‘ఈశ్వరస్యాపి అభిమాన ద్వేషిత్వాత్ దైన్య ప్రియత్వాచ్చ’ (నారద భక్తి సూత్రం)- భగవంతునికి అభిమానం- అహంకారం అంటే ద్వేషం- అయిష్టం. దైన్యం- దీన భావమంటే చాలా ఇష్టం. ‘గోవత్స అపహరణ’ లీల మొదలు ఒక్కొక్క లీలలో అధికార మదంతో ఒళ్లు తెలియక విర్రవీగిన- అహంకరించిన ఒక్కొక్క దేవతని ఆదిదేవుడు మాధవుడు కర్రు కాల్చి వాతపెట్టి- పరాభవించి కళ్లు తెరిపించాడు. ఈ పరాజయ లీలా పరంపర సురజ్యేష్ఠుడు పితామహునితో ప్రారంభం. పదంపడి- పిమ్మట గోవర్ధన లీలలో గోత్రభిదుని- ఇంద్రుడి పరాభవం. పీతవసనుని- పీతాంబరధరుని వరుణ లోక గమనం రసేంద్రియ (జిహ్వ) జయానికి సంకేతం. అకాముని, మన్మథ మన్మథుని, వాసుదేవుని రాసలీల కామవిజయ లీల!
గోపబాల, గోవత్స అంతర్ధాన లీలని వ్యాఖ్యాతృ చక్రవర్తి శ్రీధరాచార్యులు ‘సర్వము తానయైన’ వాని ‘సర్వోదయ లీల’గా శ్లాఘించారు. యదునందనుడు, తనయుడై తన తల్లి యశోదకు కలిగించిన అమంద ఆనందాన్నే మంద- బృందావనంలోని కుందరదనలు గోపికలకు, గోపకులకు, గో గోవత్స గోపబాలురందరికి అనుగ్రహించాడు. తాడు తాడుగానే ఉండి తాముగా, దామము- దండగా, జలధారగా పలువురికి పలువిధాలు ప్రతీత- ప్రకటమయింది. పరబ్రహ్మము తన స్వరూపానికి భంగం- పరిణామం లేకుండానే మాయాశక్తితో నానా నామరూప జగత్తుగా భాసిస్తోంది. ‘మత్తః పరతరం నాన్యత్ కంచి దస్తి ధనంజయ’ (గీత) (నాకంటే పరమ కారణమైనది- ఇతరమైనది ఏదీ లేదు. ఈ జగత్తులోని జడ చేతనాలన్నీ దారంలో మణులవలె నాయందే కూర్పబడి ఉన్నాయి). ఎన్ని విధాల గోచరించినా వెన్నుడు (విష్ణువు)- కన్నయ్య తప్ప అన్యమైన దేదీ లేదు.
ఇదీ ఈ లీలా పరమార్థం! భగవల్లీలా కథా శ్రవణం వినోదానికి- కాలక్షేపానికి కాదు. అజ్ఞానం అపనోదనానికి- తొలగడానికి, తత్తజ్ఞాన వికాసం కలగడానికి! ఇక తరువాతి కథలోకి… శుకుడు పరీక్షిత్తుతో- రాజా! బ్రహ్మదేవుడు మాయచేసి దాచిన దూడలను, బాలురను వృష్ణికులాంభోజ సూర్యుడు- వృష్ణి వంశమనే కమలాన్ని వికసింప జేసే సూర్యుడు, వైష్ణవ సాగర హిమకరుడు- విష్ణు భక్తులనే సాగరానికి చంద్రుడు (ఆనందింపజేసేవాడు), జిష్ణువు- జయశీలుడు అయిన కృష్ణుడు మరల కొలను వద్దకు చేరాడు. విరించి- బ్రహ్మ తమను వంచించి దాచిపెట్టిన సంవత్సర కాలాన్ని గొల్లపిల్లలు శ్రీవత్సు- కృష్ణుని మాయా ప్రభావంతో అర్ధక్షణంగా భావించారు. ఇసుక తిన్నెలపైన కూర్చొని కడు వేడుకతో చల్దులు కుడుస్తూ- ఆరగిస్తూ, నడుమంతరంగా- అర్ధాకలితో తినడం విడిచిన అన్నెం పున్నెం ఎరుగని ఆ గోపబాలురు కన్నయ్యను చూచి ఇలా అన్నారు..
మ॥ ‘చెలికాడా! అరుదెంచితే యిచటికిన్? సేమంబునం గ్రేపులున్
నెలవుల్ సేరె నరణ్య భూమి వలనన్ నీ వచ్చునందాక జ
ల్దులు వీరించుక యెవ్వరుం గుడువ, రాలోకింపు, రమ్మంచు నా
జలజాక్షుండు నగన్ భుజించి రచటన్ సంభాషలన్ డింభకుల్.
