ఏడాదిపాటు దైవదూతలు ముస్తాబు చేసే స్వర్గం ఎంత మనోహరంగా, మరెంత ఆహ్లాదంగా ఉంటుందో ఊహించలేం. మరి అలాంటి ద్వారాలు తెరుచుకుంటే ఈ లోకమంతా స్వర్గధామం అవ్వదా. రంజాన్ నెలవంక నీలాకాశంలో తళుక్కున మెరవగానే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని ముస్లింల నమ్మకం. ముహమ్మద్ ప్రవక్త (స) నెలవంకను చూసి ‘అల్లాహుమ్మ అహిల్లహు అలైనా బిల్ అమ్ని వల్ ఈమాని వస్సలామతి వల్ ఇస్లామి రబ్బీ వ రబ్బుకల్లాహు, హిలాలు రుష్ దిన్ వ ఖైరిన్’ (ఓ అల్లాహ్ ఈ నెలవంకను మాకోసం సురక్షితమైనదిగా, విశ్వాసంతో కూడుకున్నదిగా, ప్రశాంతమైనదిగా చేయి. ఓ చంద్రుడా.. నా ప్రభువూ, నీ ప్రభువూ అల్లాహ్‌యే) అని పేర్కొన్నారు. నెలవంకను చూసి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకొని మనసుల్లో ఉన్న స్పర్ధల్ని దూరం చేసుకుంటారు.
కల్మషాలన్నిటినీ కడిగేసి మంచి మనసుతో రంజాన్ నెలను స్వాగతిస్తారు. 30 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు పాటిస్తారు. ఈ నెలలో ఒక్క పుణ్యకార్యం చేస్తే 70 రెట్ల ఫలాన్ని ప్రభువు ఇస్తాడన్న నమ్మకంతో మంచి పనుల్లో పోటీ వాతావరణం ఉంటుంది. ఈ నెల రోజులు కఠోర ఉపవాసం పాటించడంతోపాటు అన్ని రకాల చెడులను త్యజించాలి. మన కన్ను, నోరు, నాలుక, కాళ్లు, చేతులు, మన హృదయం సర్వేంద్రియాలు ఉపవాసం ఆచరించాలి. అలాంటి ఉపవాసమే అల్లాహ్ స్వీకృతి పొందుతుందని ముహమ్మద్ ప్రవక్త (స) చెప్పిన బోధనను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ నెలలో మసీదులన్నీ నమాజీలతో కళకళలాడుతాయి. జకాత్ దానాలు ఊపందుకుంటాయి. సంపన్నులు తమ సంపదలో రెండున్నర శాతం పేదలకు దానం చేస్తారు. మొత్తంగా వరాలనిచ్చే పవిత్ర మాసంలో.. ప్రభువు కృపను పొందడానికి శాయశక్తులా ప్రయత్నం చేద్దాం!
అల్లాహ్‌తో ప్రత్యక్షంగా మాట్లాడిన ప్రవక్తలలో మూసా ఒకరు. ఆయన ఒకానొకసారి ‘ఓ అల్లాహ్! నేను మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నాను. మీతో నేరుగా మాట్లాడుతున్నాను. మీకు నాలాంటి సన్నిహితులు మరెవరైనా ఉన్నారా?’ అని అడిగారు. అప్పుడు అల్లాహ్.. ‘మూసా! ఈ సృష్టి చివరికాలంలో ఉమ్మెతె ముహమ్మదియాకు ఒక రంజాన్ నెల ప్రసాదిస్తాను. ఆ నెల రోజుల్లో నా దాసులు తడారిపోయినా పెదాలతో, ఆకలి కడుపులతో, పిడచకట్టుకుపోయిన నాలుకతో, పీక్కుపోయిన కళ్లతో ఇఫ్తార్ చేయడానికి కూర్చుంటారు. ఆ సమయంలో నేను వాళ్లకు అత్యంత సమీపంగా ఉంటాను. మూసా! నీకూ, నాకూ 70 పరదాల దూరం ఉంది. కానీ ఇఫ్తార్ వేళలో రోజేదార్లకూ, నాకూ ఒక్క పరదా కూడా అడ్డుగా ఉండదు. ఆ వేళలో ఎవరైనా నన్ను వేడుకుంటే నేను వారి దువాలను స్వీకరించడం నా బాధ్యత’ అని తెలిపాడు.
…? ముహమ్మద్ ముజాహిద్, 9640622076