వికాస పాఠం.. సీతాన్వేషణ ఘట్టం!
రామాయణ, మహాభారతాలు హృదయంతో అధ్యయనం చేయవలసిన గ్రంథాలు. అక్షరాలతో వాటిని సాధించలేం! వాటిని ఆరాధించాలి, ఉపాసించాలి అప్పుడే వాటిలోని అంతర్లీనమైన సత్యాను భూతిని జీవితానికి అన్వయించుకోగలుగుతాం. రామాయణంలోని సుందరకాండలో ఉన్న సీతాన్వేషణ ఘట్టం అలాంటిదే!
రామాయణ, మహాభారతాలు హృదయంతో అధ్యయనం చేయవలసిన గ్రంథాలు. అక్షరాలతో వాటిని సాధించలేం! వాటిని ఆరాధించాలి, ఉపాసించాలి అప్పుడే వాటిలోని అంతర్లీనమైన సత్యాను భూతిని జీవితానికి అన్వయించుకోగలుగుతాం. రామాయణంలోని సుందరకాండలో ఉన్న సీతాన్వేషణ ఘట్టం అలాంటిదే! పైకి హనుమ అమ్మవారి కోసం లంకంతా గాలించడం, చివరికి ఆమెను దర్శించడం, రావణుడు సీతమ్మను మాయమాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేయడం.. ఇవే కనిపిస్తాయి. అంతర్ నేత్రంతో దర్శిస్తే.. ఆయా పాత్రలు, అవి పలికే మాటలు వ్యక్తిత్వ వికాసానికి పాఠాలుగా వినిపిస్తాయి.
రామాయణంలో హనుమ ఒక వానరం. సహజంగా వానరం చంచలమైన మనసుకు ప్రతీక. ఆ మనసు నిశ్చలం కావాలంటే నిరంతర సాధన అవసరం. చంచలమైన వానరమూ సాధన చేసి పరమాత్మను చేరుకున్నది. ‘నేను అసమర్థుణ్ని’ అని భావిస్తూ నిరామయంగా కూర్చొనే కన్నా ‘నా పరిమితులలో ప్రయత్నించి వచ్చే ఫలితం ఎలాంటిదైనా స్వీకరిస్తాన’నే సంకల్పంతో ప్రయత్నిస్తే భౌతిక, ఆధ్యాత్మిక జీవితాలలో విజయం సాధించవచ్చనే సత్యాన్ని హనుమ ద్వారా రామాయణం మనకు బోధిస్తున్నది.
సీతాన్వేషణలో ఎన్నో అవరోధాలను అతిక్రమించి హనుమ లంకను చేరాడు. లంకాపురిలో అణువణువూ వెదికాడు. సీతమ్మ కనిపించలేదు. తన ప్రయత్నం వృథా అవుతున్నదని బాధపడ్డాడు. అయితే మనసులో ఏర్పడే ఖేదం మనకు ఎదురైన సమస్యలను ఎన్నటికీ పరిష్కరించలేదు. సరైన అలోచనలు, నిరంతర ప్రయత్నం మాత్రమే సమస్యలను పరిష్కరిస్తాయి. బుద్ధితో పనిచేయడం కాదు, హృదయంతో పనిచేయాలి! అప్పుడే కార్యసాధన సాధ్యమవుతుంది. హృదయంలో మాలిన్యాలు తొలగినప్పుడే నాణ్యత వెలుగుచూస్తుంది. నైతికత గలిగిన వ్యక్తి మాత్రమే దేనిని ఆకర్షించాలో దానిని ఆకర్షించగలుగుతాడు. ఆయస్కాంతం తాను ఆకర్షిస్తానని ఇనుమును రమ్మని కోరదు. దాని ఉనికే ఇనుమును ఆకర్షిస్తుంది. ఎంతకూ సీతమ్మ జాడ కనుగొనలేక కాసేపు నిస్తేజంలో కూరుకుపోయిన హనుమ.. కొంతసేపటికి ఆత్మపరిశీలన చేసుకున్నాడు. తన అన్వేషణలో ఎక్కడో లోపం కనిపించింది. వ్యగ్రమైన మనసును నిర్మలం చేసుకున్నాడు.. మనసులోని శోకం అస్తమించింది. తిరిగి ఉత్సాహంతో ప్రయత్నించాడు. ‘అశోకవనం’లో అమ్మవారి దర్శనమైంది.
