Maha Shivaratri | మహాశివరాత్రి పర్వదినం వచ్చేసింది. ఈ నెల 26న బుధవారం రోజున జరుపుకోనున్నాం. ఈ పండుగ మిగతా పండుగలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. దాదాపుగా అన్ని పండుగల సమయాల్లో పిండి వంటలు చేసుకొని ఆరగిస్తారు. శివరాత్రి రోజున ఇలాంటివేవి ఉండవు. ఆ రోజున అందరూ ఉపవాసం ఉంటూ జాగరణ చేస్తారు. శివరాత్రి రోజునే శివుడు లింగరూపంలో దర్శనం ఇచ్చాడని.. ఆ రోజున ప్రతి ఒక్కరూ జాగరణ చేయాలని పండితులు చెబుతుంటారు. అయితే, మహాశివరాత్రి రోజున ఎందుకు ఉపవాసం ఉండాలి..? ఎందుకు జాగరణ చేయాలో తెలుసుకుందాం రండి..!
బిల్వపత్రాలతో పూజించాలి..
మహాశివరాత్రి పర్వదినం రోజున భక్తిశ్రద్ధలతో పూజించి.. ఆయనను స్మరించడం వల్ల శాంతి, ప్రశాంతతను పొందుతారని పండితులు పేర్కొంటున్నారు. పవిత్రమైన రోజు రాత్రివేళ్లలో మనుషుల్లో సహజంగా శక్తులు పెరుగుతాయని.. రాత్రి వెన్నుముకను నిటారుగా ఉంచిన వారు మరిన్ని ప్రత్యేక శక్తులను సైతం పొందుతారని పండితులు పేర్కొంటున్నారు. అందుకే అన్ని జీవులకన్నా మనుషులు వేగంగా వృద్ధి చెందడంతో పాటు విస్తరించారు. ఈ క్రమంలో వెన్నుముక నిటారుగా అవకాశాన్ని పొందారు. గరుడ, స్కంద, పద్మ, అగ్ని పురాణాల ప్రకారం.. శివరాత్రి రోజున ఉపవాసం ఉండే వారంతా శివుడిని బిల్వపత్రాలతో పూజించాలి. రాత్రి సమయంలో జాగరణ చేయడం మోక్షాన్ని ప్రసాదిస్తాడని.. నరకబాధలను తప్పిస్తాడని పండితులు పేర్కొంటున్నారు. శివరాత్రి యోగరాత్రి అని.. ఆ రోజున ప్రకృతిలో ఉండే తరంగాలు.. విశ్వం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలను మానవ వికాసానికి.. మనిషి తనను తాను తెలుసుకోవడంతో పాటు ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడాటునందిస్తాయి.
ఉపవాసానికి ఎంతో విశిష్టత..
శివరాత్రి ఉపవాసానికి, జాగరణకు ఎంతో విశిష్టత ఉన్నది. ఈ పండుగ రోజున అందరూ ఉపవాసం ఉండాలని శాస్త్రం చెబుతున్నది. చిన్నపిల్లలు, ముసలి, ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు, గర్భిణులు, మందులు తీసుకునే వారికి శాస్త్రం మినహాయింపును ఇచ్చింది. ఉపవాసం ఉండే ముందురోజు.. ఉపవాసం మరుసటిరోజు మాంసం తినకూడదని.. మద్యం సేవించకూడదు. కొందరు ఉపవాసం చేస్తున్నామని.. ఆలస్యంగా నిద్ర లేస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకూడదు. ఉపవాసం ఉండే రోజు సూర్యోదయానికి ముందు నిద్రలేవాలి. తల స్నానం చేసి ఆ పరమేశ్వరుడికి ప్రీతికరమైన శివరాత్రి రోజున ఉపవాసం చేస్తున్నానంటూ సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అంటే.. ఉప అనే పదానికి సమీపంగా అని.. వాసం అంటే దగ్గరగా అని అర్థం. దేవుడిపై మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఉపవాసం వల్ల శరీరంలోని విషపదార్థాలన్నీ తొలగిపోతాయి. శరీరంలో ప్రాణశక్తితో ఇంద్రియ నిగ్రహాన్ని పెంపొందిస్తుంది. అయితే, నీటిని తాగకుండా ఉపవాసం చేయాలని ఎవరూ చెప్పలేదు. శరీరాన్ని కష్టపెట్టకుండా భగవంతుడిపై మనసును లగ్నం చేయడం కష్టమే. శివరాత్రి రోజున ప్రకృతిలో ఉన్న శివశక్తులను గ్రహించాలంటే వెన్నును నిటారుగా ఉంచి కూర్చోవాలి, నిలబడాలి.
శివతత్వాన్ని జాగృతం చేసేదే జాగరణ..
శివరాత్రి రోజున జాగరణ చేస్తే.. మనుషుల్లోని శివతత్వాన్ని జాగృతం చేస్తుంది. సినిమాలు చూస్తూ.. ఏవో కబుర్లు చెప్పుకోవడం.. ఏదో సరదాగా కాలక్షేపం చేయడం జాగరణ కాదు. దాంతో పుణ్యం మాట దేవుడెరుగు ఆ సమయంలో మాట్లాడే మాటల్లో ఏవైనా చెడు మాటలు ఉంటే పాపం వస్తుంది. శివరాత్రి రోజున, మరుసటి రోజున ఉదయం శివాలయానికి వెళ్లి ప్రసాదం తీసుకోవాలి. ఆ తర్వాత ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతాన్ని ముగించాలి. అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ చేసేవారంతా తర్వాతి రోజు రాత్రి వరకు నిద్రపోకూడదు.. అప్పుడే సంపూర్ణ ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.
శివుడు అభిషేక ప్రియుడు..
శివుడు భోళాశంకరుడు. ఆయన అభిషేక ప్రియుడు. పరమేశ్వరుడికి కొన్ని నీటిని పోసినంతనే సంతోషపడిపోతాడు. శివరాత్రి రోజున అందరూ ఆయనను అర్చించి.. అభిషేకిస్తే.. అనుగ్రహంతో జీవితంలో ఉన్న గ్రహపీడలు తొలగిపోతాయి. నిశ్చలమైన భక్తితో కాసిన్ని జలాలతో అభిషేకిస్తే ఆయన ప్రసన్నుడై అభీష్టాలన్నీ నెరవేరుస్తాడు. అందుకే ఆయనను భోళాశంకరుడని పిలుస్తుంటారు. హిందువులు అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతుంటారు. ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత, ప్రత్యేక పరమార్థం ఉంటుంది. శివార్చనలో అభిషేకం కీలకమైంది. గంగ జలరూపం కాగా.. జలం పంచభూతాల్లోనూ.. శివుడి అష్టమూర్తులోనూ ఒకటి. ‘అప ఏవ ససర్జాదౌ’ అన్న ప్రమాణాన్ని బట్టి బ్రహ్మ మొదట జలాగ్నే సృష్టించాడు. ప్రాణులన్నింటికీ ప్రాణాధారం నీరే. మంత్రంపుష్పంలోని ‘యోపా మాయతనంవేద’ ఇత్యాది మంత్రాలలో నీటి ప్రాముఖ్యం వివరించారు. అందుకు శివపూజలో అభిషేకానికి ప్రాముఖం ఏర్పడింది.