ధన దారేషు వృద్ధేషు దుఃఖం యుక్తం న తుష్టతా
వృద్ధాయాం మోహమాయాయాం కః సమాశ్వాసవానిహ
(మహోపనిషత్తు 5-168)
‘ధన దారాదులు వృద్ధి చెందితే దుఃఖించాలి కాని, సంతృప్తి చెందరాదు. మోహమాయ పెరిగితే ప్రపంచంలో ఎవనికి శాంతి కలుగుతుంది?’ అని పై ఉపనిషత్ వాక్య భావం. ధనదారాదులంటే డబ్బు, భార్యా పిల్లలు మొదలైనవి. ఇవి పెరిగే కొద్దీ సమస్యలే తప్ప మనశ్శాంతి లభించదు కదా! ధనం పట్ల ఏ రకమైన యావ లేని మహానుభావుని జీవిత వృత్తాంతం ఒకటి ఈ సందర్భంగా తెలుసుకుందాం. తంజావూరు దగ్గర ‘తిరువయ్యూరు గ్రామంలో ఒక భిక్షుకుడు చిరుతలు వాయిస్తూ పాడుతున్నాడు. చేతిలో తంబురా.. వీపున పాత్ర ఉన్నవి. గృహస్తులు భిక్ష వేస్తున్నారు. ఈ లోపల ఆ పాత్రలో ఒక బ్రాహ్మణుడు బియ్యం వేశాడు. భిక్షుకుడు వెంటనే వణికిపోయాడు. ఎందుకంటే బియ్యంతోపాటు అందులో బంగారు నాణేలు ఉన్నాయి. అది చూసి వెంటనే బియ్యాన్ని నడివీధిలో పారబోశాడు. నాణేలతో బియ్యం మైలపడ్డా యనుకున్నాడేమో! అని బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు.
ఆ భిక్షుక గాయకునికి బంగారం అంటే వైరాగ్యం. తంజావూరు పాలకుడు శరభోజి మహారాజు అతనికి ఎలాగైనా ధనం సమర్పించాలని వ్యర్థ ప్రయత్నాలు చాలా చేశాడు. చివరకు బియ్యంలో నాణేలు నింపి భిక్ష వెయ్యమని బ్రాహ్మణుడిని నియోగించాడు. అదీ ఇలా విఫలం అయింది. అంతటి ‘వైరాగ్యం’ కలిగిన గాయకుడు సామాన్యుడా! శ్రీరామచంద్రుని కల్యాణ గుణాలను కీర్తిస్తూ కృతులను విరచించిన భారతీయ వాగ్గేయకారులలో మొట్టమొదటివాడు, త్యాగరాజు. ‘నిధి చాలా సుఖమా! రాముని/ సన్నిధి సేవ సుఖమా! నిజముగ పల్కు మనసా..’ మొదలైన కీర్తనలు ఆయన వైరాగ్యాన్ని, రామభక్తిని వేనోళ్ల నిరూపిస్తాయి. రాజులెంత గొప్పవాళ్లు అయినా వారిని స్తుతించరాదని ఈ కీర్తనలోనే.. ‘మమతా బంధనయుత నరస్తుతి సుఖమా..’ అని బాహాటంగా చెప్పాడు. తన సంగీతాన్నంతా సర్వేశ్వరుడైన శ్రీరామచంద్రునికి సమర్పించుకున్న మహాభక్తుడుగా, ‘నాదబ్రహ్మ’గా పేరు గాంచిన సంగీత చక్రవర్తి త్యాగరాజు.