అశోకవనంలో ఉన్న సీతాదేవిని చూస్తున్నాడు హనుమ. మాసిన వస్ర్తాలు, ధూళిధూసరిత శరీరంతో ఉన్నా, సీతాదేవిలోని అంతఃసౌందర్యాన్ని దర్శించాడు. ఆమెను చూశాక, రాముడు ఇన్నాళ్లుగా ఆమె కోసం ఎందుకని తపిస్తున్నాడో వాయునందనుడికి అవగతమైంది. కిష్కింధలో శ్రీరాముణ్ని చూశాడు.. ఇక్కడ సీతాదేవిని చూశాడు. శీలం, వయసు, నడవడిక, పుట్టుక ఈ నాలుగు లక్షణాలలో సీతారాములు తుల్యులు అనుకున్నాడు. తుల్యులు అంటే సమానమైన వారని కాదు. తుల్యులు అంటే ఒకరికి ఒకరు తగినవారని భావం. ఇరువురికీ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను చూశాక.. సముద్రానికి అలలపై ప్రేమ ఎక్కువా, అలలకు సముద్రంపై ప్రేమ ఎక్కువా అనుకున్నాడట. నిజానికి ఈ రెండూ నీటి వికార రూపాలే! సముద్రం లేకుండా అలలు లేవు.. కడలిలో అలలు లేనట్లుగా కాసేపు భ్రమ కలుగుతుందేమో కాని, కెరటాల్లేని సముద్రాన్ని ఊహించలేం. మరి ఇరువురికి కలిగిన ఎడబాటుకు కారణం? ‘కాలోహి దురతిక్రమః’ కాలప్రభావాన్ని ఎవరూ దాటలేరు.

హనుమ ఇలా ఆలోచిస్తున్నంతలో రావణుడు అశోకవనానికి వచ్చాడు. సీతమ్మవారి సమీపంలో నిలబడి పలువిధాలుగా ఆమెను భయపెట్టాడు. ‘తపస్సు, బలం, విక్రమం, ధనం, తేజస్సు, యశస్సులో ఎందులోనూ రాముడు నాతో సమానుడు కాడు! కాబట్టి, రాముడి కన్నా ఉన్నతుడనైన నన్ను చేపట్టు మహేంద్రభోగాలను అనుభవించు’ అని ప్రలోభపెట్టాడు. నిరంతర ధ్యాసతో లక్ష్యానికై తపించడమే ‘తపస్సు’. సత్వం, సైన్యం, సామర్థ్యం కలిగి ఉండటమే ‘బలం’. మిక్కిలిశక్తిని పొంది ఉండటమే ‘విక్రమం’, సంతోషాన్నీ, ప్రీతినీ, సంతృప్తినీ ఇచ్చేది ‘ధనం’. జ్ఞానాచరణలో కలిగే ఉత్సాహమే ‘తేజస్సు’. దిక్కులన్నిటా వ్యాప్తి చెందేది ‘యశస్సు’. ఈ ఆరింటిలో రాముడు తనకు సాటిరాడని చెబుతాడు రావణుడు. నిజానికి జ్ఞానం లేని తపస్సు, వైరాగ్యంలేని బలమూ రెండూ రాక్షస లక్షణాలే! అటువంటి రావణుడిని చులకనగా చూస్తుంది.. సీతాదేవి. ఈ రెండూ ఉంటే మానవుడే మాధవునిగా పరివర్తన చెందుతాడు.
