసక్తికరమైన విషయాన్ని గమనించారు. సుఖాలను అనుభవిస్తున్నప్పుడు మనసు, శరీరం వాటికి చాలా త్వరగా అలవాటు పడిపోతాయి. అందుకే ‘హెడోనే’ అనే మూలానికి ‘ట్రెడ్మిల్’ అనే పదాన్ని జోడించారు. ట్రెడ్‌మిల్‌పై ఎంతసేపు నడిచినా మనిషి గమ్యాన్ని చేరుకోడు. వేగం పెంచితే ట్రెడ్మిల్ కూడాఅదే వేగంతో తిరుగుతుంది. అలాగే కొత్త సుఖాలను పొందినా, కొంతకాలానికే అవి కొత్త సాధారణ స్థితిగా మారిపోతాయి. వెంటనే మనసు మరో కొత్త కోరికను లేదా మరింత సుఖాన్ని వెంబడించడం ప్రారంభిస్తుంది.
ఈ సందర్భంలో, సంతృప్తి క్రమంగా తగ్గిపోతుందనే వాస్తవాన్ని అర్థశాస్త్రం లోని ‘లా ఆఫ్ డిమానిషింగ్ మార్జినల్ యుటిలిటీ’ సిద్ధాంతం కూడా పొందుపరుస్తుంది. ఒకే స్వభావం గల ఉత్పత్తి లేదా సేవను మొదటిసారి ఆస్వాదించినంత తృప్తిగా తరువాత ఆస్వాదించలేం. అదే స్థాయి సంతృప్తిని పొందాలంటే ఆ వస్తువు లేదా సేవ మోతాదును గానీ, నాణ్యతను గానీ పెంచాల్సి వస్తుంది. పొగ తాగడం, మద్యపానం వంటి వ్యసనాలు ఈ భావనను ప్రస్ఫుటంగా ఉదాహరిస్తాయి. ఇలా గమ్యం లేని ఆ ‘హెడానిక్ ట్రెడ్మిల్’పై మనిషి నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటాడు.
ఈ మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న యాపిల్ వంటి సంస్థలు, తరచూ కొత్త నమూనాలను విడుదల చేస్తుంటాయి. ‘కొత్తది’ అనే ఆకర్షణతోపాటు మరిన్ని సౌకర్యాలు పొందవచ్చేమో అనే ఆశతో వినియోగదారులు అధిక ధర వెచ్చించి వాటిని కొనుగోలు చేయడానికి మళ్లీ సిద్ధపడతారు. అయితే ‘హెడానిక్ ట్రెడ్మిల్’ అంటే సుఖాలను అనుభవించవద్దని, కోరికలను త్యజించమని చెప్పడం కంటే, కోరికలు ‘ఇంతింతై, వటుడింతై’ అన్నట్లు ఎలా విస్తరిస్తాయో వివరించే ఒక మనోవిజ్ఞాన పరిశీలన మాత్రమే. ఒకప్పుడు అద్దె ఇంట్లో నివసించే వ్యక్తి రెండు గదుల సొంత ఫ్లాట్ కోసం కలలు కంటాడు. అది వచ్చిన తరువాత మూడు గదుల ఫ్లాట్, ఆ తరువాత విల్లా కోసం తపన పడతాడు. వినియోగ విలాసాలు, ఉద్యోగాల్లో పదోన్నతులు, వ్యాపార విస్తరణ, సమాజంలో హోదా, గుర్తింపు ఇలా అన్ని విషయాల్లో కోరికల ట్రెడ్మిల్ నిరంతరం తిరుగుతూనే ఉంటుంది.
వాస్తవానికి కోరికల వల్లే వ్యక్తిగత, సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుంది. సమస్య కోరికల్లో కాదు; ‘ఇది దొరికితే ఇక పూర్తిగా తృప్తి చెందుతాను’ అన్న అంచనా.. మన ఔచిత్యంలో ఉంటుంది. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రం కూడా.. శాశ్వత సంతృప్తి స్వచ్ఛందంగా విధించుకున్న పరిమితుల వల్లనే లభిస్తుందని, అపరిమిత భోగాల వల్ల కాదని సూచిస్తున్నది. ఈ స్థితిని చేరుకోవడానికి యోగా, ధ్యానం, ప్రార్థన, ఆధ్యాత్మిక సాధన వంటి ఎన్నో మార్గాలను మన పురాణేతిహాసాలు సూచించాయి.
ఈ సత్యాన్ని గ్రహించిన మన సనాతన ధర్మం మానవ జీవితాన్ని నాలుగు ఆశ్రమాలుగా విభజించి, చివరిగా వానప్రస్థాశ్రమాన్ని నిర్దేశించింది. ఆ దశలో మనిషి భోగభాగ్యాల నుంచి క్రమంగా వైదొలిగి, పరిమిత వనరులతో ప్రశాంత జీవనాన్ని గడపాలని సూచించింది. ఇది కోరికలను నిరాకరించడం కాదు; వాటికి హద్దు నిర్దేశించడం. ఏది, ఎంతవరకు, జీవితంలో ఏ దశ వరకు ఆశించాలో; దానికోసం ఎంత సమయం, ఎంత శక్తి వెచ్చించాలో, అందుకోసం చేయవలసిన త్యాగాల పర్యవసానం ఏమిటో తెలుసుకుని జీవించడం. అందుకే మనం జీవితంలో ఏదో ఒకటి సాధించిన ప్రతిసారీ, వెంటనే మరో లక్ష్యానికి ప్రణాళికలు వేసుకోకుండా, ఒక్కసారి మనల్ని మనమే తరచి చూసుకోవాలి. ‘నేను నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకున్నానా? మరోసారి ట్రెడ్మిల్ పైకి ఎక్కాల్సిన
అవసరం నిజంగా ఉందా?’ అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి!
కృష్ణ బాలాజి పల్లపోతు
99490 98406