చెట్టు.. అమ్మ. పుట్ట.. అమ్మ. ప్రకృతిలో ఉన్న శక్తి.. అమ్మ. ఆ శక్తి విభిన్న కళలే.. గ్రామదేవతలుగా కొలువుదీరిన మూలపుటమ్మలు. ఆ చల్లని తల్లుల వేడుకకు వేళైంది. ఆషాఢం వచ్చింది.. భాగ్యనగరి బోనం ఎత్తుతున్నది. అమ్మవార్ల జాతరకు నగరం సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో భాగ్యనగరంలో శక్తి కేంద్రాలుగా విలసిల్లుతున్న అమ్మవార్ల చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం తెలుసుకుందాం.
తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని, ఇక్కడి ప్రజల ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని చాటి చెప్పే పండుగల్లో బోనాలు ఒకటి. ప్రకృతిని శక్తిస్వరూపిణిగా, జగన్మాతగా కొలవడం భారతీయ సంప్రదాయం. ప్రకృతి శక్తుల విభిన్న కళలే గ్రామదేవతలని దేవీ భాగవతంలో ఉంది. ప్రకృతి తల్లిలాంటిది. ఆ తల్లి ఒడిలో సేదతీరాలంటే ఆమెను పూజించాలి. అంటే ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవాలి. మానవ మనుగడకు అదే శ్రీరామరక్ష. అందుకు భిన్నంగా వ్యవహరించినప్పుడు, ప్రకృతి ప్రకోపిస్తే విపత్కర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. వాటిని అధిగమించేందుకు, మారుతున్న రుతువులు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వివిధ రూపాలు, పేర్లతో కొలువైన గ్రామదేవతలను వేడుకుంటూ జరుపుకొనే పండుగే బోనాలు. ఏటా ఆషాఢ మాసం తొలి ఆదివారం మొదలయ్యే బోనాల జాతర ఒక్కో ఆదివారం ఒక్కో ప్రాంతంలో జరుగుతుంది. ఈ సంప్రదాయం గోల్కొండ జగదంబ ఆలయం బోనాలతో ప్రారంభమవుతుంది. ‘లష్కర్ బోనాలు’గా పిలిచే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాల మీదుగా పాతబస్తీ లాల్ దర్వాజ బోనాలతో ముగుస్తుంది.
ఈ ఆలయం 900 సంవత్సరాల క్రితం నుంచీ ఉంది. అంటే గోల్కొండ కోట కట్టడానికన్నా ముందే ఈ ఆలయం ఉండేదన్నమాట. పూర్వం ఈ కొండపై గొల్లలు పశువులను మేపుకోవటానికి వచ్చేవారు. అమ్మవారిని వాళ్లే కనుగొన్నారని చెబుతారు. మరో కథనం ప్రకారం కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఈ కొండపై మట్టికోట కట్టించేటప్పుడు అక్కడే ఉన్న జగదంబ అమ్మవారిని పూజించి బోనాల పండుగ చేశాడట. ఇక ఈ ప్రాంతంలో ఎక్కువగా గొల్లవాళ్లు ఉండటం వల్ల దీనిని గొల్లకొండ అనేవారనీ, అదే క్రమంగా గోల్కొండ అయిందని చెబుతారు. అప్పటినుంచీ ఇక్కడ బోనాల ఉత్సవం నిర్వహిస్తూ ఉన్నారు. అతి పురాతనమైన ఈ ఆలయం నుంచి హైదరాబాద్ బోనాల ఉత్సవం ప్రారంభమవుతుంది. గోల్కొండ రాజుల కాలంలో అక్కన్న, మాదన్నలు కూడా ఈ ఉత్సవం జరిపినట్లు తెలుస్తున్నది.
