శుకుడు పరీక్షిత్తుతో… వసుమతీశా! (రాజా!) ద్వారకాపతి హరి జాంబవతీదేవిని సతి- సహధర్మచారిణిగా పరిగ్రహించాడు. దరిమిల- పిమ్మట, సత్రాజిత్తును రాజసభకు రప్పించి, జరిగినదంతా ఎరిగించి- చెప్పి మణిని అతనికి అప్పగించాడు. సత్రాజిత్తు సిగ్గుపడి మణిని పుచ్చుకొని పశ్చాత్తాపం చెందాడు. బలవంతునితో విరోధం కలిగినందుకు కలవరపడ్డాడు. ఇంటికి చేరి..
కం॥ ‘పాపాత్ముల పాపములం
బాపంగా నోపు నట్టి పద్మాక్షునిపై
బాపము గలదని నొడివిన
పాపాత్ముని పాపమునకు బారము గలదే?’
‘పాపాత్ములైన వారి పాపాలన్నీ పోకార్చ- నశింపజేయగల పద్మాక్షునిపై మణిని అపహరించాడనే అపనింద వేసిన పాపిని నేను. ఏపారు- అతిశయించిన ఈ నా పాపానికి పారం- అంతం ఉందా? మితభాషిగా ఉండక ఎందుకిలా మందమతినై నందనందనునిపై అమంద- లేనిపోని పెద్దనింద వేశాను? నేను ధనాశాపరుణ్ని, దుష్టుణ్ని, మత్తుణ్ని. ఈ నా మేను- దేహం కాల్చనా? నా ఖలం- పాపం ఎలా తొలగుతుంది? ఏ చందాన- రీతిగా ముకుందుడు నందాత్మజుడు ప్రీతుడై నన్ను కనికరించి కాపాడతాడు?’ అని సత్రాజిత్తు పరితపించాడు.
ఆ॥ ‘మణిని గూతు నిచ్చి మాధవు పదములు
పట్టుకొంటినేని బ్రదుకు గలదు
సంతసించు నతడు సదుపాయమగునిది
సత్య మితరవృత్తి జక్కబడదు’
స్యమంతక మణిని, దానితోపాటుగా నా కన్యకామణి సత్యభామను, సౌజన్య సంశోభితుడు, ధన్యుడు అయిన మాధవునికిచ్చి, ఆయన పాదాములు పట్టుకుంటాను. శ్రీకాంతుడు కృష్ణుడు సంతసిస్తాడు. అప్పుడే నాకు జీవన వసంతం. అంతకన్నా మరేవిధంగానూ నా దురితం- పాపం అంతం కాదు. ఇది సత్యం.
శుకయోగి- రాజా! ఇలా అనేక రీతుల తన ఇంట్లో ఏకాంతంగా ఆలోచించి సత్రాజిత్తు నీతి కని- విచారించి సుమతియై, ఆపదలనే సముద్రాలను తరింపజేసేవాడు, కాంతల స్వాంతా- మనసులను హరించేవాడు, దానవేశ్వరులను దునుమాడే- సంహరించేవాడు అయిన రమాకాంతుడు, రత్నగర్భుడు కృష్ణునికి తన కాంతారత్నాన్నీ, స్యమంతక రత్నాన్నీ సమర్పించాడు. తామరసాక్షుడు- పద్మనేత్రుడు, ఉదార యశోనిధి అయిన ద్వారకాధిపతి, అఖిల భూపతు (రాజు)లచే సకల సద్గుణవతిగా నుతింపబడినదీ, గొప్ప పాతివ్రత్యము, నీతి, ధర్మ విచక్షణత్వం, దయ, ఖ్యాతి- వీనియందు మహాప్రీతి (కాంక్ష) కలిగిన రామను, సోముని (చంద్రుని) మించిన ముఖకాంతి కలిగిన సత్యభామను భార్యగా గ్రహించాడు.
