మన జీవితంలో ఓ మంచి స్నేహితుణ్ని సంపాదించుకోవడం చాలా కష్టతరం. ఈ స్వార్థ జగత్తులో, ఎవరి బతుకు వారిదే అన్నట్టున్న ఈ రోజుల్లో నిబద్ధత గలిగిన స్నేహితులు కనిపించడం అరుదైన విషయమే! మానవుడికి శుభం కలిగించే మంచి స్నేహం గురించి యోబు భక్తుడు చెబుతూ ‘ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును ఆలాగున నీకు మేలు కలుగును’ (యోబు, -22,:-21,) అని ప్రస్తావించాడు. దేవుడితో సహవాసమా? ఎంత గొప్ప భాగ్యం? దేవుడితోనే మాట్లాడుతూ, ఆయనతోనే ఆలోచిస్తూ, చర్చిస్తూ, అన్న పానీయాలు సేవిస్తూ ఆయనతోనే నిరంతరం నివసిస్తూ ఉండటం ఎంతటి అవకాశం!
నిజమే ప్రభువుతో కలిసి నడిచిన వారికి, నిత్యం తిరిగిన వారికి అనుక్షణం ఆయన రక్షణ లభిస్తుంది. విడువక, ఎడబాయక మనల్ని కంటికి రెప్పలా కాచి కాపాడతాడు. అంతేకాదు ‘నీవు నావాడవు’ అని భరోసా ఇస్తాడు. అలా అనగలిగేది ప్రేమ, బాధ్యత ఉన్నవాడే. నీవు దాక్కునే స్థలంలో కూడా రక్షణ కవచంలా పక్షిరెక్కలా కాచి కాపాడే గొప్ప స్నేహితుడు దేవుడు. ‘నేను నిన్ను విమోచించి యున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను.. నీవు నా సొత్తు’ (యెషయా 43:1) వాక్యాలు.. గొప్ప స్నేహాన్ని చాటిచెబుతాయి.