shaligram | సాలగ్రామాలు అనే పేరు తరచూ వినిపిస్తుంది. సనాతన కుటుంబాల్లో సాలగ్రామ అర్చనకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. దైవానికి ప్రతీకలుగా భావించే సాలగ్రామాలు సహజ సిద్ధంగా ఏర్పడినవి. నేపాల్లోని గండకీ నదిలో దొరుకుతాయి. వీటిని విష్ణు సంబంధమైనవిగా భావిస్తారు. ఆపస్తంబుని సూత్రాల్లోనూ సాలగ్రామ అర్చన ప్రాశస్త్యం కనిపిస్తుంది. అంతేకాదు సాలగ్రామ దానం ఎంతో పుణ్యప్రదమని నిర్ణయసింధు లాంటి ధర్మగ్రంథాలు చెబుతున్నాయి. బ్రహ్మాండ, అగ్ని, బ్రహ్మవైవర్తాది పురాణాల్లోనూ, దేవీ భాగవతంలోనూ సాలగ్రామాల ప్రాశస్త్యం కనిపిస్తుంది. ఈ విషయాలను సంగ్రహించి సాలగ్రామ లక్షణం, సాలగ్రామ సమీక్ష తదితర గ్రంథాల్లో ప్రస్తావించారు.
రూపాలను బట్టి సాలగ్రామాలను వాసుదేవ, కేశవ, నారాయణ, నృసింహ మొదలైన పేర్లతో పిలుస్తారు. గోలోకంలోని తులసి, సుదాములు రాధాదేవి శాపానికి గురై భూమిమీద తులసి, శంఖచూడులుగా జన్మిస్తారు. కాలక్రమంలో వీళ్లిద్దరికీ వివాహం జరుగుతుంది. తర్వాత తులసి దేహం నుంచి హిమగిరికి దక్షిణంగా ఉన్న గండకీ నది, కేశాల నుంచి తులసి మొక్కలు పుట్టాయని దేవీభాగవతం చెబుతున్నది. గండకీ నదిలో లభించే సాలగ్రామాలను దైవానికి ప్రతిరూపంగా భావిస్తారు. హిమగిరిలో పుట్టిన సాలగ్రామాన్ని, సముద్రంలో పుట్టిన శంఖాన్ని ఒకేచోట ఉంచి పూజించడం సనాతన ధర్మంలోని సమైక్య భావాన్ని సూచిస్తుంది.
సాలగ్రామాలు ఇంట్లో ఉంటే ఆచార వ్యవహారాలు విధిగా పాటించాలని పెద్దలు చెబుతారు. ఇంట్లో మైల కలపొద్దు. సాలగ్రామాలకు నిత్యం అభిషేకం, అర్చన విధిగా చేయాలి. నైవేద్యం తప్పనిసరి.
– డా॥ వెలుదండ సత్యనారాయణ, 94411 62863
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Gudipadu | తెలంగాణలోని ఈ గుడిలో గిరిజనులే పూజారులు
పెండ్లిళ్లు, శుభకార్యాల సమయంలో కంకణం ఎందుకు కడతారు?
ధర్మ సందేహం… పిండం కాకి తినకపోతే ఏమౌతుంది?
ఆది శంకరాచార్యులు సన్యాసం స్వీకరించేందుకు తల్లిని ఎలా ఒప్పించాడో తెలుసా?