ఈ ఆలయం నిర్మాణం వెనుక ఒక చిన్న కథ ఉంది. క్రీ.శ.1813 ప్రాంతంలో సైన్యంలో పనిచేసే సురిటి అప్పయ్య సికింద్రాబాద్‌లో ఉండేవాడు. ఆయన బదిలీపై మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ప్రాంతానికి వెళ్లాడు. ఒకసారి అక్కడ కలరా వ్యాధి తీవ్రంగా ప్రబలి, చాలామంది చనిపోసాగారు. అప్పుడు అప్పయ్య మహంకాళి ఆలయానికి వెళ్లి ఆ తల్లితో ‘కలరా తగ్గిస్తే తన సొంత ఊరిలో అమ్మవారికి ఆలయం నిర్మిస్తానని’ మొక్కుకున్నారట. కొన్నాళ్లకు కలరా తగ్గింది. రెండు సంవత్సరాల తరువాత స్వస్థలానికి వచ్చిన అప్పయ్య దారుతో అమ్మవారి విగ్రహాన్ని చేయించి ఒక వేపచెట్టు కింద ఉంచి పూజించసాగారు. తర్వాత చిన్న ఆలయం కట్టించారు. తర్వాతి కాలంలో ఆలయం విస్తీర్ణం చేపట్టగా తూర్పువైపు ఉన్న బావిలో మాణిక్యాంబ విగ్రహం దొరికిందట. ఆ విగ్రహాన్ని అమ్మవారి విగ్రహం పక్కనే ప్రతిష్ఠించాడు అప్పయ్య. 1864లో అప్పయ్య సారథ్యంలో అప్పటివరకు ఉన్న విగ్రహాల స్థానంలో ప్రస్తుతం పూజలు అందుకుంటున్న మూర్తులను ప్రతిష్ఠించారు. ఇక్కడ అమ్మవారు ఒక చేతిలో ఖడ్గంతో, మరో చేతిలో భరిణతో దర్శనమిస్తారు.
బల్కంపేట ఎల్లమ్మ వైభవం 15వ శతాబ్దం నాటి నుంచి ఉందని భక్తుల నమ్మిక. పరశురాముని తల్లి రేణుకాదేవి అవతారమే ఎల్లమ్మ తల్లిగా చెబుతారు. బాలా త్రిపురసుందరిగా కూడా ఎల్లమ్మను భావిస్తారు. మరికొందరు ఎల్లమ్మను బాలాంబికగా పిలుస్తారు. రాను రాను బాలాంబికగా తల్లికొలువైన ప్రాంతం బల్కమ్మపేటగాను, బల్కంపేటగా మారిందని తెలుస్తున్నది. ఈ ఆలయంలో ఉన్న బావిలోని నీటిని పవిత్ర తీర్థంగా స్వీకరిస్తుంటారు. పూర్వం ఇక్కడ ఒక బావి ఉందనీ, దాని మధ్యలో అమ్మవారు ఉండేవారనీ, బావి పైభాగంలోని మంటపంలో అఖండజ్యోతి నిత్యం వెలుగుతూనే ఉంటుందనీ స్థల పురాణం. బావి మధ్యలో కొలువై ఉండటంతో గతంలో దూరం నుంచే అమ్మవారిని దర్శించుకునే వారట. అయితే, నిజాం నవాబుల కాలంలో పనిచేసిన శివరాజ్ బహద్దూర్ చొరవతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లు తెలుస్తున్నది.
భాగ్యనగరిలో ఆధ్యాత్మిక శక్తి కేంద్రం లాల్‌దర్వాజ సింహవాహిని ఆలయం. 1908లో నగరాన్ని మూసీ నది వరదలతో ముంచెత్తింది. నీళ్లు చార్మినార్ మైసమ్మగుడి వరకు చుట్టుముట్టాయి. నగర ప్రజల జీవనం అతులాకుతలమైంది. అప్పుడు హైదరాబాద్ సంస్థానం ప్రధానమంత్రిగా ఉన్న మహారాజా కిషన్ ప్రసాద్ నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీ ఖాన్ దగ్గరికి వెళ్లి చార్మినార్ సమీపంలోని లాల్‌దర్వాజలో సింహవాహిని మహంకాళి అమ్మవారు ఉందనీ, ఎంతో మహత్తుగల ఆ అమ్మవారికి పూజలు నిర్వహిస్తే మూసీ నది శాంతిస్తుందని సూచించారట. దాంతో నిజాం నవాబు మహంకాళి అమ్మవారికి మేలిమి ముత్యాలను, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి పూజలు నిర్వహించారట. బంగారు చేటలో పసుపు, కుంకుమ, గాజులు, ముత్యాలను మూసీనది ప్రవాహానికి సమర్పించారట. వరద తగ్గుముఖం పట్టడంతో ఆనాటి నుంచి ఏటా లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించే సంప్రదాయం వచ్చిందని పెద్దలు చెబుతారు.
– ఎస్.ఎన్. ఉమామహేశ్వరి