వారు లేనిదే వీరి చరిత్ర తెలియదు. ఒకరు చరిత్ర చెబితే, మరొకరు వారి గుర్తులు చూపిస్తే.. ఇంకొకరు వారి వంశచరిత్రకు నియమబద్ధంగా రూపమిస్తారు. కోయకళల్లో ఒకటైన డాలుగుడ్డల రూపకర్తల ప్రత్యేకత బాహ్యప్రపంచానికి తెలియకపోయినా వారు రూపొందించిన వస్త్రమే దేవతామూర్తులకు ఆచ్చాదనగా నిలుస్తుంది. మేడారం జాతరలో వేల్పులైన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపైకి తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించే క్రమంలో దేవతా వస్ర్తాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అందరికీ పూజనీయమైన ఈ పడిగల తయారీదారులు మాత్రం ఎవరికీ తెలియదు. బాహ్యప్రపంచానికి పరిచయం లేని ఈ కళాకారుల ప్రస్థానంలో ఆసక్తికరమైన విషయాలెన్నో కనిపిస్తాయి.
కోయజాతిలో అతి తక్కువ కుటుంబాలు ఉన్న తోలెం వంశీయులు మాత్రమే దేవతకు సంబంధించిన వస్ర్తాలను తయారుచేస్తారు. మేడారం జాతర రాగానే అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో కానీ, అక్కడున్న దేవతల గద్దెలపై కనిపించే వస్ర్తాలపై ఎవరూ అంతగా దృష్టి సారించరు. కోయలు మాత్రం ఈ వస్ర్తాలను తమ ఆరాధ్య దైవాలకు ప్రతిరూపంగా, తమ వంశ చరిత్రను సూచించేవిగా భావిస్తారు. ఈ పడిగలపై రకరకాల బొమ్మలు ఉంటాయి. ఒక్కో బొమ్మకు ఒక్కో విశేషార్థం ఉంటుంది.

మేడారం జాతరలో దేవతలను తీసుకుని వచ్చే క్రమంలో పూజారులు పవిత్రంగా భావించే దేవతావస్ర్తాల వెనక పెద్ద చరిత్రే ఉంది. ఏయే దేవతలను ఎవరెవరు పూజిస్తారో, ఈ పూజకు సంబంధించిన హక్కు ఎవరికైతే ఉంటుందో వారి పుట్టుపూర్వోత్తరాలు, వంశచరిత్రను ఈ వస్ర్తాలు చెబుతాయి. ఈ పడిగలపై ఆయా వంశాలకు చెందిన మూలపురుషులు ఎవరు, వారి పాలనాక్రమం, వారికి సంబంధించిన చిహ్నాలన్నీ కనిపిస్తాయి. తాబేలు, ఆంజనేయుడు, మహారాజు, రాణి ఇలా ఒక్కో వస్త్రంపై ఎనభైరకాల బొమ్మల వరకూ కనిపిస్తాయి. వస్త్రంపై వేసి ఉన్న బొమ్మల వెనక ఆయా దేవతలను ఆరాధించే హక్కు కలిగిన ఆదివాసీ కోయల చరిత్ర దాగి ఉంటుంది.

ఈ అరుదైన దేవతా వస్ర్తాలను తయారు చేసే హక్కు తోలెం వంశీయులకు దక్కింది. తమ పూర్వికులు ఆచరించిన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఇప్పటికీ దేవతా వస్ర్తాలను తయారు చేస్తున్నారు తోలెం వెంకటేశ్వర్లు, తోలెం కళ్యాణ్‌కుమార్. డిగ్రీ వరకు చదువుకున్న వీళ్లిద్దరూ పూర్వికుల నుంచి వచ్చిన ఆచారాన్ని, కళను వదిలిపెట్టకుండా దేవరగుడ్డలు రూపొందిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం ఎలుకలగూడెంలో వీరి కుటుంబాలు నివసిస్తున్నాయి. కనీస రవాణా సౌకర్యం లేని ఎలుకలగూడెం వీరి కళతోనే ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ కుటుంబంలో సుమారు ఐదు తరాల నుంచి పడిగలకు రూపమిస్తున్నారు. దేవరగుడ్డ తయారుచేసే క్రమంలో వెనకటి కాలం నుంచి ఉన్న మంచం, పీట, ఇతర వస్తువులు నేటికి కూడా వారి ఇండ్లలో కనిపిస్తాయి.