‘చెలికాడా! వచ్చావా? ఇదిగో చూడు, లేగదూడలు బాగా మేసి అరణ్యం మధ్యలో నుండి క్షేమంగా ఇప్పుడే ఇక్కడికి చేరాయి. నువ్వు తిరిగి వచ్చేవరకు మాలో ఎవడూ తినలేదు, చూడు! దొరా! రా, త్వరగా తిందాము’ అంటూ మన్నన- ఆదరంగా పిలిచారు. బాలకృష్ణుడు నవ్వుతూ వచ్చి వారి నడుమ కూర్చోగానే పెచ్చరిల్లిన సంతోషంతో బాలకులంతా ముచ్చట్లు చెప్పుకొంటూ చల్దులు తిన్నారు. ఈ వృత్తాంతం ముగింపునకు రావడానికి ఒక సంవత్సరం పట్టింది. అందుకే గొల్లపిల్లలు ఇళ్లకు వెళ్లి ‘అమ్మా! ఇవాళ్ల నల్లనయ్య పెద్ద కొండచిలువను చంపి మమ్ము కాపాడాడు’ అని ఏడాది తరువాత తల్లులతో ఉల్లాసంగా వెల్లడించారు. పిమ్మట వనం నుండి బృందావనానికి బయల్దేరిన ఆపన్న భక్తావనుడు (ఆపదలో ఉన్న భక్తుల రక్షకుడు)- నందాత్మజుని, శిఖి (నెమలి) పింఛమౌళిని, భక్తకవివిరించి పోతన పంచచామర ఛందస్సులో ఎంత అంచితం (ఘనం)గా వర్ణించాడో విందాము..
పం॥‘ప్రసూన పింఛ మాలికా ప్రభా విచిత్రితాంగుడుం
బ్రసిద్ధ శృంగ వేణునాద పాశబద్ధ లోకుడుం
బ్రసన్న గోపబాల గీత బాహువీర్యుడయ్యును
ల్లసించి యేగె గోపకుల్ సెలంగి చూడ మందకున్’
రాజా! తలమీద అలరారే అడవి పూల మాలలు, నెమలి పింఛం ధరించిన హరి- కృష్ణుడు, వాటినుండి వెలువడే పరి-పరి విధాల ప్రభలతో మెరిసిపోతున్నాడు. ప్రసిద్ధమైన కొమ్ము బూర నాదాలు, మధురమైన మురళీరవాలు అనే ప్రేమ పూరితాలైన పాశాలతో లోకాలను పరవశింప జేస్తున్నాడు. వల్లవ బాలురు మనోహరాలైన గీతాలతో తన బాహుబల పరాక్రమాలను కొనియాడుతుండగా బలానుజుడు బాలకృష్ణుడు ఉల్లాసంగా గొల్లపల్లెకు చేరాడు.
శుకముని- అవనీపతీ! రామకృష్ణులు పాగండ వయస్కులై గోపబాలురతో కలిసి పశుపాలనం చేస్తూ, విహరిస్తూ బృందావనాన్ని పావనం చేశారు. అడవిలో వేడుకగా ఆడుకోవాలని నిశ్చయించిన వెన్నుడు అన్న రామన్నతో ఇలా అన్నాడు..
శా॥ ‘శాఖాపుష్ప ఫల ప్రభార నతలై చర్చించి యో దేవ! మా
శాఖిత్వంబు హరింపుమంచు శుక భాషన్ నీకెరింగించుచున్
శాఖా హస్తములం బ్రసూన ఫలముల్ సక్కన్ సమర్పించుచున్
శాఖి శ్రేణులు నీ పదాబ్జముల కోజన్ మ్రొక్కెడిం జూచితే’
‘అన్నా! కొమ్మల నిండా నిండి ఉన్న పూలగుత్తుల, పండ్ల భారంతో వంగి- వినయంగా నీ పాదాలు పట్టుకు వందిస్తున్న ఈ వృక్షబృందాలను వీక్షించు. తమపై కొలువున్న చిలుకల పలుకుల నెపంతో.. ‘ఓ దేవా! మా ఈ పాదప(వృక్ష) జన్మలను పరిహరించి ఉత్తమ- పుణ్య జన్మను ప్రసాదించు’ అని తమ చిరకాల వాంఛను నీకు విన్నవిస్తున్నాయి. అగ్రజా! తమ కొమ్మలనే పాణు- హస్తాలతో ఫలపుష్పాలు అర్పిస్తూ ఈ పాదపశ్రేణులన్నీ నీ పాదపద్మాలకు ఎలా ఎంచక్కా మొక్కుతున్నాయో ఒకసారి చూడు’.
