Ganesh Chaturthi 2023 | భారతీయ ధార్మిక చింతనలో దేవతలకు వాహనాలు ఉండటం ప్రధానమైన అంశం. శివుడికి నంది, విష్ణువుకు గరుత్మంతుడు, దుర్గాదేవికి సింహం లేదా పులి… ఇలా ఆయా దేవతలకు వారికే ప్రత్యేకమైన వాహనాలు అనుబంధంగా ఉంటాయి. ఆలయాల్లో కూడా దేవతలకు ఎదురుగా వారివారి వాహనాలను కొలువుదీరుస్తారు. ఈ క్రమంలో వినాయకుడి వాహనంగా ఎలుక ప్రధానంగా కనిపిస్తుంది. ఇది కాకుండా ఇతర వాహనాలు కూడా ఆయనకు అనుసంధానమై ఉన్నాయి.
వినాయకుడి జననం తర్వాత దేవతలు ఆయనకు కమండలం, రత్నఖచిత సింహాసనం, ముత్యాల హారం, ఛత్రం, వజ్రపుటుంగరం లాంటి ఎన్నో విలువైన బహుమతులను ఇచ్చారట. అప్పుడు భూమాత తనవంతుగా ఎలుకను గణపయ్యకు కానుకగా ఇచ్చిందని బ్రహ్మవైవర్త పురాణం నుంచి తెలుస్తున్నది. అలా గణపతి మూషిక వాహనుడు అయ్యాడు. కొన్ని ఆధారాల ప్రకారం వినాయకుడు వ్యవసాయానికి సంబంధించిన దేవుడు. ఇక ఎలుకనేమో రైతు పండించిన, ఇంటికి చేర్చిన ధాన్యాన్ని తస్కరించేది. సంస్కృతంలో మూషిక అనే పదానికి దొంగ అనే అర్థం కూడా ఉంది. గణపతికి వాహనంగా ఎలుక ఉండటం వెనుక ఆయన పంటలను సంరక్షిస్తాడనే ఉద్దేశం ఇమిడి ఉంది. నిజానికి ఏనుగు కూడా పంటలకు శత్రువే. కానీ, ఏనుగు రూపంలో ఉండే వినాయకుడిని మాత్రం అలా భావించకూడదు. ఆయన రూపంలో పెద్దపొట్ట ధాన్యం గాదెకు, తొండం వరి, గోధుమ, మక్కజొన్న మొదలైన పంటల వెన్నుకు, ఏకదంతం నాగటికర్రుకు, చెవులు తూర్పారబట్టే చేటలకు సంకేతాలుగా భావిస్తారు. మనది వ్యవసాయ సమాజం కాబట్టి వినాయకుడిని పంటల దేవుడిగానే పరిగణించాలి. ఇంకా విశాలమైన అర్థంలో తీసుకుంటే… ఎలుక మన నిత్యజీవితంలో ఎదురయ్యే ఆటంకాలకు సంకేతం. మూషిక వాహనుడిగా వినాయకుడు మన సమస్యలను పరిష్కరిస్తాడని దీని అంతరార్థం. కాగా, ఎలుక తన సంతతిని వేగంగా వృద్ధి చెందిస్తుంది. అంతేకాకుండా సంతాన సంకేతాలైన గరిక, సర్పం కూడా గణనాయకుడికి అనుసంధానమై ఉంటాయి. వీటినుంచి గణపతిని సంతాన ప్రదాతగా కూడా కొలుస్తారని అనుకోవచ్చు.
దక్షిణ భారతదేశంలో మరో కథ ప్రచారంలో ఉంది. పూర్వం గజముఖాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడట. దేవతలు, మనుషుల చేతిలో చావకుండా అతనికి వరం ఉండేది. అతణ్ని ఎదిరించడం గజముఖుడైన గణపతికి మాత్రమే సాధ్యం. ఇద్దరి మధ్య జరిగిన పోరులో గజముఖాసురుడు గజాననుడి కుడి దంతాన్ని విరిచేశాడట. దాంతో ఉగ్రుడైన వినాయకుడు గజముఖాసురుడి చేతిలోంచి తన దంతాన్ని తీసుకుని అతని మీదికి విసిరాడట. దాన్నుంచి తప్పించుకునేందుకు గజముఖాసురుడు ఎలుకగా మారాడట. అతణ్ని వినాయకుడు లోబరుచుకుని, తన వాహనంగా చేసుకున్నాడట. ఇంకో కథ ప్రకారం ద్వాపర యుగంలో క్రౌంచుడనే గంధర్వుడే శాపవశాత్తూ ఎలుకగా మారి గణపయ్య వాహనంగా అవతరించాడని అంటారు.
ఇక గణపతికి సంబంధించిన ప్రాచీన శిల్పాలు క్రీస్తు శకం 5వ శతాబ్దికి చెందినవి కనిపిస్తున్నాయి. వీటిలో తొలుత సింహాన్ని వినాయకుడి వాహనంగా చూపించారు. క్రీస్తు శకం 10వ శతాబ్దం నుంచే ఎలుకను గణపతి వాహనంగా మలచారు. ఈ రెండు మాత్రమే కాకుండా నెమలి, ఆదిశేషుడు, గుర్రం కూడా గణపతికి వాహనాలుగా కనిపిస్తాయి. అయితే, లంబోదరుడు మూషిక వాహనుడిగానే ప్రసిద్ధుడు.