Raksha Bandhan 2023 | సారపాక : అమ్మలోని ప్రేమను.. నాన్నలోని బాధ్యతను స్వీకరించే సోదరుడికి సోదరి కట్టే కంకణమే రక్షాబంధన్. ప్రతి శ్రావణ పౌర్ణమి రోజున తోడబుట్టిన అన్నాతమ్ముళ్లతో తమ పేగుబంధం కలకాలం నిలవాలని అక్కాచెల్లెళ్లంతా కోరుకుంటారు. ఈ సందర్భంగా సోదరుల నోరు తీపి చేసి సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనసారా ఆకాంక్షిస్తారు. ఇలా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల నడుమ అనురాగ బంధానికి రాఖీపండుగ వారధిలా నిలుస్తోంది.
రాఖీ పౌర్ణమి చరిత్ర…
రక్షాబంధన్‌పై పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ప్రధానంగా సోదరుల క్షేమాన్ని కాంక్షించి అక్కాచెల్లెళ్లు మహావిష్ణువును ధ్యానిస్తూ సోదరుల చేతికి రక్ష కట్టే సందర్భంగా చెబుతారు. అందుకే ఈ పండుగను రక్షాబంధనం అంటారు. దీన్ని శ్రావణ పౌర్ణమి రోజున తోడబుట్టిన వాళ్లు తన సోదరులకు రాఖీ కట్టి తమ పేగుబంధాన్ని చాటుకుంటారు. బలి చక్రవర్తితో జరిగిన యుద్ధంలో ఓడిపోయిన ఇంద్రుడు తన సర్వాధిపత్యాన్ని కోల్పోతాడు. పూర్వవైభవం కోసం విష్ణువు దగ్గరకు వెళ్లి మొరపెట్టుకునేందుకు సిద్ధమవుతాడు. ఆ తరుణంలో భరత విజయాన్ని కాంక్షిస్తూ ఇంద్రుడి భార్య శచీదేవి ఆదిపరాశక్తిని స్మరిస్తూ కంకణం కడుతుంది. ఇది తొలి రాఖీ అని పురాణాల్లో చెబుతుంటారు.
నిజానికి రక్షాబంధన్ ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వలస వచ్చిన పండుగ. అప్పట్లో రాజపుత్రులు ఎక్కువగా ఈ వేడుక జరుపుకునేవారని చెబుతారు. రాజపుత్ర రాజైన పురుషోత్తముడు అలెగ్జాండర్‌తో జరిగిన యుద్ధంలో ఓడిపోవడానికి ఈ రక్షాబంధనమే కారణమంటారు. అలెగ్జాండర్ భార్య రొక్సానా పురుషోత్తముడికి రాఖీ కట్టి తనకు పతిభిక్ష పెట్టమని వేడుకున్నందునే కావాలని ఓడిపోయాడనేది కొందరి కథనం. యేనాబద్దో బలిరాజా.. దానవేంద్రో మహాబలం.. తేనేత్వ మబిబద్నామి రక్షే మాచల.. అంటే ఓ రక్షాబంధమా.. మహా బలవంతుడు రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించినావు కాబట్టే నేను నిన్ను ధరిస్తున్నాను అని పురాణ కవుల నుంచి వినిపిస్తోంది. మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతడితో పాటు పాతాళంలో ఉండిపోతాడు. మహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకొనిపోతుంది. అందుకే రక్షాబంధనానికి ఇంతటి ప్రాధాన్యం ఏర్పడింది. ధర్మరాజు రక్షాబంధనం గురించి అడగ్గా శ్రీకృష్ణుడు ఈ గాథను వివరించినట్లు పురాణాల్లో ఉంది.
విశ్వజనీన స్ఫూర్తి..
రాఖీబంధం కేవలం సోదర, సోదరీమణుల మధ్యే కాకుండా మానవీయతతో కూడిన కరుణాంతరంగ వేడుకగా జరుపుకోవాలి. ఇదే విషయాన్ని విశ్వకవి రవీంద్రనాథ్ఠాగూర్ పిలుపునిచ్చారు. మన దేశంలోని హిందువులు, ముస్లింల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవడానికి రక్షాబంధన్ ఉత్సవాన్ని వేడుకగా చేసుకోవడంతో ఇది అంతర్జాతీయంగా గుర్తింపులోకి వచ్చింది.