రావణుడి ప్రేలాపనలు విన్న సీతాదేవి.. ‘రావణా! నీవన్నది నిజమే. నీవేనాడూ రాముడికి సాటిరావు. ఇప్పటికైనా నీ దురాలోచనలు మాని నన్ను రాముడికి అప్పగించి శరణు వేడు. ‘స్వజనే క్రియతాం మనః’- ఒకసారి నీ స్వజనుల వైపు నీ మనసును తిప్పు. నీ ప్రజల బాగోగుల గురించి ఆలోచించు (నిజానికి స్వజనం అంటే నీ ప్రజలనే కాక ఇంద్రియ వృత్తులు అనే అర్థమూ ఉన్నది). నీ ఇంద్రియవ్యామోహాన్ని దూరం చేసుకో. మనసును నియంత్రించుకో’ అని హితువు పలుకుతుంది సీతమ్మ. నిజానికి మనః (మనసును) తిప్పితే నమః అవుతుంది. భగవంతుడికి నమస్కరిస్తే బతుకుతావు
అని పరోక్షంగా హెచ్చరించింది అమ్మవారు. కానీ, రావణుడు ఆమె మాటలను పెడచెవిన పెట్టి లంకకు చేటు చేసుకున్నాడు.
తాత్వికంగా విశ్లేషిస్తే.. రావణుడికి ఈ విషయాలు తెలియవా? రాముడు లంకకు రావాలి, తను ఆయన సన్నిధిని చేరాలి. ఇదీ రావణుడిలోని జీవుడి వేదన. సీత తనకు వశమైతే.. తాను ప్రకృతిని జయించిన వాడవుతాడు. ఆమె వశం కాకపోతే ఆమెను రాముడే రక్షించుకుంటాడు. తాను ప్రకృతిని జయించలేకపోతే పరమాత్మను చేరుకుంటాడు. దానికి కారణం సీత అవుతుంది. అందుకే అహంకార ప్రవృత్తి కలిగిన రావణుడు సీతలో ఆర్తిని సృష్టించే ప్రయత్నం చేశాడు. ఇవన్నీ చూస్తున్న హనుమ హృదయంలో తాత్త్వికమైన ఆలోచనలెన్నో మెదిలాయి. హనుమను ఆచార్యుడిగా భావించేవారికి ఆయన ఒక పక్షిలాగా కనిపిస్తాడట. ఆ పక్షికి ఉన్న రెండు రెక్కలలో ఒకటి జ్ఞానమైతే, రెండోది కర్మ. జ్ఞానాన్ని ఆదరించాలి, ఆర్జించాలి. కర్మను ఆచరించాలి. అప్పుడే అది మోక్షమార్గంలో ఎగిరిపోనిస్తుంది.
వ్యక్తుల ఉనికికి అవసరమైన గుణగణాలు, నడతల కూర్పును తాత్త్వికత అనుకుంటే.. సాధారణ వ్యక్తులను అసాధారణ వ్యక్తులుగా తీర్చిదిద్దడం, మహోన్నత లక్ష్యాలు, ఆదర్శాల వైపు నడిపించేది ఆ తాత్తికతే! కార్యసాధనలో విజయాన్ని సాధించాలి అంటే ఒక లక్ష్యం, దానికొక కార్యాచరణ ప్రణాళిక అవసరం. అనంతానికి మూలం అనంతమే! అలాగే పరిపూర్ణ వాస్తవికతకు మూలమూ పరిపూర్ణతే. ఈ తాత్త్వికతను దర్శించిన మహర్షులు పురాణాల ద్వారా ఆ విజ్ఞానాన్ని సాధారణ ప్రజలకూ అందించారు. పురాణేతిహాసాలను, అందులోని పాత్రలనూ ఆ యదార్థ జ్ఞాన ప్రచారానికి వాహికలుగా వాడుకున్నారు.
…? పాలకుర్తి రామమూర్తి
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

