శ్రీమద్భాగవతం భగవల్లీలా రస సాగరం. రస దృష్టితో అపారమైనభాగవతానికిసారం దశమ స్కంధం. అందునా పూర్వార్ధంలోని ‘రాస పంచాధ్యాయి’గా ప్రసిద్ధమైన (29 నుంచి 33 వరకు) ఐదుఅధ్యాయాలూ సారాతిసారం. సారసాక్షుడు శ్రీకృష్ణుడు కూడా సారగ్రాహి. ప్రేమశాస్ర్తానికి పరాకాష్ఠ అయినభాగవత పురాణానికి పంచాధ్యాయాలు ప్రాణపంచకం.‘మానవుని చిత్తంలో ఇంతవరకు గుప్తంగా, సుప్తంగా ఉన్న మాధవ భగవానుని దివ్యప్రేమ అనే విత్తం ఈ రాసప్రసంగ అధ్యయన, శ్రవణ, మననాలతో జాగృతమై సువ్యక్తమవుతుంది’- అని భావుక భక్తుల, భాగవత అనురక్తుల అనుభవ సూక్తం. అయితే, రాసలీల ఎంత రసమయమో అంతకంత రహస్యమయం కూడా!
శ్రీమద్భాగవతంలో అత్యధిక ఆక్షేపణకు, అపార్థానికి, ఈసడింపునకు లోనైన ఘట్టాలలో ‘రాసలీల’ మొట్టమొదటిది. తాను దొంగైతే పొరుగువాణ్ని నమ్మడన్నట్లు, కృష్ణుని తత్త స్వరూప స్వభావాల అవగాహనా రాహిత్యమే ఇందుకు కారణం. ‘కృష్ణస్తు భగవాన్ స్వయం’ కృష్ణుడు ఆత్మారాముడు, పూర్ణకాముడు. సర్వతంత్ర స్వతంత్రుడైన పరమాత్ముడే అయితే ఇంద్రియారాముని వలె కామపరతంత్రుడై పరభామలను పొందడమేమిటి? అని ప్రధాన అధిక్షేపణం…
విషయా(కామా)సక్తి అనే కామల(కామెర్ల) రోగగ్రస్తునికి నిరామయ- భగవదీయ ‘రాసలీల’ కామలీలగా కనిపించడం ఏమంత ఆశ్చర్యం? భగవల్లీలా విమర్శ చేసేటప్పుడు భగవంతుని దేహం, గుణాలు, కర్మలు (జన్మకర్మచ మే దివ్యం గీత) అప్రాకృతాలు అనీ, జీవులకు వలె అవి భౌతికాలు కావనీ మరువరాదు. వస్ర్తాపహరణ లీల జీవుల అజ్ఞాన ఆవరణ భంగ లీల. రాసలీల జీవ బ్రహ్మ ఐక్య లీల! శుద్ధ జీవుల పంచ ప్రాణాలు పరబ్రహ్మలో రమించడమే రాసం. రసం ప్రతి మనిషిలోనూ ఉంది. అయితే, అది ఏకాదశ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు ఇంద్రియాలకు ఆవల, అవ్యక్తంగా ఉంది.
రస స్వరూపుడైన బాలగోపాలుని ముఖాన జాలువారితే (రాసలీలా విలాస సమయానికి వాసుదేవ కృష్ణుని వయసు పది సంవత్సరాల లోపు) ఆ రసం పదకొండు ఇంద్రియ కుల్యాల కాలువలలో కూడా ప్రవహిస్తుంది. సర్వేంద్రియాలను చషకాలు పానపాత్రలుగా చేసికొని, వేణుగానలోలుని ఆ రసపానం చెయ్యాలి. ఇందుకు అనన్య ఆదర్శమూర్తులు ధన్యలైన గోపకన్యలు కాంతలు. ‘గోభిరింద్రియైః కృష్ణభక్తి రసం పిబంతి ఇతి గోప్యః’ ఇంద్రియ పాత్రలతో అతీంద్రియ కృష్ణ భక్తి రసాస్వాదన చేయువారే గోపికలు. దీనివలన మృణ్మయ ఇంద్రియాలు చిన్మయాలవుతాయి. మనసు అమనస్కమవుతుంది. ‘మనోనాశో మహోదయః’ మనసు మరణించుటే అనగా మనోలయమే జీవన్ముక్తి. రాసలీల భాగవతానికే ఫలశ్రుతి.
