జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే॥
‘అనంతమైన, ఆనందమయమైన జ్ఞానానికి అధిపతి, స్వచ్ఛమైన స్ఫటికం వంటి ఆకృతి కలిగి, సకల విద్యలకు అధిదేవత అయిన హయగ్రీవుడికి నమస్కరిస్తున్నాను’ అని పై శ్లోకానికి అర్థం. హయగ్రీవ అవతారంలో శ్రీమహావిష్ణువు వేదాలను ఉద్ధరించాడు. అందువల్ల, వేదాలతోపాటు సమస్తమైన వాఙ్మయానికి, జ్ఞానానికి హయగ్రీవుడు అధిపతి అయ్యాడు. ఈ అవతారం దాల్చిన శ్రావణ పౌర్ణమిని హయగ్రీవ జయంతిగా జరుపుకొంటారు.
ఈ స్వామి గుర్రం ముఖం, మానవ శరీరం కలిసిన రూపంలో దర్శనమిస్తాడు. స్వామి వామాంకం మీద లక్ష్మీదేవి ఆసీనురాలై ఉంటుంది. స్వామిది తెల్లటి శరీర ఛాయ. నాలుగు చేతుల్లో శంఖం, చక్రం, చిన్ముద్ర, పుస్తకాలను ధరించి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. శ్రావణ పూర్ణిమ రోజున హయగ్రీవుడు అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల్లో హయగ్రీవ అవతారానికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి.
మధుకైటభులనే రాక్షసులు వేదాలను అపహరించి, పాతాళంలో దాచిపెడతారు. వేదాలు లేనిదే సృష్టికార్యం చేయలేనని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి విన్నవించుకుంటాడు. వెంటనే, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారంలో పాతాళానికి చేరి, మధుకైటభులను వధించి, వేదాలను రక్షించి, బ్రహ్మదేవుడికి తిరిగి అప్పగిస్తాడు.
హయగ్రీవుడు పరిపూర్ణ వేదమూర్తి. స్వామి రూపం సకల విద్యలకు నిలయం. అంతేకాదు, ఆయన సకల దేవతాస్వరూపం కూడా. ఆయనవల్లనే ఈ లోకానికి లలితా సహస్రనామం, దుర్గా త్రిశతి మొదలైన విద్యలు అందాయి. ఎంతోమంది రుషులు హయగ్రీవస్వామిని అర్చించి ఆత్మజ్ఞానాన్ని సంపాదించారు. దాన్ని సమాజ పునరుద్ధరణ కోసం వినియోగించారు.