మానవాళి చరిత్రలో వెలుగు దివ్వెగా, నైతిక విలువల పటిష్ఠమైన పునాదిగా నిలిచింది పవిత్ర ఖురాన్ గ్రంథం. అణువణువునా ఆధ్యాత్మిక సారాన్ని నింపుకొన్న ఈ గ్రంథం, మనస్సును ప్రక్షాళన చేసే ఒక అద్భుతమైన జ్ఞాన భాండాగారం. ఖురాన్ పారాయణం కేవలం ఒక ధార్మిక ఆచారంగా చూడడం కంటే, అది ఇహలోకంలో, పరలోకంలోనూ శ్రేయస్సును, పుణ్యాన్ని ప్రసాదించే ఒక పవిత్ర కార్యక్రమంగా భావించాలి. అందుకే దైవ ప్రవక్త (సల్లం), ‘ఖురాన్‌ను ఎక్కువగా పారాయణం చేయండి. ప్రళయ దినాన అది మీ కోసం సిఫారసుదారుగా వస్తుంది’ అని ఉద్బోధించారు.
ఈ మాటలు ఖురాన్ మహోన్నత శక్తిని, దాని పఠనం వల్ల కలిగే ప్రయోజనాన్ని తెలియజేస్తున్నాయి. ఖురాన్ నేర్చుకుని, ఆ జ్ఞానాన్ని ఇతరులకు పంచేవారే సమాజంలో అత్యుత్తములని ప్రవక్త పేర్కొనడంలో ఆ దివ్య గ్రంథంలోని జ్ఞానాన్ని ఆచరించి, ఇతరులకు అందించాల్సిన గురుతర బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందనే సందేశం ఉంది. అయితే, కేవలం పఠనంతోనే అంతా అయిపోదు. ఖురాన్ అందించిన ఉన్నతమైన సూక్తులను, నైతిక విలువలను నిజ జీవితంలో ఆచరించినప్పుడే అసలైన, నిత్యమైన పుణ్యం లభిస్తుంది. పారాయణం అనేది ఆచరణకు తొలి మెట్టు మాత్రమే.
– ముహమ్మద్ ముజాహిద్, 96406 22076