ఒక ఊర్లో ఓ వస్త్ర వ్యాపారి ఉండేవాడు. ఒకరోజు అతడు అద్దంలో తల దువ్వుకుంటూ ఉండగా తెల్ల వెంట్రుకలు కనిపించాయి. వయసు పైబడుతున్నదనే బాధ అతనిలో మొదలైంది. ఒలికిన పాలు, పగిలిన అద్దం తిరిగిరావన్న విషయం గుర్తుకొచ్చింది. ఉన్నంతలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకున్నాడు. ప్రయత్నాలు ప్రారంభించాడు. అయితే అంగడి వదిలి బయటికి రాలేని పరిస్థితి. ‘ఏం చేయాలా’ అని ఆలోచించాడు. ఊరి పెద్దలను అడిగితే పరిష్కారం దొరుకుతుందని భావించాడు. ‘ఖర్చు, శారీరక శ్రమ లేకుండా, అనుకున్నప్పుడు, కూర్చున్న చోటే, చేయగలిగే ఆరోగ్య రహస్యం ఏదైనా చెప్పమ’ని కనబడిన వారందరినీ అడిగాడు. అది సాధ్యమయ్యేపని కాదని చాలామంది తేల్చి చెప్పారు. కొందరు నవ్వి ఊరకున్నారు. మరికొందరు తిండి తగ్గించమని సలహా ఇచ్చారు. ‘తింటే కదలలేను, తినకపోతే మెదలలేను కదా నేను’ అని ఆ సలహాని అతను విననట్లే గమ్మున ఉండిపోయాడు. ఒకరోజు ఊర్లోని రాములవారి గుడి దగ్గర ప్రవచనాలు చెబుతూ ఉంటే అక్కడికి వెళ్లాడు. ఆ ప్రవచనకర్త ఉపన్యాసం అయ్యేంత వరకు అక్కడే ఉండి చిన్నగా తన బాధ చెప్పుకొన్నాడు.
ఆయన వ్యాపారి భుజం తట్టి ‘నీకోసం నువ్వు రోజూ ఓ గంటసేపు వెచ్చించగలవా?’ అని అడిగాడు. కచ్చితంగా చేస్తానని బదులిచ్చాడు వ్యాపారి. ప్రవచనకర్త పక్కనే ఉన్న పూల తోటలోకి వ్యాపారిని తీసుకెళ్లి సులభమైన నాలుగు ముద్రలు నేర్పాడు. ‘అంగడిలో ఉన్నప్పుడు ఖాళీ సమయాల్లో ముద్రలో ఉండు. చేతిలోని ఒక్కో వేలు పంచభూతాలలో ఒక్కో దానిని సూచిస్తుంది. వాటిని కలపడం ద్వారా శరీరంలోని మూలకాలు సమతుల్యం అవుతాయి. అలాగే ఉదయం అర గంట, సాయంత్రం అర గంట ప్రశాంత వాతావరణంలో కూర్చుని ఓం కారం పలుకు. ఇలా చేయడం ద్వారా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం మెరుగుపడుతుంది’ అని వివరించాడు. ‘ఇన్నాళ్లూ ఇలాంటివి తెలియక, చేయక చాలా నష్టపోయాను కదా! మన భారత సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవి. సూక్ష్మంలో మోక్షంగా మనకు ఎన్నో మంచి విషయాలు తెలియజేశాయి’ అని తలుస్తూ అక్కడినుంచి కదిలాడు.