రాస శబ్దం రస శబ్దం నుంచి ఏర్పడింది. ‘రసః’ అనగా పరబ్రహ్మ. ‘రసోవై సః’ అని తైత్తిరీయ ఉపనిషత్తు వచనం. ఆనంద స్వరూపుడైన శ్రీకృష్ణపరమాత్మకే ‘రసః’ అని నామం. ఆయన తన నీడలు, స్వరూపాలూ ఐన జీవులతో ఆడే ఈ జగన్నాటకమంతా ‘రాసక్రీడే!’ రాసలీల కామ లీల కాదు, కామ విజయ లీల! భోగలీల కాదు, భగవత్ సంయోగలీల! విషయ విలాస లీల కాదు, హృదయ వికాస లీల! కృష్ణుడు యోగి కాడు, యోగేశ్వరేశ్వరుడు. రాసక్రీడ ఘట్టం విన్నా, చదివినా, చింతన చేసినా కలిగే మహత్తర ఫలం కామ నివృత్తి! ‘హృద్రోగమాశ్వప హినోతి’ అన్నాడు శుక యోగీంద్రుడు. హృదయ రోగం అంటే కామం. అది తొలగిపోతుంది.
ఇంద్ర॥ ‘గోపాల కృష్ణుండును గోపకాంతల్
ప్రాపించి క్రీడించిన భంగులెల్లన్
రూపించి వర్ణించి నరుండు హృత్సం
తాపంబులన్ బాయును దత్ప్రసక్తిన్’
ఇలా గోపాలకృష్ణుడూ, గోపికలూ రాసక్రీడ సలిపిన సరణిని ఏ పురుషుడు అభివర్ణిస్తాడో, శ్రద్ధగా ఆకర్ణిస్తాడో అతని సమస్త మనస్తాపాలు తొలగిపోతాయని పోతనామాత్యుని పసిడి పలుకులు. ఈ మాటలు జ్ఞప్తి స్మృతిలో ఉంటే, ‘రాసలీల’ కామలీల అనే దుర్భావనకు ఏమాత్రం తావు ఉండదని విజ్ఞప్తి. సర్వేశుడైన వాసుదేవునితో గోపికల భాసుర (జ్ఞానపూర్వకమైన) మానసిక మేళనమే రాసలీల. ‘మమైవాంశో జీవలోకే జీవభూత స్సనాతనః’ గీత. జీవుడు అంశ బిందువు. దేవదేవుడు అంశి సింధువు. జీవాత్మ అనే రస బిందువు పరమాత్మ అనే రస సింధువులో ఏకమైపోవడమే ‘రాసం’.శుకముని పరీక్షిన్మహారాజా! ఇంతలో నిండు పున్నమి వెన్నెలతో దిక్కులను మెండుగా ప్రకాశింపచేస్తూ శారద రాత్రులు తారసిల్లాయి.
ఆ॥ ‘కామ తంత్ర టీక కలువల జోక కం
దర్పుడాక విటుల తాల్మి పోక
చకిత చక్రవాక సంప్రీత జనలోక
రాక వచ్చె మేలు రాక యగుచు’
‘కామశాస్ర్తానికి వ్యాఖ్యాన వివరణమైనది, కలువలను వికసింప జేసేది, కామ వికారాన్ని విజృంభింపజేసేది, విటుల జారుల సహనాన్ని మటుమాయం జేసి బేజారు (కంగారు) పరచేది, జక్కవ పిట్టలకు జంకు బెదురు పుట్టించేది, జన సముదాయానికి ముదం సంతోషం సమకూర్చేది, తన రాకతో లోకుల కాక(తాపం) పోకార్చుతూ తొలగిస్తూ అన్ని రకాల మేలు కలిగించే రాకా పూర్ణిమ నిండు పున్నమి వచ్చింది’. టీక, జోక, డాక, పోక, వాక, లోక, రాక.. ఈ ‘క’కార కేకీ (నెమలి) కేరింతల పాటలతో సయ్యాటలాడే ఈ ‘ఆటవెలది’ మయూరి మన పోతన సూరి (పండితుని) భూరి మధురిమల గరిమ!
అనంగుడు మన్మథుడు ఇలా అహంకరించాడు… ‘సరస్వతీ ప్రసంగంలో నేను బమ్మ బ్రహ్మకు కూడా రిమ్మ తెగులు (ఒక్కుమ్మడిగా వ్యామోహం) పుట్టించాను. ముక్కంటి మొదట నన్ను మసి చేసినా క్షీరసాగరమథనం, మోహినీ ప్రసంగంలో ‘మీదై నా కరంబుంట మేల్గాదే’ అన్నట్లుగా నాదే పై చెయ్యి అయ్యింది గదా! అహల్యా విషయికంగా ఇంద్రుణ్ని ఓడించాను మిక్కుటంగా మోహం పుట్టించి మహేంద్రుని కుక్కుటం (కోడి)గా మార్చి అతనిచే ‘కూత’ పెట్టించాను. దేవగురువు భార్య తార విషయంలో చంద్రునికి ఒకతీరుగా జలతారు కుళ్లాయి (కుచ్చుటోపీ) పెట్టాను. ఇక, వాతాంబు పర్ణాశనులైన గాలి, నీరు, ఆకులు ఆహారంగా తపస్సు చేసే విశ్వామిత్ర, పరాశర, సౌభరి మొదలైన మునీంద్రులు ఉండనే ఉన్నారు. ఇంక, నా జనకుడు విష్ణువు కృష్ణుడే మిగిలాడు’ అని మిడిసిపాటుతో బుద్ధి పెడతల పట్టగా తండ్రితో కూడా తలపడాలని తలపోశాడు. తనయుని సవాలుని తండ్రి స్వీకరించాడు.