యజ్ఞోపవీతం…
శ్రావణ పౌర్ణమినే జంధ్యాల పౌర్ణమిగా జరుపుకుంటారు. ఈ రోజు యజ్ఞోపధారణ చేసుకుంటారు. బ్రాహ్మణ, వైశ్య, పద్మశాలి, విశ్వబ్రాహ్మణులు తదితర సామాజిక వర్గాలు యజ్ఞోపవీతాలు మార్చుకుంటారు. పాతవాటి స్థానాల్లో కొత్త వాటిని ధరిస్తారు. పద్మశాలీలు ఉదయమే జంధ్యాలు మార్చుకుని సాయంత్రం మార్కండేయస్వామికి పూజలు చేసి కొన్ని ప్రాంతాల్లో రథోత్సవాన్ని నిర్వహిస్తారు.
వెలకట్టలేని మధురానుబంధం రాఖీ
రాఖీ అంటేనే రక్షణ. వెలకట్టలేని బంధాలను, వదులుకోలేని అనుబంధాలను గుర్తుచేసే మధునానుబంధమే రాఖీ పండుగ. మాది విజయనగరం. ఇద్దరు అన్నలు అక్కడే ఉంటారు. అత్తగారు ఊరు ఖమ్మం. ఉద్యోగ రీత్యా ఇక్కడే స్థిరపడ్డాం. రాఖీ వస్తుందంటే ఒకవైపు ఆనందం.. మరోవైపు బాధ. అక్కడ ఉన్నప్పుడు ఉదయాన్నే అన్నయ్యలకు రాఖీలు కట్టి వారి ఆశీస్సులు తీసుకునేదాన్ని. సెలవులు లేని కారణంగా ఇప్పుడు ప్రేమను గుండెల్లో దాచుకొని రాఖీలను పోస్టుల్లో పంపుతున్నాను. వారం ముందుగానే పంపిస్తాను. ఆ రోజున వీడియోకాల్ చేసి ఫోన్లోనే పలకరించుకుంటాం. – పి.రాజ్యలక్ష్మి, లెక్చరర్, శాంతినగర్ కళాశాల, ఖమ్మం
నా తమ్ముడు అంటే ప్రాణం
రాఖీ పండుగ ఆగస్టులో వస్తుంది. ఎప్పుడెప్పుడు రాఖీ వస్తుందోనని వేయి కళ్లతో ఎదురుచూస్తాను. నాకు ఉన్న ఒకేఒక్క తమ్ముడు శివకుమార్. మా సొంతూరు కరీంనగర్. ప్రతి సంవత్సరం రాఖీకి రెండ్రోజులు ముందుగానే కరీంనగర్‌కు వెళ్లి తమ్ముడికి రాఖీ కట్టిరావాల్సిందే. ప్రస్తుతం ఇప్పుడు కరీంనగర్‌లోనే ఉన్నాను. మా అమ్మ కరోనా సమయంలో చనిపోయింది. అప్పటి నుంచి అమ్మనైనా, అక్కనైనా నీనే. రాఖీ పండుగ అంటే నాకు ప్రాణంతో సమానం. తోడపుట్టిన వారిని కలుసుకునే ఏకైక పండుగ రాఖీ.
– కన్నం వైష్ణవి, కార్పొరేటర్, ఖమ్మం
ప్రతి ఏడాది రాఖీలు కడతాను
ప్రతి ఏడాది నేను అస్సలు మిస్‌కాకుండా రాఖీలు కడతాను. నాకు ఇద్దరు సోదరులు. వారు పాల్వంచలో ఉంటారు. ప్రతి ఏడాది పుట్టింటికి వెళ్లి రాఖీలు కడతాను. ఏ పండగకు పుట్టింటికి వెళ్లినా రాని సంతోషం రాఖీ పండుగ నాడు కలుగుతుంది. ఆత్మీయ, అనుబంధానికి ప్రతీకగా ఈ పండుగ నిలుస్తోంది. నా సోదరులు సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడిని వేడుకొని రాఖీలు కడతాను.
-కొత్తూరు కల్పన, రామవరం
చిన్నప్పటి నుంచి రాఖీలు కడుతున్నాను..
రాఖీ పండుగ అంటే ఏమీ తెలియని వయస్సు నుంచి నేను నా తమ్ముడికి రాఖీ కడుతున్నాను. రాఖీ ప్రాముఖ్యత గురించి తెలిసిన తర్వాత ఈ పండుగ అంటే ఎక్కడలేని సంతోషంగా ఉంటుంది. రక్షాబంధన్‌ను మా కుటుంబమంతా సంతోషంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే రాఖీ పండుగ అంటే మాకు మంచి కానుకలు వస్తాయి కదా.. ఇప్పటికే రాఖీ పండుగకు సంబంధించిన షాపింగ్ అంతా పూర్తి చేసుకున్నాను.
– అంతర్పుల ప్రియాంక, రైటర్‌బస్తీ