క॥ ‘మణి యిచ్చినాడు వాసర
మణి, నీకును మాకు గలవు మణులు, కుమారీ
మణి చాలు నంచు గృష్ణుడు
మణి సత్రాజిత్తునకును మరలగనిచ్చెన్’
‘ఈ స్యమంతకమణిని నీకు వాసరమణి- సూర్యభగవానుడు ప్రసాదించాడు. మాకూ ఇంతకు మించిన అణిమాది సిద్ధులనే మణులకు కొరత లేదు. ఈ కన్యకామణి చాలు. సత్రాజిత్తు
అపుత్రుడు కాన ఈ మణిని ఈనే హేమా- బంగారానికి మేమే వారసులం’ అని పలుకుతూ ఆమాని, విశ్వయోని యైన రుక్మిణీజాని హరి- కృష్ణుడు స్యమంతకమణిని తిరిగి సత్రాజిత్తుకు ఇచ్చివేశాడు. ప్రాస స్థానంలో మణి చతుష్టయంతో భాసించే పై ‘మణి కందం’- మణి వంటి కంద పద్యం భక్త కవి శిరోమణి కవితా చేతనా ఖని- గని నుంచి జనియించిన అనేక పద్య గద్య మణి మాణిక్యాలలో ఒకటి!
ఇదిలా ఉండగా పాండవులు కుంతీ సమేతంగా లక్క ఇంటిలో చిక్కి కాలిపోయారని విన్నాడు వ్యాల- కాళియ మర్దనుడు కృష్ణుడు. సర్వమూ ఎరిగిన ‘విన్నాణి- విజ్ఞాని’ అయిన హరి బలరామ సమేతంగా కరి నగరానికి- హస్తినకు చేరి కృప, విదుర, గాంధారీ, భీష్మ, ద్రోణులను (పాండవులు మరణిస్తే బాధపడేవారు వీరే కనుక) ఊరడించాడు.
శుకుడు- పరీక్షిద్రాజా! అక్రూరుడు, కృతవర్మ కృష్ణ భక్తులు. వీరిద్దరూ- ‘దుర్మార్గుడైన సత్రాజిత్తు సత్యభామని మనకిస్తానని చెప్పి మాధవునికిచ్చి మనువు- పెండ్లి చేసి మాట తప్పాడు. ఎలాగైనా నవ్వు ఆ స్యమంతక మణిని వశపరచుకో’ అని శతధన్వుని ఉసి గొల్పారు. శతధన్వుడు నిద్రిస్తున్న సత్రాజిత్తుని కసిగా, కసాయివాడు పశువును కొట్టి చంపినట్లుగా బలవంతంగా అంతమొందించాడు. చెంతనున్న కాంతలు రోదిస్తూ ఎంతగా మొరపెట్టినా కనికరించక ఆ క్షుద్రుడు లోభంతో మణిని అపహరించుకుపోయాడు. సత్రాజిత్తు మరణానికి వంత-బాధపడుతూ సాత్రాజితి- సత్యభామ అతని శరీరాన్ని తైలద్రోణి- నూనె తొట్టిలో భద్రపరచి, హస్తినకు వెళ్లి ఆర్త శరణ్యుడైన తన భర్తకు కన్నతండ్రి మరణవార్తను విన్నవించింది. బలరామకృష్ణులు ఇలలో అవతరించిన ఈశ్వర స్వరూపులైనా లీలగా మనుష్య భావంతో విలపించారు. భామా బలరాములతో ద్వారకకు తిరిగి వచ్చిన రామానుజుడు ఘనశ్యాముడు కృష్ణుడు తనను కడతేర్చడానికే కడగట్టా- నిశ్చయించాడని గ్రహించి శతధన్వుడు ప్రాణభయంతో కృతవర్మ ఇంటికి వెళ్లి తనకు త్రాణ- రక్షణ కోరాడు.