మ॥ ‘తరుణుల్ గొందరు మూల గేహముల నుద్దండించి రారాక త
ద్విరహాగ్నిం బరితాపమొందుచు మనో వీధిన్ విభున్ మాధవుం
బరిరంభంబులు సేసి జారుడనుచున్ భావించియుం జొక్కి పొం
దిరి ముక్తిన్ గుణ దేహమున్ విడిచి ప్రీతిన్ బంధ నిర్ముక్తలై’
శుకుడు రాజా! చల్లని తెల్లని వెన్నెల అల్లన బృందావన యమునా తీరాన్ని ముంచెత్తింది. వనమంతా అతి కమనీయంగా కనకన రుచిరంగా ఉంది. కాత్యాయనీ వ్రత ఫలాన్ని అనుగ్రహిస్తూ పరమాత్మ గోపికలకు ఇచ్చిన వాగ్దానాన్ని (రాగల రాత్రులయందు అనగా ప్రపంచ స్ఫురణ జ్ఞప్తి లేని సమయంలో నా కలయిక మీకు లభించగలదు, నాతో విహరించగలరు) చెల్లించాలని సంకల్పించాడు. బృందావనాన్ని వీక్షించి ఆ రాత్రులను విహార యోగ్యం గావించాడు. యోగమాయను ఆశ్రయించి భక్తుల కొరకు దివ్య మనస్సును నిర్మించుకొన్నాడు. రాసలీలకు ఉపక్రమిస్తూ భగవంతుడు వాసుదేవుడు వేణువుతో గోపాంగనలకు మనోహరంగా ‘కల’ (అవ్యక్త మధుర) గానం ఆలపించాడు.
ఈ వంశీధ్వని కేవలం కాత్యాయనీ వ్రత గోపికలకే వినిపించింది. సంసారాసక్తమైన మనస్సును హరించేది కాన ‘మనోహరం’. ఆ మధుర గానం విని గోపికలు పరవశించిపోయారు. తత్తరపాటు చెందారు. కలవరపడ్డారు. ఏ పని చేయడానికీ వారికి చేతులాడ లేదు. ధర్మ, అర్థ, కామాలనే త్రివర్గాన్ని త్యాగం చేశారు. కులాచారాలు ఇంటి కట్టుబాట్లను ఉపేక్షించడం ధర్మత్యాగం. పాలు పిదకడం, కాచడం మొదలైన వానిని వదలడం అర్థత్యాగం. భోజన, శృంగార, అలంకార, ఆభరణ అపేక్ష వదలడం కామత్యాగమని వ్యాఖ్యానం. చేస్తున్న పనులను అర్ధంతరంగా వదలివేసి, కాటుకలు చక్క దిద్దుకొనకుండా, కేశాలు సవరించుకొనకుండా పతులు, మామలు, మరుదులు, తోబుట్టువులు వారిస్తున్నా వెనుకకు మరలకుండా, ఒకరినొకరు పిలుచుకొనకుండా, ‘ఎవరికి వారే యమునాతీరే’గా, ఆ మందయానలు తొందర తొందరగా నందనందనుని సందర్శనానికి శ్రీకాంతుని సన్నిధికి వెళ్లారు.
శుకుడు రాజా! కొందరు గోపకాంతలు నట్టిళ్లలో నుంచి ఒక్కపెట్టుగా ధైర్యంతో వెడలి రాలేకపోయారు. అట్టివారు కృష్ణ విరహాగ్నిలో తపించి తపించి, ఆ దుఃఖానుభవంతో సర్వపాప విముక్తి పొందారు. శ్రీపతినే ఉపపతిగా జారుడని భావిస్తూ తమ మనోవీధులలోనే పరిష్వంగం- ఆలింగనం చేసుకుని పరవశించి పోయారు. ఈ సుఖానువంతో వారి పుణ్యమంతా క్షీణించిపోయింది. పాపపుణ్యరూప కర్మల ఫలంగా వచ్చిన గుణమయ శరీరాలను పరిత్యజించారు. భగవల్లీల – రాసంలో ప్రవేశానికి యోగ్యమైన అప్రాకృత దివ్య దేహాలు పొందారు.
(సశేషం)
తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006