సీ॥‘రా పూర్ణచంద్రిక! రా గౌతమీగంగ! రమ్ము భగీరథ రాజ తనయ!
రా సుధాజలరాశి! రా మేఘబాలిక! రమ్ము చింతామణి! రమ్ము సురభి!
రా మనోహారిణి! రా సర్వమంగళ! రా భారతీదేవి! రా ధరిత్రి!
రా శ్రీమహాలక్ష్మి! రా మందమారుతి! రమ్ము మందాకిని! రా శుభాంగి!’
ఆవులు అడవిలో దూరదూరాల్లో మేస్తూ ఉంటే బాలగోపాలుడు మేఘగర్జన వంటి గంభీర కంఠస్వరంతో పేరుపేరునా ‘ఓ పూర్ణచంద్రికా! ఓ గౌతమీగంగా! ఓ భాగీరథీ! రండు, రండు! ఓ సుధాజలధీరాశీ! ఓ మేఘబాలికా! ఓ చింతామణీ! ఓ సురభీ! రండు, రండు! ఓ మనోహారిణీ! ఓ సర్వమంగళా! ఓ భారతీదేవీ! ఓ ధరిత్రీ! ఓ శ్రీమహాలక్ష్మీ! ఓ మందమారుతీ! ఓ మందాకినీ! ఓ శుభాంగీ! రమ్ము, రమ్ము!’ అని పలుకుతూ మరెన్నో పేర్లు పెట్టి ఆవులను ఆప్యాయంగా పిలిచేవాడు. ఆ ఇంపైన పిలుపు, వినసొంపైన పలకరింపుల తియ్యదనానికి బృందావనంలోని గోపబృందం ఆనందంతో మెచ్చుకొనేది… వ్యాస భాగవతంలో ఆవుల పేర్ల ఊసే- మాటే లేదు. మన పోతన వాసుదేవ కృష్ణుని చేత పలికించిన గోమాతల పవిత్ర నామాలను తన సీస పద్యమాలికలో పూసలవలె అందంగా గుదిగుచ్చాడు! శుక ఉవాచ- రాజా!
సీ॥‘వేదాంత వీధుల విహరించు విన్నాణి విహరించు గాంతార వీధులందు
ఫణిరాజ శయ్యపై బవళించు సుఖభోగి పల్లవ శయ్యల బవ్వళించు
గురుయోగి మానస గుహల గ్రుమ్మరు మేటి గ్రుమ్మరు నద్రీంద్ర గుహలలోన
గమలతోడ బెనగి కడు డయ్యు చతురు డాభీర జనుల తోడ బెనగిడయ్యు
ఆ॥ నఖిల లోకములకు నాశ్రయుండగు ధీరు
డలసి తరుల నీడ నాశ్రయించు
యాగ భాగ చయము లాహరించు మహాత్ము
డడవి లోని ఫలము లాహరించు’
‘బృహదారణ్యకాది వేదాంత- ఉపనిషత్ వీధుల్లో (మార్గాల్లో) సదా విహరించే విజ్ఞాని ఈనాడు ఇలా అరణ్య వీధుల్లో విహరిస్తున్నాడు కదా! అనాదిగా ఆదిశేషుని మృదువైన శయ్య- పానుపుపై పవళించే మహాభోగి, ఆహా! ఇప్పుడు వల్లవ (గొల్ల) బాలుడై పల్లవ (చిగురాకుల) పక్కల మీద పవ్వళిస్తున్నాడే! పరమయోగుల అంతరంగాలనే గుహలలో విహరించే యోగీశ్వరుడు ఇహలోకంలో- ఇక్కడ గొప్ప పర్వత గుహల్లో సంచరిస్తున్నాడు! కమలాలయ- శ్రీదేవితో క్రీడించి అలయు- అలసిపోవు కళా కుశలుడు ఈనాడు గొల్లపిల్లలతో ఆటలాడుతూ అలసి పోతున్నాడు! అఖిల లోకాలకు తానే ఆశ్రయమై అవిశ్రాంతం (నిర్విరామం)గా రక్షించే ధీరుడు నేడు అడవిలో బడలి విశ్రాంతికై పుడమి పుట్టువుల (చెట్ల) నీడలను ఆశ్రయిస్తున్నాడు! ధన్యులైన మునులు చేసే యాగాల హవిర్భాగాలను భుజించే పుణ్యకీర్తి ఈనాడు వన్య (అడవిలోని) ఫలాలను ఆరగిస్తున్నాడు’. సగుణ బ్రహ్మ- వాసుదేవుని భక్త సులభత్వాన్ని, భృశ్యవశ్యత్వాన్ని భాసురంగా వర్ణించిన శ్రీమంతమైన- ఈ సీస పద్యం పోతన అమాత్యుని సొంతం! (సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006