కృతవర్మ ఇలా అన్నాడు… ‘అక్కట!- అయ్యో! శతధన్వా! ఎంత పని చేశావయ్యా! మహానుభావులైన రామకృష్ణులను ఉక్కడగించగల- నశింపజేయగల సమర్థులు ఇక్కడ ఎవరున్నారు? వారి అపరిమిత పరాక్రమం మనకు అవిదితం- తెలియంది కాదు. కంసుడు సపరివారంగా ఖలవిదారి హరిచే సంహరింపబడలేదా? దురాధర్షుడు- దైత్యాదులకు కూడా దుర్దముడు, సురాధ్యక్షుడు- లోకపాలాది దేవతలకు కూడా అధ్యక్షుడు, జన్మ జరామరణాలను అతిక్రమించిన వాడు అయిన మథురాపతి చేతిలో ఖ్యాతి గడించిన జరాసంధుడు పదిహేడు పర్యాయాలు పరాజితుడు కాలేదా?’ ములుకుల వంటి కృతవర్మ పలుకులు విని నిరాశ చెందిన శతధన్వుడు ‘హతవిధీ!’ అనుకుంటూ అక్రూరుని ఆశ్రయించాడు. చక్రాయుధునితో విక్రమించడానికి తనతో ఉపక్రమించమని అర్థించాడు. అక్రూరుడు శ్రీహరి బలపరాక్రమాలను పరిపరి విధాల వివరిస్తూ ఇలా పలికాడు..
సీ॥ ‘ఎవ్వడు విశ్వంబునెల్ల సలీలుడై
పుట్టించు రక్షించుబొలియ జేయు
నెవ్వని చేష్టలు నెరుగరు బ్రహ్మాదు
లెవ్వని మాయ మోహించు భువన
మేడేండ్ల పాపడై యే విభుడొక చేత
గోరక్షణమునకై కొండనెత్తె
నెవ్వడు కూటస్థు డీశ్వరుడద్భుత
కర్ముడనంతుండు కర్మసాక్షి’
తే॥ ‘యట్టి ఘనునకు శౌరికి ననవరతము
మ్రొక్కెదము గాక విద్వేషమునకు నేము
వెఱతు మొల్లము నీవొండువెంట బొమ్ము
చాలు పదివేలు వచ్చె నీ సఖ్యమునను’
‘ఎవడు ఈ విశ్వాన్ని అవలీలగా పుట్టించి, పెంచి పోషించి, ఆపై తుంచివేస్తాడో, ఎవని కృత్యాలు- పోకడలు బ్రహ్మాది వేలుపు- దేవతలకు కూడా పాలుపోక- డెందానికి అందకుండా ఉంటాయో, ఎవని అనిర్వచనీయ మాయ ఈ లోకాలన్నిటినీ శోక మోహ పరవశం చేస్తోందో, ఎవడు ఏడేండ్ల ప్రాయంలోనే ఏక హస్తాన గోవర్ధన గిరినెత్తి అమేయ- అమితమైన సాయం అందించి గోవులను, గోపాలురను వేల్పురాయని- ఇంద్రుని వలని అపాయం నుండి కాపాడాడో, ఎవడు కూటస్థుడో (ఏ పరమాత్మ ఏ కాలంలోనూ ఏ వికారాలూ- మార్పులు లేక నిశ్చలంగా- అవినాశిగా ఉంటాడో), పరమేశ్వరుడో, అద్భుత- ఆశ్చర్యకరమైన కర్మలు కలవాడో, అనంతుడో- దేశకాల వస్తువులచే పరిచ్ఛిన్నుడు- పరిమితుడు కానివాడో, ఎవడు సర్వజీవుల కర్మలకు సాక్షియో అట్టి ఘనుడైన ఫణిరాజ శయనునికి మేము అనవరతం- ఎల్లప్పుడూ కల్ల లేక ఉల్లములో వినయంతో నమస్కరించడానికి ఆరాటపడు వారమే కాని, ఆయనతో వైరం పెట్టుకొని పోరాట పడటానికి మనస్కరించే వారం కాము. నీ దారి నీవే చూసుకో. ‘చాలు పదివేలు వచ్చె’- నీతోటి చెలిమికి ఒనగూరిన- ఒరగిన (లాభించిన) కలిమికి నమస్కారం. మాకు జరిగింది చాలు’. వ్యంగ్యం- వెటకారంతో కూడిన పటువైన (సమర్థమైన) తెనుగు నుడికారపు సొంపుతో ఇంపైన తేటగీతిలోని చివరి రెండు పాదాలు (అమూలకాలు) పోతన మహాకవి మెండైన స్వారస్యం గల పెంపుదల.