ఇంట్లో నిత్యపూజ ఉదయం చేయలేకపోతే, సాయంత్రం చేయవచ్చా?
పూజ అనేది సమర్పణతో కూడిన దైవారాధన. స్థూలంగా మనం రక్షణ, స్వతంత్రత, అభివృద్ధి, సుఖం, ప్రశాంతత, ముక్తి కోసం.. దైవారాధన చేస్తుంటాం. వివిధ ద్రవ్యాలతో పూజ చేసినా.. కర్తకు ప్రధానంగా ఉండవలసింది నిర్మలమైన మనసు! ఆర్ష సంప్రదాయం ఆధ్యాత్మిక సాధనలకు ప్రాతః సంధ్యాకాలం శ్రేష్ఠమైనదని నిర్ణయించింది. ఆ సమయంలో ప్రకృతి పరిశుద్ధంగా, ఉష్ణోగ్రత తీవ్రతలు లేకుండా, ప్రశాంతంగా భగవంతుడి సేవకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు, రాత్రి నిద్రపోయి ఉదయాన్నే లేచిన మనిషికి అలసట తీరిపోతుంది. మనసు కుదుటపడుతుంది. కొత్త ఉత్సాహంతో ఉంటాడు. అందుకే ప్రాతఃకాలంలో పూజ చేయడం వల్ల మనసు దేవుడిపై లగ్నం అవుతుంది.
వేకువజామున, తొలి సంధ్యవేళలో దైవారాధన వల్ల దేవతానుగ్రహం లభిస్తుందని శాస్త్ర వచనం. అయితే, ఏ కారణం వల్లనైనా నిత్యారాధన ఉదయం వీలుపడకపోతే కుంగిపోవలసిన పనిలేదు. సాయంకాలం కూడా అనువైనదే! అయితే, పగలు బాగా పనిచేసి అలసిపోతాం. దీనికితోడు నానారకాల సామాజిక స్పందనలకు గురై మనసు నిశ్చలంగా ఉండకపోవచ్చు. కాబట్టి, సాయంత్రం పూజ చేయాల్సివచ్చిన నాడు పూజకు ముందు కాసేపు విశ్రాంతి తీసుకొని, చక్కగా స్నానం చేసి అర్చన చేయవచ్చు. పూజకు ప్రాతఃకాలమే తొలి ప్రాధాన్యం. తప్పనిసరి పరిస్థితుల్లో సాయంత్రం చేయవచ్చు.