Teppotsavams | తిరుచానూరు పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో మూడోరోజైన బుధవారం అమ్మవారు తెప్పపై విహరించి భక్తులను కటాక్షించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నీరాడ మండపంలో పద్మావతి అమ్మవారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6.30 గంటల నుంచి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో అమ్మవారు మూడు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం పద్మావతి అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో గోవింద రాజన్ సూపరింటెండెంట్ శేషగిరి, ఆలయ అర్చకులు బాబు స్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సుభాష్కర్, గణేశ్ పాల్గొనగా.. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.