ఒకసారి ఓ తోడేలు వచ్చి అక్కడే ఆడుకుంటున్న ఓ పసివాణ్ని ఎత్తుకుపోయింది. ‘అయ్యో! నా బిడ్డను తోడేలు ఎత్తుకు పోయింది’ అని ఓ స్త్రీ ఆర్తనాదాలు చేసింది. ఆ మాటలు విని అక్కడే ఉన్న మరో మహిళ ‘కాదు వాడు నా బిడ్డ’ అని అన్నది. ఇంతలో ఎవరో తోడేలును తరిమి బిడ్డను ఇద్దరు స్త్రీలలో పెద్దావిడకు అప్పగించారు. ఆ క్షణం నుంచి ‘వీడు నా బిడ్డ.. అంటే, కాదు నా బిడ్డ..’ అని ఇద్దరి మధ్య వాదులాట మొదలైంది. చివరికి తల్లులిద్దరూ మహనీయ దావూద్ (అ) దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేశారు. పెద్దావిడ ఒడిలో ఉన్న పిల్లాడిని ఆమెకే ఇప్పించారు దావూద్ (అ). రెండో మహిళ లబోదిబోమంటూ హజ్రత్ సులైమాన్ (అ)ను ఆశ్రయించింది. జరిగిందంతా చెప్పి విలపించింది.
అంతా విన్న ఆయన ‘కత్తిని తీసుకొచ్చి ఈ పిల్లాడిని రెండు ముక్కలుగా నరికి, చెరి సగం పంచండి’ అని అన్నాడు. ఆ మాట వినగానే రెండో మహిళ ‘దేవుడు మీపై దయజూపుగాక! ఆ పని మాత్రం చేయకండి. ఈ పిల్లవాడు ఆమె (పెద్దావిడ) కొడుకే’ అని విలపిస్తూ చెప్పింది. పెద్దావిడ మాత్రం కనికరం లేకుండా నరికినా ఫర్వాలేదు అన్నట్టుగా చూసింది. కన్నతల్లి కావడంతోనే చిన్నావిడ బిడ్డ తన దగ్గర లేకున్నా ఫర్వాలేదు, ప్రాణాలతో ఉంటే చాలు అనుకున్నది. తల్లి హృదయం కనిపెట్టిన హజ్రత్ సులైమాన్ (అ) ఆ పిల్లవాణ్ని చిన్నావిడకు ఇప్పించాడు.
…? ముహమ్మద్ ముజాహిద్