ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక గమ్యం ఉంటుంది. ఆ గమ్యం కేవలం ఇహలోక సంపదలను కూడబెట్టుకోవడమో, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడమో అయితే అది అసంపూర్ణమే. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవాలన్నా, సృష్టికర్తకు అత్యంత సన్నిహితులు కావాలన్నా ఒక్కటే మార్గం.. అదే ‘సత్కార్యాల మార్గం’. ఖురాన్ చెబుతున్న ఆ మార్గమే ‘ముహ్సినీన్’ (మేలు చేసేవారు) మార్గం. ‘నిశ్చయంగా అల్లాహ్ మేలు చేసేవారిని ప్రేమిస్తాడు’ అని ఖురాన్ పలుమార్లు గుర్తుచేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే. అరబీలో ‘ముహ్సినీన్’ అంటే కేవలం దానం చేసేవారని మాత్రమే అర్థం కాదు. ఏ పనైనా ఎంతో నైపుణ్యంతో, చిత్తశుద్ధితో, బాధ్యతాయుతంగా చేసేవారు ముహ్సినీన్. వీరు దానగుణం కలవారు, పిసినారితనం లేని ఉదార స్వభావులు, తీవ్ర కోపంలోనూ ఆత్మ నిగ్రహం కోల్పోని సంయమనశీలురు. ఇతరుల తప్పులను మన్నించే విశాల హృదయం, పొరపాట్లు జరిగినప్పుడు వెంటనే పశ్చాత్తాపంతో దైవం వైపు మళ్లే సద్గుణం వీరి సొంతం. అలాంటి వారంటేనే అల్లాహ్కు ఇష్టం.
ప్రవక్త హితబోధ ప్రకారం, ఒక మనిషి సంపాదించిన సంపద అంతా అతనిది కాదు. తాను ఖర్చు చేసి, పరలోకానికి ముందుగా పంపుకొన్న (పుణ్యకార్యాల రూపంలో చేసిన) సంపద మాత్రమే అతనిది. మిగిలినదంతా వెనుక ఉండిపోయే వారసులది. ఈ కోణంలో చూసినప్పుడు దానగుణం అనేది ఒక పెట్టుబడి. ఒక విత్తనం ఏడు వెన్నులను, ఒక్కో వెన్నులో వంద గింజలను ఎలా ఇస్తుందో, అల్లాహ్ మార్గంలో చేసే చిన్నపాటి సాయం కూడా అనంతమైన ప్రతిఫలాన్ని ఇస్తుంది.