తమ వంశానికి చెందిన మూల పురుషులు, స్త్రీమూర్తుల చరిత్రలను కోయలు మౌఖికంగా చెప్పుకొంటారు. వీటిని కోయ పురాణాలు, వీరగాథలు, పటం కథలుగా అభివర్ణిస్తారు. ఈ పురాణాలను ఒక ప్రత్యేకమైన వస్త్రంపై బొమ్మలుగా చిత్రించి చరిత్రకు రూపమిస్తారు తోలెం వంశీయులు. కోయల పూర్వమూలాలు, పడిగ బొమ్మలు, పూర్వ కోయ రాజ్యాల చరిత్ర ఇవన్నీ ఇందులో నిక్షిప్తం చేస్తారు. ప్రకృతి సమతౌల్య సిద్ధాంతంలో భాగంగా ఆదివాసీలు తమ వంశ వృక్షాలను మూడు నుంచి ఏడు గొట్లుగా ఏర్పాటు చేసుకున్నారు.
ఆ గొట్టు గోత్రాలు పడిగలపై కనిపిస్తాయి. ఇలవేల్పు వంశచరిత్రను తలపతి చెబితే, వడ్డె తమ వంశానికి సంబంధించిన మూలాలు చెబుతాడు. ఆర్తిబిడ్డ పుట్టుపూర్వోత్తరాలు తెలిపిన నేపథ్యంలో ఈ ముగ్గురూ చెప్పిన గోత్రాల చరిత్రను బట్టి వారి బొమ్మలను గుడ్డపై రూపొందిస్తారు. ఇందుకోసం రేయింబవళ్లు కష్టపడతారు. అలా రూపుదిద్దుకున్న పడిగలను కోయలు అత్యంత పవిత్రంగా చూసుకుంటారు. కేవలం జాతరలు, పండుగల సమయాల్లోనే ఈ డాలుగుడ్డలను తీసి సంబరాలు జరుపుకొంటరు. తరవాత మళ్లీ పండుగలు, జాతరలు వచ్చే వరకు ఒక పవిత్ర స్థలంలో ఉంచి అత్యంత అరుదైన వస్తువుగా కాపాడుకుంటారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల నుంచి పలు వంశాలకు చెందిన కోయలు వచ్చి తోలెం వంశీయుల దగ్గర తమ గోత్రాలకు సంబంధించిన దేవరగుడ్డలను కుట్టించుకుంటుంటారు. ఒక వస్ర్తాన్ని తయారుచేయడానికి సుమారు మూడు నెలల సమయం పడుతుందట. ఈ వస్త్రం తయారీకి సంబంధించిన పాత మంచం, ఇతర వస్తువులన్నీ దశాబ్దాలుగా తమ ఇంట్లోనే ఉన్నాయని, వీటిపైనే ఈ పవిత్ర వస్ర్తాన్ని తయారు చేస్తామని తోలెం కళ్యాణ్‌కుమార్ చెప్పుకొచ్చాడు. పడిగలు తయారు చేసే సమయంలో ఒక్క పూట భోజనం మాత్రమే చేస్తారు.
నియమ నిష్ఠలు పాటిస్తారు. వస్త్రంపై క్రమపద్ధతిలో చిత్రాలు వేస్తూ, వాటిని వరుసగా అమరుస్తారు. బహిష్టుగా ఉన్న స్త్రీలను.. వస్త్రం వేసే గది గడప తొక్కనీయరు. అంత కఠినంగా ఆచారాలు పాటిస్తారు. ‘తరాలుగా పడిగలు రూపొందిస్తున్నాం. పండుగలు, జాతర సమయంలో వీటి తయారీ ఉంటుంది. అందుకే, దీనిని జీవనోపాధిగా ఎంచుకోలేకపోతున్నాం. మిగతా సమయాల్లో వ్యవసాయం మీదే ఆధారపడుతున్నాం’ అని చెప్పుకొచ్చాడు కళ్యాణ్‌కుమార్. ఈయన హైదరాబాద్‌లో టీచర్ ట్రైనింగ్ పూర్తి చేశాడు. డిగ్రీ చదివిన వెంకటేశ్వర్లు వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు.
అరుదైన కళకు జీవం పోస్తూ.. ముందు తరాలకు వారధిగా నిలుస్తున్న వెంకటేశ్వర్లు, కళ్యాణ్‌కుమార్ తమకు ప్రభుత్వం చేయూతనివ్వాలని ఆకాంక్షిస్తున్నారు. కోయకళాకారుడు దివంగత పద్మశ్రీ రామచంద్రయ్య వీరికి తాతయ్య వరుస అవుతాడు. డోలి కళాకారుడిగా ఆయనను ప్రభుత్వం గుర్తించిన తర్వాతే తమ కళ వెలుగులోకి వచ్చిందని చెబుతున్నారు వీళ్లు. మేడారంలో కొన్ని ప్రదర్శనల్లో పాల్గొన్నప్పటికీ… తమను పూర్తిస్థాయి కళాకారులుగా గుర్తించడం లేదని అంటున్నారు.
ఈ కళను బతికించుకోవాలని తమకు ప్రగాఢంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ సహకారం అందితేనే అది సాధ్యం అవుతుందని చెబుతున్నారు. తెలంగాణ పండుగ, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మేడారం జాతరకు వన్నె తెస్తున్న ఈ కళాకారులను ప్రభుత్వం ఆదరించాలని మనమూ ఆకాంక్షిద్దాం.
– రంగనాథ్ మిద్దెల
– గడసంతల శ్రీనివాస్