ఫీజు కట్టాలని టీచర్ రోజూ కొడుతున్నారు. రేపు ఫీజు కట్టకపోతే నిన్ను వెంట తీసుకుని రమ్మంటున్నారు’ అని ఓ కుర్రాడు మొరపెట్టుకుంటున్నాడు. ఆ రోదనలు అక్కడే తన తండ్రి సమాధిని సందర్శించడానికి వచ్చిన ఓ వ్యక్తి చెవిలో పడ్డాయి. చుట్టూ చూడగా ఓ చెట్టు కింద సమాధి మీద పడి దీనంగా ఏడుస్తున్న బాలుడు కనిపించాడు. ఇంతలో ఆ వ్యక్తి ఫోన్ మోగింది. ‘మీరు చెప్పిన పూలు ఫలానా దుకాణంలో మాత్రమే ఉన్నాయి. పైగా ఈ రోజు మార్కెట్కు పూలు రాలేదు. అందుకే ధర ఎక్కువ చెబుతున్నారు’ అన్నాడు ఫోన్లో అవతలి వ్యక్తి. ‘నాకు కావలసిన పూలు ఇక్కడే దొరికాయి. నువ్వు మా నాన్న సమాధి ఉన్న శ్మశానానికి వచ్చేయి’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. తన తండ్రి వర్ధంతి సందర్భంగా సమాధిని పూలతో అలంకరించి నివాళులు అర్పించడం అతనికి అలవాటు. అయితే, ఈసారి మాత్రం పూలకు వెచ్చించే సొమ్ముతో ఆ అనాథ బాలుడి ఫీజు కట్టడమే తన తండ్రికి నిజమైన నివాళి అని భావించాడు. వెంటనే ఆ బాలుడి తలపై చేయిపెట్టి ‘నేనున్నాన’ని భరోసా ఇచ్చాడు. తనకు ఏ లోటూ రాకుండా చూసుకుంటానని అండగా నిలిచాడు.
అనాథలను ఆదుకోవాలన్నది ఇస్లామ్ ధర్మ ప్రబోధం. అనాథ పిల్లల తలను ఆప్యాయంగా నిమిరితే.. ఆ తలలో ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని పుణ్యాలు మన కర్మల పత్రంలో జమ అవుతాయని ఇస్లాం చెబుతుంది. అనాథలను ఆదరించాలని ఖురాన్ స్పష్టంగా చెప్పింది. తల్లిదండ్రులు లేని పిల్లల ఆస్తిని కబళించడం మహాపాతకమని హెచ్చరించింది. అనాథల విషయంలో దైవానికి భయపడాలని పేర్కొన్నది.
ఒక వ్యక్తి ఒకసారి మహాప్రవక్త (స)ను కలుసుకొని ‘నా కొడుకు మూడు రోజుల నుంచి ఆచూకీ లేకుండా పోయాడు. వాడి తల్లి బెంగతో అన్నపానీయాలు మానేసింది. మా అబ్బాయి క్షేమంగా ఇంటికి చేరాలని అల్లాహ్ను ప్రార్థించండి’ అని మొరపెట్టుకున్నాడు. అతని బాధకు ప్రవక్త మనసు కరిగిపోయి చేతులెత్తి అల్లాహ్ను వేడుకున్నారు. అంతలోనే ఓ వ్యక్తి పరుగుపరుగున వచ్చి ‘ఆ తప్పిపోయిన కుర్రాడిని నేను గుర్తుపట్టాను. ఫలానా తోటలో పిల్లలతో ఆడుకుంటున్నాడు’ అని చెప్పాడు. ఈ మాటలు విన్నవెంటనే ఆ తండ్రి సంతోషంతో ఆ తోటకు పరుగెత్తబోయాడు. ప్రవక్త (స) అతణ్ని పిలిచి ‘చాలా తొందరలో ఉన్నట్లున్నావు. నేను చెప్పేది జాగ్రత్తగా విను; ఆ తోటలోకి వెళ్లాక పిల్లాడిని గుర్తించాక వాడిని పేరుపెట్టి మాత్రమే పిలువు. నాన్నా; కుమారా! అని మాత్రం పిలవకు. అలా పిలిచావంటే అక్కడ ఉన్న పిల్లల్లో అనాథ పిల్లల మనసు నొచ్చుకుంటుంది. చనిపోయిన వాళ్ల అమ్మానాన్నలు గుర్తుకొస్తారు. మా నాన్న కూడా ఉంటే మమ్మల్ని ఇలానే పిలిచేవాడని పసి మనసు గాయపడుతుంది. దుఃఖం పొంగిపొర్లుతుంది. అందుకే మీ అబ్బాయిని పేరుతో పిలిచి ఇంటికి తీసుకెళ్లు’ అని సలహా ఇచ్చారు. అంటే అనాథ పిల్లల మనసు కూడా గాయపడకుండా జాగ్రత్త వహించాలన్నది ప్రవక్త ప్రబోధం.
-ముహమ్మద్ ముజాహిద్, 96406 22076